తెలంగాణకు సిఎం కారా?

నిజానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంతటికీ నాయకుడు. మిగతా నాయకులతో తాను ఆ రకంగా వేరు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రాష్ట్రానికంతటికీ ప్రాతినిధ్యం వహించాల్సిన ఆయన రాయలసీమను సొంతం చేసుకుని మాట్లాడడం ఏ రకంగా సమర్థనీయం. మనం అనే పదం వాడడంలోనే ఆయన పక్షపాత ధోరణి అర్థమవుతోంది. రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి మనం అనే పదం వాడాల్సి ఉంటుంది.కానీ ఆయన రాయలసీమ ప్రాంత ప్రజలతో మాత్రమే మమేకవుతున్నారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే రాజశేఖర రెడ్డి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. తొలి దశ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెసు ఓడిపోతుందా, గెలుస్తుందా అనేది కూడా అంత ముఖ్యం కాదు. ఓట్ల కోసమైనా సరే రాజశేఖర రెడ్డి అలా మాట్లాడడం, ఆ మాటలను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల తాత్కాలిక ఇంచార్జీ వాయలార్ రవి సమర్థించడం తెలంగాణ ప్రజలను అవమానించడమే. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే. రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఉండాలంటే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమైక్యంగా ఉండాలంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉండకూడదంటే అన్ని ప్రాంతాల ప్రజలు సమానమనే భావన అందరి మనస్సులో నాటుకుని పోవాలి. కానీ ఇంత కాలం ఆ భావైక్యత ఏర్పడలేదని ముఖ్యమంత్రి మాటలను బట్టే అర్థమవుతోంది. మనం అనే తెలంగాణేతర ప్రాంతంలోని రాజశేఖర రెడ్డి వంటి నాయకులకే లేకపోతే మిగతా వారి సంగతి చెప్పనవసరం లేదు. నిజానికి, తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డిని ఆదరించారు. ఆ ఆదరణకు రాజశేఖర రెడ్డి చెల్లించిన మూల్యం ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టి, తెలంగాణ ప్రాంత ప్రజలను అవమాన పరచడం.
తెలంగాణపై ఇతర ప్రాంతాల రాజకీయాధిపత్యం ఏ రీతిలో ఉందో రాజశేఖర రెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. ఒక్క రాజకీయాధిపత్యమే కాదు, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యాధిపత్యం తెలంగాణ ప్రజలను అవమానపరిచేవిగానూ, అణచివేసేవిగానూ ఉన్నాయి. ఆ ఆధిపత్యాల ధిక్కరణకు కెసిఆర్ ప్రతినిధి.












Click it and Unblock the Notifications