చావు ఓ చిన్న యాక్సిడెంటబ్బా..: మృత్యుంజయ్ 'మోహన్..'
ఇప్పుడు మనం చూస్తున్న చిత్తప్రసాద్ బొమ్మలు, సునీల్ జానా ఫోటోలు పరిచయం చేసింది మోహనే.
కొడవలితో చెక్కినట్టుండే మోహన్ గారి పొడవైన, పదునైన పెన్సిల్ మొనను మర్చిపోవడం కష్టమే. స్క్రిబుల్స్, గిబుల్స్ జాన్తానై.. రఫారఫ్ గీసిన పెన్సిల్ స్కెచ్చులపై సన్నని బ్రష్ తో ఇండియన్ ఇంకులో ముంచి మీసాల్ని కొనగోటితో మీటుతూ 'ఇంకేటబ్బా సంగతులు' అనడం..ఇంకు బుడ్డిలో నాలుడు డిప్పులు.. ఒక సిప్పు.. ఒక ఉఫ్ఫు..
ఈ సన్నివేశం నేను 20ఏళ్లుగా చూస్తున్నా.. ఇక చూడను..
నేను 20సంవత్సరాలు ఉన్నప్పుడు మోహన్ గారి దగ్గరికొచ్చాను. నాకు మోహన్ పరిచయమై 20సంవత్సరాలు. గోరటి వెంకన్న జీరగొంతు, మోహన్ గారి టేబుల్ పై లెల్లె సురేష్, కలేకూరి ప్రసాదుల పిడికళ్ల డప్పు శబ్దాలతో పాటు జన సందోహం, సాహిత్యం, సహజీవనం చేసే ఆర్టిస్టులు, గద్దర్ పాటలకు గద్దకాళ్ల గంతులు నాకు పరిచయం అయింది ఈ మోహన్ బొమ్మల అన్వేషణలోనే.

మోహన్ ఊతవాక్యం:
'చదువుకు ప్రత్యామ్నాయం లేదబ్బా, ప్రతొక్కరూ చదవాల్సిందే.' ఇది మోహన్ గారి ఊతవాక్యం. మోహన్ గారు మంచి గీతకారి, రాతకారి అంటారు కానీ నిజానికి మంచి చదువరి. అవును.. బయట హాల్ లో గుంపంతా ఎంటీవీలో 'డోంట్ లెట్ మీ బీ ద లాస్ట్ టు నో'కు చిందులేస్తుంటే లోపల తను 'వాసిలీ కింగ్ స్లే' అబ్ స్ట్రాక్ట్ ఆర్ట్ గురించి చదువుతాడు. బయటకొచ్చి 'శీను గాడు చిరంజీవి ఫ్యాన్' సిన్మా చూశారాబ్బా అనీ అడుగుతాడు.

వామపక్ష భావజాలం:
ఈ తరం పొలిటికల్ కార్టూన్ కు అగ్రెసివ్ కలర్ అద్దిన మోహన్ ఏలూరులో 1955 ఎలక్షన్స్ జరిగినప్పుడు తన నాలుగేళ్ల వయసులో మల్లెపందిరి చుక్కల మధ్యలో కంకి, కొడవలి గీసి దీనికే మీ ఓటు అని రాశాడు. తండ్రి జూట్ మిల్లు కార్మికుడు. లేబర్స్ అంతా ఎర్రజెండా పట్టుకొని కదం తొక్కుతూ ఊరేగింపులు, చర్చలు, మీటింగులు, చుట్టూ పుస్తకాలున్న వాతావరణం ఉండటంతో వామపక్ష భావజాలం అబ్బింది.

సాహిత్యం:
నాన్న ఇచ్చిన కార్ల్ మార్క్స్, శ్రీశ్రీ పుస్తకాలు అక్క ఇచ్చిన చలం సోమర్, సెట్ మామ్, హెమింగ్వే పుస్తకాల ప్రభావం, తెలంగాణ సాయుధ పోరాటం గాథలు తనపై గాఢమైన ముద్రవేశాయి. అక్క స్కూలు గోడల మీ మైఖెలాంజిలో పెయింటింగ్-ఏసు క్రీస్తును ఎత్తుకున్న మేరీమాత, శనివారంపేట దేవాలయం మీద సెక్స్ బొమ్మలు, ఎనిమిది, తొమ్మిది శతాబ్దపు సాంప్రదాయపు బొమ్మలు తన మొట్ట మొదటి ప్రేరణ అని చెప్పాడు.

సామాన్యుడి బొమ్మలు:
ఛలో అసెంబ్లీ అంటూ ధృఢమైన దిక్కులు పిక్కలు, రొమ్ము విరుచుకుని పిలుపునిచ్చే సామాన్యుడి బొమ్మలకు దన్నుగా గన్నుల్లాంటి అక్షరాలున్న పోస్టర్లు గోడలపై ఇప్పటికీ మెరుస్తున్నాయి. రాజ్యం, రాజకీయాలు పుట్టకముందే కళ పుట్టింది. కళకో లక్షణం ఉంది. దాన్ని రీచ్ అవడానికి ఎంతో కొంత ట్రై చేస్తామంతే. అంతేకాదు కళ పుట్టింది రాజకీయ ఉద్యమాల కోసమో, సిద్దాంతం కోసమో కాదు, ఆది మానవుల గుహల గోడల మీద బొమ్మలు వేశారంటే ఏదో సిద్దాంతాన్ని ప్రచారం చేద్దామని కాదు.
కళ పుట్టుక, స్వభావం, పరమార్థం గురించి మార్క్సిస్టు మేధావులు, మార్క్సిస్టేతర మహా మేధావులు పరిశోధించారంటాడు మోహన్. మోహన్ ది ప్రాపగండ(ప్రచార) కళ. ఉద్యమాలు, ఊరేగింపులకు పోస్టర్లు వేసినందువల్ల విప్లవ పుస్తకాల అట్టలపై బొమ్మలు వేసినందువల్ల కార్టూన్లలో ఈ ఉద్యమాలని డిఫెండ్ చేసినందువల్ల ఇలాంటి గుర్తింపు వచ్చిందనుకోవచ్చు.

కేవలం 'కళ'అంటే ఒప్పుకోని తత్వం:
ఆర్టిస్ట్ తను ధర్మం అనుకున్నది ప్రచారం చేయడానికి తన బొమ్మల ద్వారా సమాజానికి కొంచెం కంట్రిబ్యూట్ చేస్తాడు. ప్రచారకళ ఆర్ట్ కాదు, దాంట్లో క్రాఫ్ట్ ఉంటుంది. గాఢంగా ప్రేమించే సింపతీస్ ఉంటాయి. అది కేవలం కళ అంటే ఒప్పుకోను అంటాడు మోహన్.
జెన్ బౌద్దం ప్రభావంతో చైనీస్, జపనీస్ ఆర్టిస్టులకు మాత్రమే సాధ్యమయ్యే అతి సున్నితమైన బొమ్మలకు తెలుగుదనం అప్లై చేశాడు. ప్రపంచ చిత్రకారులు లోత్రెక్, విన్సెంట్ వాంగో, గ్యాగిన్, మన ఓ.విజయన్, అబూ మొదలైన కార్టూనిస్టుల గురించి రాసి అచ్చేసిన 'కార్టూన్ కబుర్లు' కార్టూనిస్టులకు
భగవద్ 'గీత'

చాలామందికి తెలియదు:
చాలామందికి తెలియని విషయమేంటంటే హైదరాబాదులో మొట్టమొదటి 2డీ యానిమేషన్ చేసింది మోహనే. ఒక్క బెంగాలీ చిత్తప్రసాదును మినహాయిస్తే మనకాలపు ఏకైక సోషియో-పొలిటికో కార్టూనిస్టుగా మోహన్ ఒక్కడే నిలుస్తాడు.
ఇంత కంట్రిబ్యూషన్ తనకు కేవలం పావు వంతు మాత్రమే సంతృప్తినిచ్చింది అంటాడు మోహన్. కానీ పోస్టర్లతో, రాతలతో తలపండిన మేధావులను, కార్టూన్లతో పాఠకులను, యానిమేషన్లతో కుర్రకారును వంద శాతానికి పైగానే సంతృప్తి పరిచాడు. ఇప్పుడు మనం చూస్తున్న చిత్తప్రసాద్ బొమ్మలు, సునీల్ జానా ఫోటోలు పరిచయం చేసింది మోహనే.

నాన్న గురించి:
మోహన్‌కు స్టూడియోకు ఎవరొచ్చినా.. 'వీళ్ల నాన్న చేనేత సూపర్ స్టార్ గురూ..
మేము పేపర్ మీద మాత్రమే బొమ్మలేస్తాం కానీ వీళ్ల నాన్న నేతలో వేస్తారు' అని మా నాన్నను పరిచయం చేస్తూ నన్ను పరిచయం చేసేవాడు.
ఓ పెద్ద యానిమేషన్ స్టూడియోకో, ఓ కార్పోరేట్ సెక్టార్ కో సీఈవో కావాలన్న మైండ్ సెట్ లేకపోవడం 'మాక్సింగోర్కి' 'ది లోవర్ డెప్త్'ను ఫాలో కావడమే అని చెప్పినట్లు నాకింకా గుర్తు. జీవితాన్ని, ప్రపంచాన్ని ఏ ఒక్క కోణంలో నుంచో చూడటం ఇష్టం లేని మోహన్ విజయవాడ నుంచి హైదరాబాదకు-మగ్దూం భవనం నుంచి సాక్షి ఛానెల్ కు-విశాలాంధ్ర పత్రిక నుంచి తెలంగాణ పోస్టర్ల వరకు సాగిన పయనం విభిన్నమైంది. ఉత్కంఠమైనది.

చావు చిన్న యాక్సిడెంటబ్బా:
మా నాయిన చనిపోయినప్పుడు మా ఇంటికొచ్చాడు. నేను ఏడుస్తుంటే దూరం తీసుకెళ్లాడు. 'చావు ఓ చిన్న యాక్సిడెంటబ్బా.. అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు' అన్నాడు. కానీ మోహన్ సార్ లేడన్న వార్తను సీరియస్ గా తీసుకోకుండా ఉండలేకపోతున్నా. దు:ఖం వస్తున్నది.. గుండె దడదడ కొట్టుకుంటున్నది.
(ఆర్టిస్టో, కార్టూనిస్టో చనిపోయినప్పుడు నివాళి వ్యాసం రాసి క్రాస్ చెక్ కోసం మోహన్ గారికి చదివి వినిపించేవాడిని, ఇప్పుడిది ఎవరికి వినిపించాలి?)
-మృత్యుంజయ్(కార్టూనిస్ట్)












Click it and Unblock the Notifications