వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోదండరామ్ నేం చేయాలి?

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

Kodandaram
తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ పై సీమాంధ్ర నేతలు గుర్రుమంటున్నారు. మాటల తూటాలు విసురుతున్నారు. కోదండరామ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై కేసులు పెట్టాలని అడుగుతున్నారు. ఆయనపై గవర్నర్ నరసింహన్ కూడా ఫిర్యాదు చేశారు. దానికి తోడు, ఆయన నైతికతను ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రొఫెసర్ వ్యవహరించాల్సిన తీరులో ఆయన వ్యవహరించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీమాంధ్ర నేతలు తమ స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కోదండరామ్ ను ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి కోదండరామ్ కు లేదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నాయకులు అంటున్నారు.

కోదండరామ్ పై విమర్శలు చేస్తున్న రాజకీయ నాయకులు తాము నిర్వర్తించిన, నిర్వర్తిస్తున్న పాత్రపై ఏ ఒక్కసారైనా పునరాలోచన చేసుకున్నారా, ఆత్మ విమర్శ చేసుకున్నారా అనేది అడగాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు సక్రమంగా ఉంటే, ప్రజల గురించి ఆలోచించి ఉంటే కోదండరామ్ వంటి ఒక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. తెలంగాణ డిమాండ్ పై గానీ, సమైక్య నినాదంపై గానీ రాజకీయ నాయకులు ఒక అవగాహనకు వచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక స్పష్టతకు రావాల్సిన అవసరాన్ని కూడా రాజకీయ నాయకులు గుర్తించడం లేదంటే రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే, చంద్రబాబు తెలంగాణకు అనుకూలమని చెప్పి, ఆ తర్వాత రెండు ప్రాంతాలు రెండు కళ్లు అంటూ గోడ మీద పిల్లిలా వ్యవహరించడం ఏ మేరకు సమంజసమనే విషయాన్ని తెలుగుదేశం నాయకులు ఎలా సమర్థించుకుంటారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతున్నా సమస్యను పరిష్కరించే దిశగా కాకుండా సమస్యను జటిలం చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించడం ఏ మేరకు న్యాయం. ఇది చంద్రబాబుకు స్థాయిని కల్పిస్తుంటే, కోదండరామ్ ప్రజల తరఫున పోరాడుతుంటే స్థాయి లేనివారవుతారా.

కోదండరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్. రాజకీయ సిద్ధాంతాలు ఆయనకు తెలియనివి కావు. రాజకీయాలు ఎలా ఉండాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోని అత్యంత మేధావుల్లో కోదండరామ్ ఒకరనే విషయాన్ని గుర్తించడానికి రాజకీయ నాయకులు నిరాకరిస్తున్నారు. తమ పంచన చేరి రవీంద్ర భారతిలోనో, త్యాగరాయ గాన సభలోనో సన్మానాలు పొందుతూ ప్రజలను పట్టించుకోని ప్రొఫెసర్లంటేనే రాజకీయ నాయకులు ముద్దు. సన్మానాలకు, అవార్డులకు వెంపర్లాడకుండా ప్రజల కోసం నిరంతరం పోరాడే కోదండరామ్ వంటివారు రాజకీయ నాయకులకు ఎప్పుడూ కంటగింపుగానే ఉంటారు. ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని సమన్వయం చేయడానికి కోదండరామ్ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తమ న్యాయమైన ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఒక పనిముట్టుగా ఆయన ఉపయోగపడుతున్నారు. దాన్ని ఆయన తన బాధ్యతగా స్వీకరించారు.

ప్రజల పట్ల బాధ్యత ఉందని భావిస్తున్నారు కాబట్టే కోదండరామ్ సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఉద్యమంలోకి వస్తే ఎదురయ్యే ఇబ్బందులు ఆయనకు తెలియనివి కావు. పరిణామాలకు సిద్ధపడే ఆయన ముందుకు దూకారనే విషయాన్ని అందరూ గ్రహించాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి గల సంస్థలు. అందువల్ల కోదండరామ్ పై చర్య తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. అయితే, విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు వైస్ చాన్సలర్ గానీ, చాన్సలర్ గా గవర్నర్ గానీ చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. ఆ మేరకు చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు. అయితే, పౌరులందరికి మాదిరిగానే యూనివర్సిటీ ఆచార్యుడైన కోదండరామ్ కు భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను ఆయన తెలంగాణ ఉద్యమ సమన్వయానికి వాడుతున్నారు. దాని వల్ల ఎదురయ్యే పరిణామాలకు కూడా ఆయన సిద్ధంగానే ఉన్నారని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కోదండరామ్ పై చర్యలు తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలు ప్రభుత్వాలకు తెలియంది కాదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X