వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకతీయ వైభవం వెలవెల: ఆలయాలకు ప్రమాదం

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : కాకతీయ రాజులను మనం కళ్లారా చూడలేదు. కానీ చరిత్ర ద్వారా వాళ్ల గొప్పదనమేంటో చదివాం. వాళ్లు కళాపోషకులని తెలుసుకున్నాం. అందుకు ఏంటీ రుజువులు అంటే? ఆలయాలే వాళ్ల గొప్పతనానికి తార్కాణం. కానీ అవి ఒక్కొక్కటి కనుమరుగయ్యేలా ఉన్నాయి. అద్భుత శిల్ప సంపదతో అలరారే వందలు, వేల ఏళ్ల చరిత్ర కల్గిన ఈ ఆలయాలు కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకున్నాయి.

పునరుద్ధరించడానికి ఆరంభ శూరత్వంగా పనులు ప్రారంభించినా, అవి ఆదిలోనే హంసపాదులా అక్కడితో ఆగిపోయాయి. హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలోని కల్యాణ మండపం పనులు మొదలై పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. జయశంకర్‌ జిల్లాలోని కోటగుళ్లకు ఆదరణ కరవవుతోంది. పనులు నామమాత్రంగా మొదలై ఆగిపోయాయి.

జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండలోని 500 స్తంభాల త్రికూటాలయానిదీ ఇదే పరిస్థితి. ఇప్పుడు వరంగల్‌ ఐదు జిల్లాలుగా అవతరించింది. ఏ జిల్లాకాజిల్లాగా అభివృద్ధి చెందాల్సిన తరుణం ఆసన్నమైంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చారిత్రక ఆలయాలపై దృష్టిపెట్టి వీటిని పునరుద్ధరిస్తే కాకతీయుల కళానైపుణ్యం భావి తరాలకు బహుమతిగా ఇచ్చేందుకు వీలుంటుంది. లేదంటే చరిత్ర పుటలకే పరిమితమయ్యే పెను ప్రమాదం ఉంది.

Historical constructions neglected in Warangal

పదేళ్లు గడుస్తున్నా!

హన్మకొండలోని ప్రఖ్యాత వేయిస్తంభాల ఆలయంలో కల్యాణ మండపం నిర్మాణం 2006లో మొదలైంది. ప్రాచీన కల్యాణమండపం శిథిలావస్థకు చేరుకోవడంతో అదే స్థానంలో రాతితో మరొకటి నిర్మించడానికి పనులు ప్రారంభించారు. మొత్తం 137 స్తంభాలతో నిర్మిస్తున్న ఈ మండపం కట్టడంలో సిమెంటు, ఇసుక ఏదీ వాడకుండా కేవలం ఇంటర్‌లాకింగ్‌ విధానంలో స్తంభాలను ఏర్పాటు చేసి ప్రాచీన కట్టడానికి రూపమివ్వడానికి ఏడున్నర కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు.

నిర్మాణం కోసం తమిళనాడు నుంచి శివకుమార్‌ అనే స్థపతి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో దాదాపు 70 మంది శిల్పకారులు కొన్నేళ్లు పని చేశారు. తర్వాత నిలిచిపోయాయి. మళ్లీ ముందుకు సాగడం లేదు. మొదలు పెట్టినప్పటి నుంచి రెండేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని ప్రకటించారు. కాకతీయ పాలకులు నిర్మించిన వేయిస్తంభాల ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. శిల్పాల్లో నుంచి దారం దూరేంత సన్నని రంధ్రాలు చేయడం ఇక్కడి గొప్పతనం. కల్యాణమండపమూ ఎన్నో అద్భుత కళాకృతులు, వింతలతో ఉండేది.

శిథిలావస్థకు చేరుకోవడంతో ఒక్క శిల్పం కూడా తేడా రాకుండా యథావిధిగా మండపాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టి, పాత మండపాన్ని తొలగించారు. ఇప్పటికి పదేళ్లు గడుస్తున్నా కల్యాణమండపం తుది రూపు దాల్చలేదు. కీలకమైన పైకప్పు నిర్మాణం ఇంకా జరగలేదు. పనులు నిలిచిపోవడంతో శిలలు ఎక్కడికక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. అటు కేంద్ర పురావస్తు శాఖ గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ పనుల పూర్తిపై దృష్టి సారించడంలేదు. ఇటీవల స్థపతి శివకుమార్‌ తనకు పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.

ఈ చెల్లింపులపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రస్తుతం విచారణ చేపడుతోంది. ఈ తగాదాతో ఆలయ నిర్మాణం పనులు ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించలేదు. ఇన్నేళ్లు పనిచేసిన స్థపతికి కాకుండా పనులను మరొక శిల్పికి అప్పగించే పరిస్థితి లేకపోవడంతో మండపం నిర్మాణం కలగానే కనిపిస్తోంది. వేయిస్తంభాల గుడిలో అసంపూర్తిగా ఉన్న మండపం నిర్మాణాన్ని చూసి పర్యాటకులు నిరాశగా వెనక్కి తిరిగిపోతున్నారు.

మరమ్మతులు కరవు

జయశంకర్‌ జిల్లాలోని గణణపురం మండలంలో కొలువైన కోటగుళ్లు (గణపేశ్వరాయలం) ఎంతో చరిత్రాత్మకమైన ఆలయం. 11 - 12వ శతాబ్దాల మధ్యలో కాకతీయ పాలకుడైన గణపతి దేవుని చక్రవర్తి సామంత రాజైన రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అద్భుత కళానైపుణ్యంతో అలారారిన ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరే దశకు చేరింది. పురావస్తు శాఖ 2006లో ఈ ఆలయం చుట్టూ పరిసరాల్లో తవ్వకాలు జరపగా అద్భుతమైన నల్లరాతి శిల్పాలు 8 బయటపడ్డాయి.

వాటిని ఆలయ పరిసరాల్లోనే ప్రదర్శనకు పెట్టారు. కాగా శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని తీర్చిదిద్ది పునర్వైభవం తీసుకువస్తామని నాటి పాలకులు సంకల్పించి ఆలయ పునరుద్ధరణ పనులు మొదలు పెట్టారు. అవి కొన్ని నెలలు మాత్రమే కొనసాగాయి. తర్వాత ఆగిపోయాయి. 2011లో ఆలయాన్ని పునరుద్ధరించడానికి అప్పటి భూపాలపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఆలయాన్ని తీర్చిదిద్దడానికి పూనుకున్నారు. రూ. 2 కోట్లతో పనులు ప్రారంభించాలని సంకల్పించారు.
దాదాపు రూ. 40 లక్షలు వెచ్చించి పనులు మొదలుపెట్టారు. రెండు నెలలు పనులు నామమాత్రంగా జరిగాయి. జర్మనీ పరిజ్ఞానంతో ఆలయాన్ని పూర్తిగా తొలగించకుండా, నాటి కాకతీయులు కట్టిన విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టారు. తర్వాత మళ్లీ పనులు నిలిచిపోయాయి.

తెరాస ప్రభుత్వం హయాంలో కోటగుళ్ల అభివృద్ధికి మూడోసారి ముహూర్తం పెట్టారు. గతేడాది శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయినా ముందుకు సాగడం లేదు. పరిసరాల్లో పర్యాటక శాఖ హరిత హోటల్‌ నిర్వహిస్తోంది. ఆలయంలో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదు. వర్షం కురిసిందంటే గర్భాలయంలోకి జలధారలు కురుస్తుంటాయి. ప్రతి శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. గ్రామస్థులే చందాలు వేసుకుని నిర్వహిస్తారే తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందదు.

త్రిశంకు స్వర్గంలో..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో త్రికూటాలయం తీవ్ర నిరాదరణకు గురవుతోంది. ఈ చారిత్రక ఆలయాన్ని కాకతీయ పాలకులు 500 స్తంభాలతో అద్భుతంగా నిర్మించారు. వరంగల్‌లోని వేయి స్తంభాల దేవాలయం తర్వాత రెండోది ఈ త్రికూటాలయమే. ప్రస్తుతం ఈ ఆలయం కాల గర్భంలో కలిసి పోయేలా కనిపిస్తోంది. దీన్ని కాపాడి భవిష్యత్తు తరాలకు చూపాలనే ఆలోచన దశాబ్దాలుగా పాలకులకు, పురావస్తుశాఖ అధికారులకు కల్గక పోవటం శోచనీయం.

శిథిలావస్థలో ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని పునర్నిమించాలని అప్పటి ప్రభుత్వం యోచించినప్పటికీ చిత్తశుద్ధి లోపంతో 30 ఏళ్లు అసంపూర్తిగానే ఉంటోంది. కాకతీయ చక్రవర్తి అయిన గణపతి మహాదేవుడు ఆ సమయంలో తన చెల్లెలు కుందమాంబకు లింగాలఘనపురం మండలం కుందారం పరిసర ప్రాంతాన్ని పసుపు కుంకుమల కింద కానుకగా ఇచ్చారు. ఇందుకు ఆయన చెల్లెలు కుందమాంబ అన్నయ్యపై అమితమైన ప్రేమానురాగాలతో రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో త్రికూటాలయం (సూర్యదేవాలయం)న్ని నిర్మించి అంకితమిచ్చిందని చరిత్ర చెబుతోంది.

ఆలయంలో శివుడు, సూర్యుడు, వాసుదేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠాపించి ఆనాటి శిల్పులతో ఎంతో కళా నైపుణ్యంతో రాతి కట్టడాలపై శిల్పాలను చెక్కించి నిర్మించారు. 500 స్తంభాలతో నిర్మాణం కాగా అప్పట్లో ఈ ఆలయం నిత్యపూజా కైంకర్యాలతో కళకళలాడేదిట. మూడు దశాబ్దాల క్రితం పురావస్తు శాఖ వాళ్లు ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. 1983- 1984లో రూ.20 లక్షలు కేటాయించి మరమ్మతుకు శ్రీకారం చుట్టిన అధికారులు పురాతన కట్టడాలను విప్పి కొంతవరకు నిర్మించారు. ఆ తర్వాత నిర్మాణాలు ఆగిపోయాయి.

మళ్లీ ఏడేళ్ల కిందట కదలిక వచ్చింది. పురాతమైన రాతి కట్టడంతోనే ప్రహరీ కొంత వరకు నిర్మించి వదిలేశారు. ఇలా 30 ఏళ్లుగా పనులు సాగుతూ.. ఆగుతూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారిందీ ఆలయం. ఆలయాన్ని పనర్నిమించేందుకు విప్పి పెట్టిన విలువైన శిల్పాలను జాగ్రత్తగా భద్ర పరచాల్సి ఉండగా.. చిందర వందరగా వేశారు. దేవతా విగ్రహాలు, గోపురాలు, నంది, శిల్పసంపద దెబ్బతింటున్నాయి. ఎంతో శ్రమకోర్చి చెక్కిన శిల్పాలు భావితరాలకు కనిపించకుండా కళా విహీనం అవుతున్నాయి.

English summary
The temples constructed by Kakatiya dynasty are neglected by the TRS government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X