తెలంగాణ పరిష్కారంపైనే కాంగ్రెసు భవిష్యత్తు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడాన్ని, తెలంగాణ సమస్యను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరులు తీసుకోవడం లేదు. పైగా, తెలంగాణ సమస్యను పరిష్కరించడాని కన్నా వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ రెండు విషయాల్లో కాంగ్రెసు పార్టీలోని నాయకుల నుంచి రెండు, మూడు వైఖరులు వ్యక్తమవుతున్నాయి. అవి పరస్పర విరుద్ధంగా కూడా ఉన్నాయి.
నిజానికి, తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే పార్టీని గాడిలో పెట్టడానికి వీలవుతుందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంగా కనిపిస్తోంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకుంటే, తెలంగాణకు వ్యతిరేకంగా గానీ అనుకూలంగా గానీ తీసుకుంటే, పార్టీని గాడిలో పెట్టడానికి వీలవుతుంది. అప్పుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి తగిన ప్రాతిపదిక కూడా లభిస్తుందని కాంగ్రెసు అధిష్టానం గుర్తించడం లేదని అంటున్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు నాయకులు తెలంగాణలో ఓ మాట, సీమాంధ్రలో మరో మాట మాట్లాడుతున్నారు. రాష్టానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుంచే ఆ విధమైన విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు తాను తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో అందుకు పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యానం చేశారు. ఒకరు తమ పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తుంటే, మరొకరు రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తోంది వైయస్ జగన్ అని, రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అనేది సులభంగానే అర్థమవుతోంది. దీన్నిబట్టి ఒక అంశం పట్ల కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకోకుండా ఎప్పటికి ఏది ప్రయోజనం చేకూర్చి పెడుతుందని అనుకుంటే దాన్ని వాడడాన్ని కాంగ్రెసు పార్టీ అలవాటు చేసుకుంది. ఇది కాంగ్రెసు పార్టీకి లాభం చేకూర్చకపోగా నష్టం చేస్తుందనే విషయాన్ని నాయకత్వం గుర్తించినట్లు లేదు.
తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైపు వేలెత్తి చూపుతున్నారు. సరే, చంద్రబాబు లేదా తెలుగుదేశం పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడాన్ని తప్పు పడుదాం. కానీ స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన బాధ్యత, అవసరం కాంగ్రెసు పార్టీకి లేదా అనేది ప్రశ్న. పైగా, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంది. తానో వైఖరి తీసుకున్న తర్వాత వైఖరి తీసుకోని పార్టీలను, తమ వైఖరికి భిన్నంగా వైఖరి తీసుకున్న పార్టీలను విమర్సిస్తే కాంగ్రెసు నిజాయితీ బయటపడుతుంది. తానో వైఖరి తీసుకోకుండా ఇతర పార్టీలను విమర్శించడం వల్ల ప్రయోజనం తాత్కాలికంగానే లభిస్తుంది. తెలంగాణ సమస్యపై కెసిఆర్ వైఖరిని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించినప్పుడు ప్రయోజనం చేకూరి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు కూడా కోరుతున్నారు. నాయకులే కోరుతున్నారంటే, ప్రజలు కూడా అదే కోరుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అంటే, సమస్య అలా రగులుతూ ఉండడం పట్ల సీమాంధ్ర వర్గాలు విసిగిపోయాయని అనుకోవచ్చు. ఈ విసుగు తమకు వ్యతిరేకంగా కూడా మారుతుందనే విషయాన్ని కాంగ్రెసు నాయకత్వం గుర్తించడం లేదు.
పైగా, చంద్రబాబు చేస్తున్న ప్రచారం కూడా కాంగ్రెసుకు వ్యతిరేకంగానే పరిణమిస్తుంది. తెలంగాణలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి తెలంగాణ కార్డును వాడుకుంటున్నా, అది దీర్ఘకాలంలో కాంగ్రసును దెబ్బ తీస్తుంది. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీదని, సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, సమస్యను పరిష్కరించకుండా తనపై నిందలు వేస్తూ తన పార్టీని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నారు.
చంద్రబాబు తొలుత తెలంగాణ అనుకూల వైఖరి తీసుకుని తర్వా యు టర్న్ తీసుకున్న ఫలితాలన్ని అనుభవిస్తూనే ఉన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వైఖరి వల్లనో, తమ పార్లమెంటు సభ్యుల వైఖరి వల్లనో కాంగ్రెసు అంతగా తెలుగుదేశం పార్టీలా దెబ్బ తినలేదు. కానీ, ఇటు తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా కాంగ్రెసు పరిస్థితి అధ్వాన్నంగా మారే పరిస్థితి ఉంది. సీమాంధ్రలో వైయస్ జగన్ వల్లనే ప్రమాదం అనుకోవడం కూడా కాంగ్రెసు నాయకత్వ అవగాహనారాహిత్యమే. సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం పట్ల దాన్ని ప్రజల విసుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే సీమాంధ్రలో కూడా పార్టీని గాడిలో పెట్టుకుని ముందుకు సాగడానికి వీలవుతుందనే విషయాన్ని కాంగ్రెసు నాయకత్వం గ్రహించడం లేదు.
తెలంగాణ సమస్యను పరిష్కరించనంత వరకు ఎంత మంది పరిశీలకులు హైదరాబాదు వచ్చి అభిప్రాయాలు తెలుసుకుని నివేదికలు సమర్పించినా, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రాష్ట్ర ఆగ్ర నాయకులకు క్లాస్‌లు తీసుకున్నా, సోనియా గాంధీ ఆగ్రహాలు ప్రదర్శించినా ఫలితం ఉండదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ సమస్యను పరిష్కరించాలనే అధిష్టానాన్ని అడుగుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే మిగతా విషయాలపై స్పష్టతకు రావడానికి కాంగ్రెసు ఆధారం లభిస్తుంది.












Click it and Unblock the Notifications