హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: టర్నింగ్ పాయింట్

By Pratap
|
Google Oneindia TeluguNews

అదో చీమలు దూరే చిట్టడివీ, కాకులు దూరే కారడివీ. అడివైతేనేం జనం దాటి పోడానికి ఓ పిల్ల బాటవుంది. ఆ బాటకి ఆ వైపూ ఈ వైపూ ఊళ్లున్నాయి. ఈ ఊళ్లోనించి ఆ వూళ్లోకి, ఆ వూళ్లోనించి ఈ ఊళ్లోకి నడచి వెళ్లే మనుషులున్నారు. ఊళ్లల్లో మనుషులున్నట్టే అడవిలో జంతువులూ వున్నయి. జంతువులు అనేకం అయితే వాటిల్లో పులులు కూడా వుంటయి.

ఒకానొకనాడు పొద్దు పడమటి గూట్లో పడబోతున్నవేళ. సూర్య కాంతిని బూడిద రంగు క్రమక్రమంగా మూసుకువస్తున్న సమయం. ఓ మనిషి అడవి బాట వెంట అడుగులు వేస్తూ వస్తున్నాడు. అడుగులు వడివడిగా పడ్తున్నాయి. తొరతొరగా అడవిదారి దాటి వూరికి చేరాలని ఆరాటం ఆ మనిషిది. ఆ ఆరాటం ఆ మనిషి అడుగుల్లో వినిపిస్తున్నది.

Chintapatla Sudarshan quick boxing: Turning point

గూళ్లకు చేరుతున్న పిట్టలు తమ ఫ్రెండ్స్‌కి గుడ్‌బై చెప్పున్నవి రకరకాల శబ్ధాలు చేస్తూ. నడుస్తున్న మనిషి గుండె గడియారంలా టిక్కు టిక్కు మంటున్నది. ఇహనో, ఇంకాస్సేపటికో మరి కొంచెం టయానికో ఊరోచ్చేస్తుంది. అమ్మోవ్ అడవి దాటి వూళ్లో పడితే తప్ప ప్రాణాలకు గ్యారంటీ లేదు అనుకుంటూ నడుస్తున్నాడు మనిషి. ఆ మనిషి పేరేంటో మనకు తెలీదు గనక, ఆ మనిషి దారంట వెళ్తున్నాడు కనక దారిన పోయే దానయ్య అనుకుందాం. దానయ్య దారంట వెళ్తున్నాడు. అడవిదారంట వెళ్తున్నాడు. అడవిదాటి వూరు చేరాలని వెళ్తున్నాడు.

అంతా సాఫీగా జరిగిపోతే సమస్యే లేదు. కానీ జరగలేదంతా సాఫీగా. దారి పక్క, దారికి ఆనుకుని వున్నది వోగుంట. గుంట కాదది బురద గుంట. అడుగు పడితే పైకి లేవకుండా పట్టుకునే బురద దాన్నిండా. బురద గుంటని ఆనుకుని వున్నది వో పెద్ద బండరాయి. బండరాయి వూరికే లేదు. ఖాళీగా లేదు. దాని మీద కదలకుండా మెదలకుండా కూచుని వున్నది వో జంతువది. కొంచెం బాగా కొంచెం సూటిగా చూస్తే తెలుస్తుంది. అదో నాలుక్కాళ్ల జంతువు. దాని తల అంతలావుగా వుంది. దాని తోక బండ మీదనించి కిందకి వెళ్లాడ్తున్నది. దాని చెవులు మిలిట్రీ జవాన్లల్లా నిలబడున్నవి. దాని కాళ్లల్లో లోపలికి ముడుచుకుని పదునైన బాకుల్లాంటి గోళ్లున్నయి. దాని రంగు పసుపు రంగు. ఒట్టి పసుపు రంగు కాదు వొంటినిండా చారలున్నాయి. పసుపు రంగు మీద అద్దినట్టు నల్లటి చారలున్న ఆ ప్రాణిని చూసిన వారెవరైనా ‘పులి' అనే అంటారు. పెద్దపులి అనీ అంటారు.

బండరాయి మీద పొడుగాటి తోక వెళ్లాడేసుకుని కూచున్న పులి ముక్కులో ప్రాణం పట్టుకు కూచున్నది. దాని కడుపులో ఆకలి ఆవురావురు మంటున్నది. సలసలకాగుతున్నది. ఫెళపెళ మండుతున్నది. అయినా అది కదలక మెదలక బొమ్మ పులిలా అరుగు మీద కూచున్నది. ఆ పులి మాంసం మరిగిన పులి. ఆ పులి రక్తం తాగిన పులి. ఆ పులి ఎన్నో ఏళ్లుగా దాని పోయే దానయ్యలను నమిలి మింగి ఆవులించిన పులి. దాని చూపుకి చిక్కిన ఎవరినీ ఒదల్లేదది. గాండ్రిస్తూ పంజా విసిరితే ఎదుటకు వచ్చిన దేదైనా అదిరి చావాల్సిందే. అయినా అదిప్పుడు కదలక మెదలక పులి బొమ్మలా అరుగు మీద కూచున్నది.

కదలక మెదలక అరుగు మీద కూచున్న పులి ముక్కుకి దారంట వస్తున్న దానయ్య వాసన గుప్పుమంది. చెవులకి దానయ్య అడుగుల చప్పుడు వినిపించింది. నోట్లో నీళ్లూరినయి. వేళ్లాడుతున్న తోక కొంచె కొంచెంగా పైకి లేవసాగింది. అయితే అదిప్పుడు మునుపటి బెబ్బులి కాదు. ఏళ్లూపూళ్లూగా అడవిలో తిష్ఠవేసి అనేక మంది రక్త మాంసాలు స్వాహా చేసి యిప్పుడు కదల్లేని మెదల్లేని స్థితిని వచ్చింది. ఎన్ని పాపాలు చేసైనా ఎన్ని ఉపాయాలు చేసైనా అలవాటైన తిండి మానకుండా తినవలసిందేగా.

దారంట వస్తున్న దానయ్య చూపు అనుకోకుండా హఠాత్తుగా దారిపక్క బురద గుంటనానుకుని వున్న బండరాయి మీద పడ్డది. ఆ చూపు బిత్తరపోయింది. అరుగు మీద వున్న పులి కనిపించగానే దానయ్య గుండె స్పీడో మీటర్ గిర్రు గిర్రుమనింది. అడుగు ముందుకు పళ్లేదు. ఒంటి బరువు టన్నుల కొద్దీ పెరిగిపోయింది. ఏ క్షణాన్నయినా అది నాలుక్కాళ్ల మీద ఎగిరిదూకి తన ఒంట్లో రక్తాన్ని ‘స్ట్రా'తో తాగేస్తుంది. తన ఒంట్లో మాంసాన్ని మసాలాల్లేకుండా మారినేట్ చేయకుండానే చీల్చుకు చించుకు తినేస్తుంది అనుకున్నాడు.

పులి ఎగరలేదు. దూకలేదు. అసలు కదల్లేదు. దానయ్యపైనే చూపు నిలిపి యిలా వున్నది.

దానయ్యా భయం లేదు. నేను పులినే కానీ యిప్పుడు వెజిటేరియన్ని. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్న మంచి టైగర్ని. ఈ బండరాయి మీద మెడిటేషన్ చేసుకుంటూ దారివెంట వచ్చే దానయ్యలకు చేతనైన సాయం చేస్తున్నాను. స్వర్గంలో బెర్తు కోసం కృషి చేస్తున్నాను. నిన్ను చూస్తుంటే రోటీ కపడా మకాన్ లేనివాడివిలా కన్పిస్తున్నావ్. నిన్ను చూస్తుంటే గరీబీ హటావో అమలు చెయ్యాలనిపిస్తుంది. అంటూ పంజాలో గోళ్లు కనిపించకుండా దాచుకుని ధగధగ లాడే బంగారు కంకణాన్ని మాత్రం పైకి పట్టుకుని ఎత్తి చూపింది.

దానయ్య గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. బంగారు కంకణం క్షణకాలం కళ్లు మూసుకుపోయేట్టు చేసింది. కానీ, బంగారు కంకణం అని బురదగుంటలో అడుగువేసి పులికి తన మాంసాన్ని తనే ప్లేట్‌లో పెట్టి అందించిన యిది వరకటి దానయ్య కాడు తను. ఆగిన గుండె కొట్టుకుంది. మూసుకుపోయిన కళ్లు తెర్చుకున్నయి. ఇది వరకటి అమాయకత్వం పటాపంచలయింది. పులి మోసం తేటతెల్లమయింది. స్కాములతో తెగబలిసి చేతకాని స్థితికి వచ్చి కదలక మెదలక బండరాయి మీద కూచుని దారే పొయ్యే దానయ్యలను బురద గుంటలోకి లాగడానికి ఎత్తులు వేస్తున్నదని గ్రహించిన దానయ్య పులి మీంచి మొహం తిప్పేసి తనవూరి వైపు అడుగులు వేశాడు వడివడిగా.

అనేక యేళ్లు పులి పంజా బారిన పడ్డ దానయ్య లెందరో దాని జిత్తుల నుంచి బయటపడి, తమ బతుకులు ప్రగతి దారులంట పరుగులు తీస్తయని ఆశిస్తున్నారు.

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing narrated the attitude of society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X