వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పాయి-మోడీ! జీఎస్టీకి 17ఏళ్లు: రూపశిల్పి ఎవరో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంపాటు అంటే దాదాపు 17ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ఈయేడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, జీఎస్టీ ప్రధాన రూపశిల్పి ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త అసిమ్‌దాస్‌ గుప్తా గురించి మాత్రం చాలా మందికి తెలియదు.

పుష్కరకాలం పాటు శ్రమించి ఆయన సంక్లిష్టమైన ఈ విధానానికి జీవం పోశారు. ఆర్థిక గణాంకాల మదింపులో ఆయనది అందెవేసిన చేయి. మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో డాక్టరేట్‌ చేసిన ఆయన ప్రతిభను అటల్ బీహార్ వాజ్‌పాయితో పాటు ఆయన తరువాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌సింగ్‌ గుర్తించారు.

అసిమ్‌దాస్ గుప్తా

అసిమ్‌దాస్ గుప్తా

2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పాయి జీఎస్టీ కమిటీకి పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రిగా ఉన్న అసిమ్‌దాస్ గుప్తాను నియమించారు. జీఎస్టీకి తుది రూపకల్పన చేయాలని సూచించారు. ఆ తర్వాత ప్రధాని అయిన ఆర్థికశాస్త్రవేత్త మన్మోహన్‌ కూడా జీఎస్టీకి అసిమ్‌దాస్‌ మాత్రమే స్పష్టమైన రూపం ఇవ్వగలరని విశ్వసించారు. కాగా, దాస్‌ గుప్తా జీఎస్టీ విధి విధానాలపై పారిశ్రామిక వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థికసంస్థలతో సుదీర్ఘంగా చర్చించారు. తొమ్మిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆ కమిటీలో సభ్యులుగా ఉండేవారు. 2011లో పశ్చిమబెంగాల్‌లో మమత అధికారంలోకి రావడంతో అసిమ్‌దాస్‌ గుప్తా జీఎస్టీ కమిటీ సారథ్యం నుంచి తప్పుకున్నారు. జీఎస్టీ విధానానికి 80లో రూపకల్పన ఇచ్చానని దాస్‌ గుప్తా స్వయంగా చెప్పారు. పరోక్ష పన్నుల విధానంలో ఆయన దార్శనికత తాజాగా అమల్లోకి వచ్చిన జీఎస్టీలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఆయన తరువాత కె.ఎం. మణి, అమిత్‌ మిత్రాలు జీఎస్టీ కమిటీకి సారథ్యం వహించారు.

అతిపెద్ద సంస్కరణకు 17ఏళ్లు

అతిపెద్ద సంస్కరణకు 17ఏళ్లు

స్వతంత్ర భారతావని చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణగా ప్రసిద్ధ పొందిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుకు నోచుకోవడం వెనుక సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఇది ఆచరణ రూపం దాల్చడం వెనుక దాదాపు 17 ఏళ్ల కృషి ఉంది. ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని.. రాజకీయ ఆటుపోట్లను అధిగమించి ఈ సంస్కరణ దేశ ప్రజల ముంగిటికొచ్చింది.

దశలుగా జీఎస్టీ

దశలుగా జీఎస్టీ

2000 సంవత్సరంలో నాటి ఎన్డీయే సర్కారుకు నేతృత్వం వహిస్తున్న అటల్‌ బీహారి వాజ్‌పేయి హయాంలో ఈ పన్ను సంస్కరణ ఆలోచనకు మొగ్గ తొడిగింది. సి.రంగరాజన్‌, ఐ.జి.పటేల్‌, బిమల్‌ జలాన్‌ల నేతృత్వంలోని ఆర్థిక సలహా కమిటీ సూచనల మేరకు- పశ్చిమబెంగాల్‌ ఆర్థికమంత్రి అసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో ఓ కమిటీని వాజ్‌పేయి ఏర్పాటుచేశారు. జీఎస్టీ రూపురేఖల్ని తయారుచేయడం ఈ కమిటీ ప్రధాన విధి. దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వ్యవస్థల ఏర్పాట్ల బాధ్యతను కూడా అసిమ్‌దాస్‌ గుప్తా కమిటీకే అప్పగించారు. పన్ను సంస్కరణల్ని వేగిరం చేసే లక్ష్యంతో వాజ్‌పేయి ప్రభుత్వం 2003లో విజయ్‌ కేల్కర్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. 12వ ఆర్థిక సంఘం సూచించినట్లుగానే... జీఎస్టీని తీసుకురావాలంటూ కేల్కర్‌ కమిటీ 2005లో సిఫార్సుచేసింది.

యూపీఏ హయాంలో..

యూపీఏ హయాంలో..

జీఎస్టీని 2010 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తామని యూపీఏ హయాంలో పనిచేసిన ఆర్థికమంత్రులు చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీలు ప్రకటించినప్పటికీ... రకరకాల కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు అభ్యంతరాలను లేవనెత్తాయి. దీంతో ప్రభుత్వం ప్రకటించిన గడువుకు కాలం చెల్లిపోయింది. ఆ తర్వాత రాష్ట్రాల్లో వాణిజ్య పన్నుల కంప్యూటరీకరణను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఈ ప్రాజెక్టు జీఎస్టీకి పునాది వేసింది. జీఎస్టీ అమలుకోసం మన్మోహన్‌ ప్రభుత్వం 2011లో లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినపుడు- దానిని బీజేపీ, లెఫ్ట్‌, మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. పశ్చిమబెంగాల్లో వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేసి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత... జీఎస్టీ కమిటీ ఛైర్మన్‌ పదవి నుంచి అసిమ్‌దాస్‌ గుప్తా తప్పుకొన్నారు. దీంతో కేరళ ఆర్థికమంత్రి కె.ఎం.మణికి ఆ బాధ్యతలు అప్పగించారు.

మోడీ హయాంలో అమలు..

మోడీ హయాంలో అమలు..

జీఎస్టీ వివాదాల అథారిటీపై కేంద్రానికి మితిమీరిన విచక్షణాధికారాలు కల్పించడాన్ని స్థాయీ సంఘం సమావేశాల్లో బీజేపీ, లెఫ్ట్‌ పార్టీలు గట్టిగా వ్యతిరేకించాయి. ఆ తర్వాత జీఎస్టీ బిల్లును 2015లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది. ఇలా ఈ బిల్లు ఏళ్లపాటు రాజకీయాల మధ్య నలిగిపోయింది. చివరికి 2015లో లోక్‌సభలో, 2016లో రాజ్యసభలో ఆమోదం పొందింది. అతిపెద్ద పన్ను సంస్కరణ ఎట్టకేలకు నరేంద్ర మోడీ సర్కారు హయాంలో అమల్లోకి వచ్చింది.

English summary
After 17 tumultuous years, a nationwide Goods and Services Tax (GST) will rollout from midnight tonight, overhauling India’s convoluted indirect taxation system, unifying the $2-trillion economy with 1.3 billion people into a single market. In 2000 Prime Minister Atal Bihari Vajpyee introduces the concept, sets up a committee headed by the then West Bengal Finance Minister Asim Dasgupta to design a GST model.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X