• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ కుంచెకు ఎన్నెన్ని వయ్యారాలో....

By Pratap
|

తెలుగు చిత్రకళా ప్రపంచంలో ఓ వటవృక్షం కూలిపోయిది. చిత్రకళకు అత్యంత కీర్తిని, బాహీర్ సౌందర్యాన్ని మాత్రమే కాకుండా ఆత్మ సౌందర్యాన్ని సమకూర్చిన కొండపల్లి శేషగిరి రావు మనకు ఇక లేరు. భారతీయ ఇతిహాసాలను చిత్రిక పట్టడంలో శేషగిరిరావుది అందె వేసిన చేయి. ప్రకృతి, చారిత్రక గాథలను.. ముఖ్యంగా కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం'ను ఆయన సజీవ చిత్రాలుగా మలిచారు. ఆక్వా టెక్స్‌చర్ పెయింటింగ్‌లకు ఆయన మార్గదర్శకుడిగా చెబుతారు. లండన్, అమెరికా, మాస్కో తదితర దేశాల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో శేషగిరిరావు చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. సాలార్‌జంగ్ మ్యూజి యం సహా వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, పిట్స్‌బర్గ్ వేంకటేశ్వరస్వామి ఆలయాలకు ఆయన చిత్రాలు మరింత శోభను తీసుకువచ్చాయి.

Homage to Kondapalli Seshagiri Rao

మనం అంటే ఇది అని కళ్లకు కట్టేలా చెప్పిన కళాకారుడు కొండపల్లి శేషగిరిరావు. నలభైఏళ్ల క్రితం పోతన ముఖచిత్రంగా వచ్చిన ఆంధ్రపత్రికను రంగుల్లో చూసి వందలాది తెలుగువారు ఫ్రేములు కట్టించుకున్నారు. కొండపల్లి ప్రతిభకు నీరాజనాలు పలికారు. అంత అందం, అంత ప్రశాంతత, అంత భక్తి భావం ఆ చిత్రంలో ఒలికించారు.పోతన భాగవతాన్ని 16 సార్లకు పైగా చదివి, మనోలోకాల్లో కాలయానం చేసి కొండపల్లి చిత్రిం చారు. అందుకే దానికి అంత జీవం వచ్చింది. అజంతా, ఎల్లోరా, రామప్ప, రాచకొండ, లేపాక్షి తది తర చారిత్రక చిత్రకళా కేంద్రాలను పర్యటించి, తన భావానుగుణంగా వరూధినీ-ప్రవరాఖ్యుడు, రాణి రుద్రమ, గణపతి దేవుడు, శకుంతల చిత్రాలను చిత్రించారు.

తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కొండపల్లి శేషగిరిరావు ‘తెలుగు తల్లి'ని సాక్షాత్కరింపజేశా రు. ఆ చిత్రం ఆధారంగానే తెలుగు తల్లి విగ్రహాలనూ రూపొందించారు. అదే సందర్భంలో అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు దృశ్యరూపం ఇవ్వవలసినదిగా కొండపల్లిని కోరారు. విశ్వామిత్రుడు వంటి ఐతిహాసిక వ్యక్తుల నుంచి, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి చారిత్రక వ్యక్తుల నుంచి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వరకూ తన చిత్రంలో నీరాజనం పలికారు కొండపల్లి. అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు, జానపద కళాకారులు అంతా.. 12 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్న శేషగిరిరావుగారి మహత్తర చిత్రం లో కొలువుదీరారు.

తెలుగు చిత్రకళను అంతర్జాతీయ వేదికపై సగౌరవంగా ఆవిష్కరించిన కొద్దిమందిలో శేషగిరిరావు ఒకరు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతోపాటు ఎంతోమంది ప్రముఖులు ఆయన చిత్రాలను మెచ్చుకున్నారు. తెలంగాణ కాకిపడగలు, రామప్పదేవాలయం విశిష్టతను వివరించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. 1975లో ప్రపంచ తెలుగుమహాసభలకు ఆయన రూపొందించిన తెలుగుతల్లి పెయింటింగ్ ప్రశంసలు పొందింది. 1994లో శేషగిరిరావును అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రత్యేకంగా సత్కరించారు.

సంగీత ఆంధ్ర విజ్ఞాన కోశం ఎడిటర్ లక్ష్మిరంజన్, మ్యాక్స్ ముల్లర్‌భవన్ డైరెక్టర్ పీటర్ స్విడ్జ్‌ల అభినందనలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలిండియా ఫైనార్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీల గౌరవం పొందారు. హైదరాబాద్ మైసూర్, మద్రాస్, ఆలిండియా ఆర్ట్ ఎగ్జిబిషన్స్, కోల్‌కతా అకాడమీ ఆఫ్ ఫైనార్ట్, ఏపీ లలిత కళా అకాడమీ అవార్డులను అందుకున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ పక్షాన 1988లో ఎమిరిటస్ ఫెలోషిప్‌ను, తెలుగుయూనివర్సిటీ ద్వారా డాక్టరేట్‌ను ఆయనకు అందజేశారు. ప్రతిష్ఠాత్మక హంస అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆర్ట్స్‌పై సురేఖ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సృష్టించిన చిత్రాలు ఉంటాయి.

English summary
Numerous paintings of Seshagiri Rao were placed prominently in Salarjung Museum, Italy, Egypt and England Museums and decorated in internationally reputed personalities’ villas. The ideas for his work were taken from mythological stories, epics, historical events, day to day life of a common man and from village life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X