కెసిఆర్ నిజాం నైజం

K Chandrasekhar Rao
నిజాం ప్రభువును తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రశంసించడంపై మరోసారి దుమారం రేగుతోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కెసిఆర్ పై చిందులేశారు. నారాయణ అలా చిందులేయడానికి ముందు సిపిఐ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల త్యాగాల మీద మాత్రమే ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలు బతుకుతున్నాయి. అది తమ చేతుల్లోంచి జారిపోతుందేమోననే భయమే వారిని అర్థసత్యాలను ఎప్పటిలాగే ప్రచారం చేయడానికి పూనుకుంటున్నారు. తెలంగాణ వీరుల త్యాగాల మీద ఆంధ్ర రాజకీయాలను నడిపిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవడానికి గానీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడానికి అసలు కారణాలను గానీ ఏనాడూ పట్టించుకోలేదు. పైగా అర్థసత్యాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. నిజానికి సెప్టెంబర్ 17వ తేదీ విమోచనతో కమ్యూనిస్టు పార్టీలకు ఏ విధమైన సంబంధం లేదు. నిజాం ప్రభువు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోయిన తర్వాత కూడా అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం సాగింది. తెలంగాణలో దాదాపు 4 వేల మంది భారత యూనియన్ చేతిలో హతమైన తర్వాత గాని ఆ పార్టీ కళ్లు తెరవలేదు. స్టాలిన్ చెప్పినా వినకుండా, రావి నారాయణ రెడ్డి వాదించినా పెడచెవిన పెట్టి సాయుధ పోరాటాన్ని నిజాం లొంగిపోయిన తర్వాత కూడా సాగించి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

నిజాం లేకపోతే కమ్యూనిస్టు పార్టీలకు దిక్కు లేదు. నిజాంను ఎంత క్రూరుడిగా చిత్రీకరిస్తే కమ్యూనిస్టులకు అంత నైతిక బలం చేకూరుతుంది. అందుకే నిజాం పరిపాలనపై చిలువలు పలువలు చేసి ప్రచారం సాగించారు, సాగిస్తున్నారు. బ్రిటిష్ పాలన భారత్ లో ముగిసిన తర్వాత ఖాసిం రజ్వీ సేనను రప్పించి తాను సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిన కాలం మాత్రం అత్యంత దారుణమైంది. ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజకార్లు సాగించిన దౌర్జన్యాలు, అత్యాచారాలు, హింసాకాండ, అరాచకం అంతా నిజాం పాలనకు అంటుకుంటుంది. అయితే ఇది మాత్రమే నిజాం పాలన కాదు. ఇంతకు మించిన వ్యవహారం ఉంది. హైదరాబాదు సంస్థానంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం, ఇతర ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టుల కోసం నిజాం ప్రభుత్వం చేసిన మేలు చిన్నదేమీ కాదు.

ఫ్యూడల్ వ్యవస్థకు ఉండే అవలక్షాణాలన్నీ నిజాంకు ఉన్నాయని, అయితే నిజాం చేసిన మంచి పనులను కూడా చూడాలని కెసిఆర్ చెబుతున్న మాటలు కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్న నారాయణ లాంటి వారి బుద్ధికి కూడా తట్టకపోవడం విచిత్రమే. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వారు తిలోదకాలిచ్చి ఎంత కాలమైందో చూడాల్సిన అవసరం ఇంకా ఉండనే ఉన్నది. చరిత్ర అధ్యయనంలో నిష్పాక్షికత అత్యవసరమైన అంశం. ఆ అంశాన్ని కాదని కమ్యూనిస్టులు ఏకపక్ష రచనకు, దబాయింపులకు పూనుకున్నారు. తెలంగాణ విమోచనోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర మాత్రమే ఉందనే ప్రచారం కూడా ఏకపక్షంగా సాగించుకుంటున్నారు. కాంగ్రెసు వారు సాయుధ పోరాటం చేశారని గానీ, ఆర్యసమాజ్ వారు పోరాటాలు చేశారని గానీ వారు చెప్పిన దాఖలాలు లేపు. చరిత్ర రచనలో ఇతరుల పాత్ర లేకుండా చేసిన, చేయడానికి ఏ మాత్రం జంకకుండా వ్యవహరిస్తున్న కమ్యూనిస్టులకు ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ రొద ఎలా వినిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+