వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: క్వశ్చన్ అవర్

|
Google Oneindia TeluguNews

ప్రశ్నలు.. ప్రశ్నలు.. ప్రశ్నలు. ఈ లోకంలో అనేక ప్రశ్నలు. అనేక ప్రశ్నలకి అనేకమైన సమాధానాలూ వున్నవి. అన్ని ప్రశ్నలకు అందరూ సమాధానం చెప్పలేరు. తాత్వికులుగా మారిన తాగుబోతులు తప్ప. వీళ్లు ఆల్రెడీ వున్న సమాధానాలని తల కిందు చేస్తారు. తమ సొంత సమాధానాలు ఫిక్స్ చేస్తారు. మనమంతా వుంటున్న ఈ భూమిని ఎవరు మోస్తున్నారన్న ప్రశ్నకు మీ దగ్గర వో సమాధానం వుంటే వుండవచ్చు. కానీ ముగ్గురు మందు బాబులూ కల్సి సెటిల్ చేసిన ఆన్సర్ యిది.

ఆకాశంలో సీలు తీయని మందు బాటిల్లా వెలుగుతున్నాడు చంద్రుడు. శూన్యంలో దొర్లించిన మందు సీసాలా తన చుట్టూ తాను తిరుగుతోంది భూమి. కరెంటు స్తంభాలకి వేలాడదీసిన క్వార్టర్ బాటిళ్లలా వెలుగుతున్నయి స్ట్రీట్ లైట్లు. గాలిలో వున్న మందు వాసనకు అక్కడక్కడా చెట్ల కొమ్మలు మత్తుగా వూగుతున్నాయి.

 Chintapatla Sudarsahn quick boxing

రోడ్డంట నడుస్తున్నారు ముగ్గురు మిత్రులు. కాదు.. కాదు.. తన వీపు మీద ఎక్కిన వాళ్లని రోడ్డు వదిలించుకోడానికి ముందుకు తోస్తున్నది. ఒకడి కళ్లు రంగుల రాట్నంలా గిరగిరా తిరుగుతున్నాయి. ఒకడి కాళ్లు బద్ద శత్రువుల్లా చెరో దిక్కున నడుస్తున్నాయి. ఒకడు బోర్లా పడుకుని గజ ఈతగాడిలా రోడ్డు మీద ఈదుతున్నాడు.

ఒకడన్నాడు. భూమేంట్రా యిలా వాటరు సోడా కలపకుండా ఫుల్ బాటిల్ గుద్దేసిన లారీ చక్రంలా తిరుగుతున్నది అన్నాడు. రెండోవాడన్నాడు. బ్రదర్ యువ్వార్ రాంగ్ భూమి లారీ చక్రంలా కాదు సముద్రంలో పడవలా వూగుతున్నది అటూఇటూ. మూడో వాడన్నాడు. బ్రదర్స్ యూబోత్ ఆర్ రాంగ్. భూమి కల్తీ సారా తాగినట్లుంది. పడిపోకుండా నేను పట్టుకున్నాను కనుక సేఫ్‌గా వుంది. మొదటి బాబు కోప్పడ్డాడు. మందు కొట్టినోడిలా మాట్లాడకు. భూమిని నువ్వు పట్టుకోవడమేంట్రా. అదేదో నూరు తలలో వెయ్యి తలల పామో వుంది కదా. అది పట్టుకునుంది అన్నాడు.

ఏ జమానాలో వున్నవురో భూమిని పాము పట్టుకోడమేంట్రా ఫూల్ అన్నాడు రెండో మందు భయ్యా. ఊరుకోండ్రా మందు తక్కువైతే మెదడు పని చెయ్యదు. అసలీ భూమంటే ఏమిటి? ప్రపంచమన్న మాట. ప్రపంచమంటే ఖండ ఖండాలు నరికేస్తే దేశ దేశాలు చీరేస్తే రాష్ట్ర రాష్ట్రాలు వాటిని ఉతికి ఆరేసేది సర్కార్లు అన్నాడు మూడో మందు మాస్టర్.

అయితే నువ్వనే దేమిటి? మనం ష్టడీగావున్న ఈ భూమిని సర్కారు మోస్తున్నదని అంతేగా కరెక్టేనా అన్నాడు మందు బాబు వన్. మందులో సోడా ఎంత కలపాలో నీళ్లెన్ని పొయ్యాలో అయిసుముక్క లెన్ని విసిరెయ్యాలో తెలీదునీకు.. సర్కారు సంగతేం తెలుస్తుంది. అసలు.. ఈ భూమిని సర్కారు మొయ్యడ మేమిట్రా అన్నాడు మందుబాబు టూ.

నీ ఆన్సర్‌కి క్వశ్చనేస్తా చూస్కో.. భూమిని సర్కారు మోస్తుంది. ఇది గ్యారంటీ. అయితే సర్కారును మోస్తున్నదెవరు. అదిరా క్వశ్చన్. అది రా ప్రశ్న. బస్తీ మే సవాల్ రా అన్నాడు మందుబాబు త్రీ.

ముగ్గురి కడుపుల్లోని ప్రేవుల్లో సారా సెవన్ సీటర్ ఆటోలా పరుగుపెట్టింది. నా వల్ల కావడం లేదురా బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది అన్నాడు వన్ తల మీద బాదుకుంటూ. లాస్ట్ పెగ్గు సగం వదిలేసి రావడం వల్ల మెదడు అక్కడ్నే వుండి పోయిందిరా అన్నాడు టూ.

బ్రాండు మార్చడం వల్ల చిన్న మెదడుక్కోపం వచ్చినట్లుంది. మాట వినడం లేదు అన్నాడు త్రీ. దెబ్బకు దయ్యం దిగి రావాల.. వొచ్చేప్పుడు తెచ్చా ఈ క్వాటర్ లాగించండి యిద్దరూ అన్నాడు మొదటి వాడు క్వాటర్ తీసిస్తూ.

ఫ్రెండువంటే నువ్వేరా.. వున్నది మాకిచ్చేస్తే మరి నీకురా అన్నయ్యా అన్నారు టూ, త్రీ. పాంటు కుడిజేబు మీదయితే ఎడం జేబు నాదిరా నా కోటర్ నాకుందిలే అంటూ ఇంకో కోటర్ బయటకు తీశాడు వన్. మందులోకి సోడా లేదు. నీళ్లు లేవు. నవలడానికి కోడి కాళ్లు లేవు. ఆలుగడ్డ వేళ్లు లేవు... అంయితేనేం అసలు మజా యిదేరా అనుకుంటూ మందు కొట్టారు ముగ్గురు మళ్లీ.

ఆల్‌రెడీ లోపలవున్న, వయసైపోయిన మందు, నాలాల్లో మూసిలా ప్రవహిస్తున్న మందు.. కొత్త మందు యమస్పీడుగా వచ్చి మీద పడ్డంతో నయాగారా జలపాతమై దూకింది. ముగ్గురి మెదళ్లు ఛార్జై, రీఛార్జై, సర్ ఛార్జై పోయినయి.

ఇప్పుడు చెప్పండ్రా. ఏంట్రా మనడవుటు.. ఏంటదీ... ఈ భూమిని ఎవడు మోస్తున్నాడు. అంతేకదా క్వశ్చన్ అన్నాడు మొదటి మందు బాబు. డొక్కలో లాగి పెట్టి కిక్కిచ్చింది రా మందు.. అదేరా భూమిని సర్కారు మోస్తున్నదని అనుకున్నాం కదా డవుటే లేదు అన్నాడు రెండో మందు బాబు. ఇప్పడు నాకంతా క్లియర్‌గా కనిపిస్తున్నదిరో... భూమిని సర్కారు మోస్తుంది.. రైట్.. సర్కారును మోస్తున్నది ఇదిగో... ఇదే.. ఈ మందే! అన్నాడు మూడవ వాడు క్వార్టర్ సీసాని నెత్తిమీద పెట్టుకుని స్టెప్పులేస్తూ.

కరెక్టు... నూరులో ఒకటి పక్కన రెండు సున్నాలున్నంత కరెక్టు.. ఈ భూమిని ఈ సర్కారునీ ఈ భూమ్మీద ప్రజలనీ, రాజకీయ నాయకుల్ని రౌడీల్ని ఉద్యోగస్తుల్ని, కలెక్టర్లని, పోలీసులని.. ఎవ్వరిబడీని మోస్తున్నది.. ఈ రంగురంగుల రంజైన మందు.. ముద్దొచ్చే మందు... కిక్కిచ్చే మందు.. మందంటే మందు.. మందంటే మందే! అనరిచాడు ఒకడు. స్టెప్పలేశారు ముగ్గురు మైకం జాక్సన్లు.

అరే ఆగండ్రా! నాకొత్త అయిడియా వచ్చింది. అసలు మందు గొప్పా మందేసే మనిషి గొప్పా! అందువల్ల సరైన క్వశ్చన్‌కి సరైన ఆన్సరేమిటంటే ఈ భూమిని మోస్తున్నది మందు బాబులే. అదిరా లా పాయింట్ మందు బాబులం అంటే మనం లేకుంటే గవర్నమెంటు బొక్క బోర్ల పడిపోతుందిరా అతే! అందుకే మనమేరా ఈ భూ ప్రపంచకాన్ని మోస్తున్నది మనమే అనరిచాడు మరొకడు. మందుకి జిందాబాద్! మందు బాబులకి జిందాబాద్! అని అరిచారు ముగ్గురూ.

- చింతపట్ల సుదర్శన్

English summary

 An eminent columnist Chintapatla Sudarshan in his column quick boxing on question hour touched several issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X