సమైక్యవాదులు ఒప్పించరెందుకు?

సీమాంధ్రకు చెందిన సమైక్యవాద రాజకీయ నాయకులు మాత్రం తెరాస నాయకులను దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు తమ తమ విధానాల్లో తమ తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమైనా తెలంగాణ కోసం ఒత్తిడి పెంచుతున్నారు. ఈ స్థితిలో సమైక్యవాద రాజకీయ నాయకులు శాంతివచనాలు బోధిస్తున్నారు. శాసనసభను, పార్లమెంటును వదిలి సమైక్యవాదం గురించి మాట్లాడుతున్న రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నించాల్సిన కర్తవ్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారనేది ప్రశ్న. తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలను, మనోభావాలను తెలుసుకుని, ఒకవేళ తెలంగాణ ప్రజలకు చైతన్యవంతులు కాదని భావిస్తే వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత సీమాంధ్ర నాయకులు ప్రవర్తించాల్సిన అవసరం ఉందనే కనీస వాదననైనా ముందుకు తేవాల్సిన వాతావరణం ప్రస్తుతం ఉంది.
తెలంగాణ సమస్యను ప్రస్తావించకుండా పార్లమెంటు, శాసనసభ సజావుగా సాగిపోవాలని, సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి పర్యటనలు తెలంగాణలో ఆటంకాలు లేకుండా జరిగిపోవాలని, తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి సీమాంధ్ర నాయకులను తెలంగాణలో తిరిగనివ్వాలని డిమాండ్లు పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుంది. తెలంగాణ ప్రజలు తాము తమకు ఆడ్డు తగలకుండా ఏం చేసినా ఫరవాలేదు, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు కూడా వారి ఆకాంక్షను ప్రతిబింబించకూడదు అనే వైఖరి ప్రజాస్వామ్యంలో ఎంత వరకు సమంజసమని అడగాల్సిన అవసరం ఉందనేది నేడు గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఒక ప్రాంతం ప్రజలు ఈ ప్రభుత్వం తమకు వద్దని వాదిస్తుంటే, తమ సమస్యను రాజ్యాంగ పరిధిలో పరిష్కరించాలని కోరుతుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తుంటే ఆ ప్రజలను వదిలేసి మాట్లాడడం సబబు అనిపించుకోదు. చెప్పాలంటే, ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజల కోసం ఉంది. ఒక ప్రాంత ప్రజలు తమకు సమస్య ఉందని వీధులకు ఎక్కితే దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది. తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల కన్నా ప్రభుత్వంపై ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి, తమను ప్రశాంతంగా ఉండనివ్వాలని అడగడం మంచిది కాదు. సహనం హద్దులు దాటితే, తెలంగాణ ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక దూకుడుగా వ్యవహరిస్తే తెలంగాణ రాజకీయ నాయకులది తప్పుగా కనిపించడడం కూడా సరికాదు. సమస్యను పరిష్కరించడానికి వేదికను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది.
ఈ కాలమ్‌లో వ్యక్తమైన అభిప్రాయాలతో దట్స్ తెలుగు డాట్ కామ్‌కు ఏ విధమైన సంబంధం లేదు.












Click it and Unblock the Notifications