ఆంధ్రప్రదేశ్ కు శ్రీకృష్ణ కమిటీ ఫీవర్

శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపైనే రాజకీయ వర్గాల్లోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో తెలంగాణలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుడు నవంబర్ 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షకు దిగింది మొదలు ఆ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా జీవనంలో తీవ్ర అలజడి, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని రంగాలు తీవ్రమైన కుదుపునకు గురయ్యాయి. తీవ్రమైన రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా అనేది అందరిలో నెలకొన్న ఆసక్తి. ఒక వేళ తెలంగాణకు అనుకూలంగా వస్తే హైదరాబాదు పరిస్థితి ఏమిటనేది కూడా తీవ్ర ఉత్కంఠకు కారణంగా ఉంది. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయాలని లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు చేయవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. అయితే, ఇందుకు తాము అంగీకరించేది లేదని పార్టీలకు అతీతంగా తెలంగాణ రాజకీయ నాయకులు అంటున్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా కెసిఆర్ తన శ్రేణులను ఉద్యమానికి సమాయత్తం చేస్తున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తామని ఆయన చెబుతున్నారు. తెలంగాణలోని అన్ని జెఎసిలు కూడా ఆందోళన తీవ్రతకు కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ఇదే స్థితిలో కాంగ్రెసు తెలంగాణ నాయకులు కూడా రంగంలోకి దిగుతున్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా భవిష్యత్తులో తాము మరింత క్రియాశీలకంగా, దూకుడుగా వ్యవహరిస్తామనే సంకేతాలు అందిస్తున్నారు. అవసరమైతే రాజీనామాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో ఉద్యమాలు ఉధృతమయ్యే అవకాశం ఉంది. కాగా, సీమాంధ్రలో కూడా ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది. కార్యాచరణ రూపకల్పనకు మంగళవారం సీమాంధ్రలోని 14 విశ్వవిద్యాలయాల జెఎసిలు మంగళవారం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో సమావేశమయ్యాయి.
అయితే, సీమాంధ్రలో గతంలో ఉన్నంత తీవ్రంగా ఉద్యమాలు ఉండకపోవచ్చునని అనిపిస్తోంది. గతంలో మాదిరిగా రాజకీయ నాయకులు సీమాంధ్రలో రాష్ట్ర విభజన అంశంపై తీవ్రమైన పట్టుదలతో లేనట్లు అనిపిస్తున్నారు. అయితే, వారి మనసులు మాత్రం పూర్తిగా మారలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తే రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం నాయకులు ఆందోళనలకు పురికొల్పే అవకాశాలున్నాయి. ఏమైనా, పరిస్థితులు ఎలా ఉంటాయోననే భయాందోళనలు మాత్రం ఇరు ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి.












Click it and Unblock the Notifications