• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కలిసి ఉండడమెలా?

By కె. నిశాంత్
|

Telangana
సమస్య లేదా వివాదం తలెత్తినప్పుడు హేతుబద్దంగా ఆలోచించాల్సి ఉంటుంది. అలా ఆలోచించడానికి నిజాయితీ అవసరం. ఆలోచనలో విశాల దృక్పథం ఉండాలి. విడిపోదామనే ఆలోచన ఒకరికి వచ్చినప్పుడు కలిసి ఉండాలనే వారికి ఆ లక్షణాలను మరింతగా ఆవసరం. పెద్దన్న పాత్ర వహించడం సరి కాదు. ఆధిపత్యం ధోరణితో మొండి వాదన చేయడం మంచిది కాదు. కలిసి ఉండడం వల్ల తమకు నష్టం జరుగుతున్నదని చేస్తున్నవారి వాదనలను శ్రద్ధగా ఆలోచించాల్సి ఉంటుంది. వారి వేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కావాలి. కానీ అటువంటేదేమీ లేకుండా సమైక్యంగా ఉందామని, తాము కలిసి ఉందామని అంటున్నాం కాబట్టి సమైక్యాంగా ఉండాల్సిందేనని పట్టబడడం ఆధిపత్య ధోరణే అవుతుంది. సమైక్యంగా ఉండడం వల్ల బాధితుడికి లాభం ఎలా చేకూరుతుందో చెప్పాల్సి వుంటుంది. అన్యాయం జరుగుతుందనే భావనను తొలగించడానికి ప్రయత్నించాలి. తెలంగాణ కలిసి ఉండాలని సమైక్యవాదులు పట్టుబడడంలో ఆ ఆధిపత్య ధోరణే ఉంది. తెలంగాణ ప్రజల్లో ఉన్న అనుమానాలను, అపోహలను తొలగించడానికి ఏ విధమైన ప్రయత్నాలు సమైక్యావాద నాయకుల నుంచి జరగడం లేదు. హేతుబద్దంగా వివరించడానికి కృషి జరగడం లేదు. తమ తమ ప్రాంతాల్లో ఉద్యమాలు నడిపి కేంద్ర ప్రభుత్వం వద్ద లాబీయింగ్ జరిపి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. అలా పంతం నెగ్గించుకునే సమయంలో తెలంగాణవారి వాదనలు వినలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాత్రం ఇప్పుడు సమైక్యవాదం వినిపిస్తున్న వారందరూ సానుకూలంగానే ఉన్నామంటూ మభ్యపెడుతూ వచ్చారు.

తెలంగాణ నాయకులను స్వార్థపరులుగా, నిజాయితీ లేనివారిగా సమైక్యవాద నాయకులు చిత్రీకరిస్తూ వచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసమే, పదవుల కోసమే తెలంగాణ నాయకులు విభజనను కోరుకుంటున్నారని వారు తప్పు పట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెంచడం ద్వారా తమ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికే చూస్తున్నారు. ఇంత కాలం రాజకీయ నాయకులకు, తెలంగాణ ప్రజలకు మధ్య వివిధ కారణాల వల్ల దూరం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పడిన తర్వాత ఆ దూరం తగ్గుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈసారి దూరం తగ్గడం ఒక సానుకూలాంశంగా మారింది. ఆ సానుకూలాంశం వల్లనే తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజల ఒత్తిడికి, డిమాండ్ కు తలొగ్గి ప్రజల ఆకాంక్షల మేరకు వ్యవహరించాల్సిన పరిస్థితిలో పడ్డారు. అందుకే తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తాజా ప్రకటన వెలువడిన వెంటనే కొందరు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

నిజానికి, తెలంగాణతో రాయలసీమ, కోస్తాంధ్ర రాజకీయ నాయకుల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే నయాన భయాన, సామభేదదానోపాయాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ మొండి పట్టుదల వల్ల, తమ లాబీయింగ్ ద్వారా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ అణచివేత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి, సీమాంధ్రలో ఉద్యమాలను ప్రోత్సహించిన వైఖరికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేనంత అమాయకంగా నేడు తెలంగాణ ప్రజలు లేరు. మీడియా కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నది. సీమాంధ్రలో లేని ఉద్యమాలను పెద్ద యెత్తున ఉన్నాయంటూ చెప్పడం సాగిస్తూ వచ్చింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమాలను తక్కువ చేసి చూపడమే కాకుండా ఇక్కడ ఉద్యమాలంటే విధ్వంసమే అన్న రీతిలో చూపిస్తూ వస్తున్నది. గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరిగిన సంఘటనలను ఎత్తి చూపిన తీరు, ఆ తర్వాతి పరిణామలపై వార్తలను, విశ్లేషణలను, చర్చల తీరును తులనాత్మకంగా చూస్తే ఎంత పక్షపాతం కొనసాగుతుందో అర్థమవుతుంది. ఇప్పుడు మీడియాలోని తెలంగాణ జర్నలిస్టులను తొలిగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సమైక్యవాదుల వాదనల్లో హేతుబద్దత, కార్యకారణ విశ్లేషణ లేకపోవడాన్ని మీడియా సమర్థిస్తూ వచ్చింది.సీమాంధ్రల్లో రాష్ట్ర విభజనను కోరుకుంటున్నవారి గొంతును మీడియా వినిపించడం లేదు. హైదరాబాదులో సెటిలర్లు తమకు తెలంగాణ రాష్ట్ర ఇస్తే ఇబ్బంది లేదని, తెలంగాణ ఇవ్వాలని అంటూ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆందోళనకు దిగిన సంఘటనకు మీడియాలో స్థానం లేకుండా పోయింది. ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను వినిపించకుండా రాజకీయ నాయకుల వాదనను వినిపించేందుకు మాత్రమే మీడియా కట్టుబడి పని చేస్తూ వస్తున్నది.

పైగా, నవంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు భౌగోళికంగా వేరు పడకపోయినా రాష్ట్రం మానసికంగా వేరు పడిపోయింది. ప్రజల మధ్య విద్వేషాలు మరింతగా పెరిగే పరిస్థితి వచ్చింది. మానసికంగా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య దూరం పెరుగుతూ ఉన్నది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు విడిపోయారు. హైదరాబాదుతో, తెలంగాణతో కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనాలు ఇమిడి ఉంది. వారే ప్రస్తుత విద్వేషాలకు, ప్రజల మధ్య విభేదాలకు కారణమవుతున్నారు. వారి ప్రయోజనం లేకుంటే ఈ కారణం చెప్పకుండా, నిర్హేతుకంగా కలిసి ఉందామని మొండిపట్టు పడుతున్నారు. తెలంగాణలో ఉద్యమాలకు మేధావులు, విద్యార్థులు నాయకత్వం వహిస్తుంటే, సీమాంధ్రల్లో రాజకీయ నాయకులు ఏ నిర్బంధాలు లేకుండా, స్వేచ్ఛగా విహార యాత్రలు చేస్తూ ఆందోళనలు సాగించారు. ఈ తేడా మరింతగా తెలిసిపోతున్న కొద్దీ ఇరు ప్రాంతాల ప్రజల మధ్య దూరం భవిష్యత్తులో కూడా కలవడానికి అవకాశం లేకుండా పెరిగిపోతాయి. సమైక్యాంధ్రకు తెలంగాణకు చెందిన సురవరం ప్రతాప రెడ్డి, కాళోజీ, దాశరథి వంటి మేధావులు, రచయితలు, కవులు కోరుకున్నారు. కానీ, సీమాంధ్ర పెద్దలు భావైక్యతను సాధించడంలో విఫలమయ్యారు. రెండు ప్రాంతాల సంస్కృతులను కలిపి ఒక ఉమ్మడి సంస్కృతిని రూపొందించేందుకు ప్రయత్నాలు జరగలేదు. అలాంటి ప్రయత్నాలు చేసిన తెలంగాణవారు రెండో తరగతివారిగానే మిగిలిపోయారు. అందుకే రెండోసారి కాళోజీ ప్రత్యేక తెలంగాణను కోరుకున్నారు. ఆయన బాటలోనే ఇప్పుడు తెలంగాణ మేధావులు, రచయితలు కదులుతున్నారు. సీమాంధ్రల నుంచి మేధావులు, రచయితలు, కవుల గొంతులు వినిపించడం లేదు. అంతగా మేధో వర్గం ఆ ప్రాంతాల్లో బలహీనపడిపోయింది. భావ దారిద్ర్యం రాజ్యమేలుతున్నది.

English summary
Is it possible to live unitedly?: K Nishanth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X