• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Home

By Staff
|

మన దేశ రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను మన రాజ్యాంగ లక్షణాలుగా, లక్ష్యాలుగా రాసుకున్నారు. ఈ నినాదాలు నేటివి కావు. శతాబ్దాల క్రితం ఫ్రెంచ్‌ విప్లవం చారిత్రక ప్రాంగణంలోకి ముందుకు తెచ్చిన నినాదాలు ఇవి. ఈ నినాదాలను పైపై మాటలుగా కాకుండా నికార్సయిన ఆచరణాత్మక వాస్తవాలుగా చేయగలిగినప్పుడు మాత్రమే మన రాజ్యాంగ స్ఫూర్తికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ నినాదాలను ముందు తెచ్చేటప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్నలు కొన్ని వున్నాయి. ఉదాహరణకు, స్వేచ్ఛ అనే తొలి భావాన్నే తీసుకుందాం. ఈ అంశాన్ని ముందుకు తెచ్చేటప్పుడు మనం ప్రధానంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఎవరికి ఎవరి నుంచి స్వేచ్ఛ అనేది. నేటి మన దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో ఎవరికి ఎవరి నుంచి స్వేచ్ఛ కావాలనేది అసలైన ప్రశ్నగానే వుంటుంది. రాజకీయంగా చూస్తే మన దేశ సార్వభౌమాధికారం ఎంత వరకు కాపాడుబడుతున్నదనేది ఈ గ్లోబలైజేషన్‌ యుగంలో ప్రశ్నార్థకమే. పచ్చ నోట్లకు లోబడి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి వెనుకాడని రాజకీయ నాయకులు కోకొల్లలుగా వున్న దేశంలో మనం నిజంగా రాజకీయంగా స్వేచ్ఛగానే వున్నామా అనేది ప్రశ్నార్థకం. అందుకే కాబోలు గతంలో ఒక రాజకీయవేత్త ఇలా అన్నారు- కొన్ని దేశాల విదేశాంగ వ్యవహారాలు నిజంగా విదేశీయమైనవే. ఎందు చేతనంటే అవి విదేశాలలోనే తయారు అవుతాయి గనుక. నేడు తెహెల్కా డాట్‌కామ్‌ బయట పెట్టిన పెద్ద మనుషుల గుట్టు ఆ నేత మాటలు నిజమేనని అనుకోవడానికి వీలు కల్పిస్తోంది. ఇక దేశ అంతర్గత వ్యవహారాల్లో స్వేచ్ఛ గురించి చెప్పుకోవాలంటే దీనికై రకరకాల స్వేచ్ఛ గురించిన చర్చలోకి దిగవలసి వస్తుంది. ఉదాహరణకు- పత్రికా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ. ఇలా మరెన్నో! వీటిలో మొదటిదైన పత్రికా స్వేచ్ఛను తీసుకుంటే పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావాన్ని, దాని దోపిడీని ఎదిరించే ఎవరికైనా ఈ స్వేచ్ఛ తాలూకు డొల్లతనం బయటపడుతుంది. నేడు పత్రికను స్థాపించడమంటే, అది కోట్లాది రూపాయల వ్యవయంతో కూడుకున్న వ్యవహారం. ఇలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పత్రికను

నడుపగల స్తోమత గల వారు రాజకీయ, ఆర్థిక, సామాజిక పోరాటాల్లో ఏ పక్క నిలబడుతారనేది తేటతెల్లమే. అనివార్యంగా, పోటీ మార్కెట్‌ దృష్ట్యా వెల్లడించుకోవాల్సిన నిజాలను మినహాయిస్తే ఇటువంటి పత్రికా రంగంలో స్వాతంత్ర్య గానాలు, స్వేచ్ఛా ప్రభోదాలు, కవుల ఊహాలోక కమనీయ దృశ్యాలు, సామాన్య జనులకు అవి చెదలేటి కుసుమాలు, అంతు కనుగొనరాని అద్వైత విషయాలు గానే వుండిపోతాయి. అలాగే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు పెట్టుబడికి, కట్టుకథకి పుట్టిన విషపుత్రికే నేటి దిన పత్రిక. అయితే, ప్రతి పత్రిక ఇలాగే వుందనేది నా ఉద్దేశం కాదు. కాని పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధాన స్రవంతిలోని అధిక శాతం పత్రికలు ఇలాగే వుండి తీరుతాయి. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది ఆ వ్యవస్థలోని అతి సామాన్యుడికి గగన కుసుమమే.

ఇక సమావేశ స్వేచ్ఛనే తీసుకుందాం- అసమానతలు పేరుకుపోయిన సమాజంలో కోటానుకోట్ల ప్రజానీకం పూట గడవని స్థితిలో బ్రతుకుతున్నప్పుడు వారికి సమావేశ స్వేచ్ఛ గురించి చెప్ప జూడటం కేవలం వారి పేదరికాన్ని వెక్కిరించడం మాత్రమే. సమావేశ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలంటే దానికి కావలసిన హంగు, ఆర్భాటం చాలా ఉన్నాయి. ఉదాహరణకు- మన పట్టణాల్లో, నగరాల్లో పలు సమావేశాలు జరుగుతుండడం మనం నిత్యం చూస్తుంటాం. ఇవి ఆర్భాటమైన సమావేశ మందిరాలు, ఆడిటోరియాలలో జరుగుతుంటాయి. ఇలా నిత్యం జరిగే ఈ సమావేశ కార్యక్రమాలలో ఎన్నింటిని మన సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారు, నిరుపేదలు ఆ ఆడిటోరియాలలో నిర్వహించుకుంటున్నారనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలాగే, ఈ సమావేశ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలంటే దానికి గాను తగినంత విషయ పరిజ్ఞానం, అలాగే తీరిక అవసరం. బిందెడు మంచినీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లవలసిన పరిస్థితి, పూట గడవడం కోసం రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకోవల్సిన గడ్డుకాలం సామాన్య ప్రజానీకానికి సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛను అటుంచితే వాటిలో పాల్గొనే స్వేచ్ఛనైనా ఎంత వరకు ప్రసాదించగలుగుతున్నాయనేది ఆలోచించవలసిన విషయం. ఇక విషయ పరిజ్ఞానం మాటకు వస్తే జనాభాలో సగానికి సగం మంది నిరక్షరాస్యులు వున్న దేశంలో వారు సమావేశ స్వేచ్ఛను ఎంత వరకు వినియోగించుకోగలరు? అలాగే కాస్తో కూస్తో చదువుకున్నవారు కూడా తమ చుట్టూ జరుగుతున్న వ్యవహారాల లోతుపాతులను అర్థం చేసుకోగల స్థాయి ఎంత మందికి వుందనేది కూడా ప్రశ్నార్థకమే. అందుకే కాబోలు, ఒక హిందీ సినిమాలో విలన్‌ పాత్రధారి పత్రికలు చాలా మంది చదువుతారు, అవి అర్థమయ్యేది కొంత మందికే అని వ్యాఖ్యానిస్తాడు. ఈ మొత్తం నేపథ్యంలో ఇక భావ ప్రకటనా స్వేచ్ఛ గురించిన ముక్తాయింపు అనవసరం.

ఇక సమానత్వాన్ని తీసుకుంటే- తీవ్రమైన ఆర్థిక అసమానతలు వున్న సమాజంలో ఎవరు ఎవరితో సమానమన్న ప్రశ్న ఆవిర్భవించక మానదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చట్టం ముందు అందరూ సమానులే అనేది మనం సాధారణంగా వినే వ్యాఖ్యానం. దీని ప్రకారంగా- పేవ్‌మెంట్ల మీద ఎవరు అమ్మరాదని ప్రభుత్వం ఒక చట్టం చేసిందని అనుకుందాం. ఈ చట్టం ముందు అందరు సమానులే. అయితే, కోట్లాది రూపాయలు వెచ్చించి వ్యాపారం చేసుకునే బడా పారిశ్రామికుడికి షోరూమ్‌లు పెట్టుకుని తన సరుకులను అమ్ముకోగల స్తోమత వుంటుంది. కాని బఠానీలు అమ్ముకొనే వ్యక్తి షోరూమ్‌లు పెట్టుకోలేడు. అతను తప్పనిసరిగా పేవ్‌మెంట్‌నే తన వ్యాపార కూడలిగా చేసుకోవల్సి వుంటుంది. అంటే, చట్టం ముందు అందరూ సమానులే అనేది పైకి ఎంతో అందంగా కనబడుతుంది. అసమానుల మధ్య నిజమైన సమానత్వం వుండదనేది గమనించి తీరవలసిన బ్రహ్మరహస్యం.

ఇక చివరగా, సోదర భావం గురించి చూస్తే పైన పేర్కొన్న అంశాలన్నింటిలోనూ వివక్షకు గురవుతున్నవారు అదృష్టవంతులైన కొద్ది మంది ధనికులతో సోదర భావం నెరపగలరా అనేది ఎవరికి వారు గుండెపై చేయి వేసుకుని ప్రశ్నించుకోవలసిన విషయం. ఈ రకంగా విశ్లేషిస్తూ పోతే, నాటి ఫ్రెంచి విప్లవ నినాదం నేటికి పెట్టుబడిదారీ రాజ్యాంగాలలో, వ్యవస్థలలో తీపి పూత పూసిన చేదు గుళికగానే వుందనేది తేలి తీరుతుంది. deva.paparao@usa.net

ఆర్థిక, సామాజిక రంగాల అవినాభావ సంబంధాన్నివిశ్లేషించడంలో డి. పాపారావుది అందె వేసినచేయి. ప్రపంచ మార్గం ఎటు పోతుందనే జిజ్ఞాసఆయన వ్యాసాలకు ముడిసరుకు. పాపారావు పలు పత్రికలకువ్యాసాలు రాస్తుంటారు.

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X