ఏ రాష్ట్రమో!: 'సీఎం'పై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ముఖ్యమంత్రి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో పదేళ్ల వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. అలాగే, తెలంగాణలో పలువురు సీనియర్ నాయకులు ఉన్నారని, తాను సీఎంగా అవుతానని భావించడం లేదని చెప్పారు.
ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే ఎక్కడి నుండి అవుతారని ప్రశ్నించగా.. దీనికి కాలమే సమాధానం చెబుతుందని నవ్వుతూ చెప్పారు. హైదరాబాదులో ఓటు హక్కు కలిగిన వ్యక్తిగా ఇక్కడి ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం తనకు ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తాను ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు.. హైదరాబాదీ అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేవలం ఇంటి వద్ద మాత్రమే తనకు తండ్రి అని, బయటకు వచ్చేసరికి ఆయన తనకు నాయకుడేనని తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్: ఎవరి దారి వారిది!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడైన డీ శ్రీనివాస్ గానీ ఇతర నాయకులుగానీ పార్టీ నాయకులందరినీ కలుపుకుని పోయేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇరువురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలూ ఇది వరకే టిఆర్‌ఎస్‌లో చేరారు. వారినీ నిలువరించడంలో పార్టీ ముఖ్య నాయకులు విఫలమయ్యారు. పైగా పార్టీ నాయకులు కొందరు రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ పార్టీలో విశ్వసనీయత ఉన్న నాయకులెవ్వరూ లేరని ఘాటైన విమర్శ చేశారు. అందుకే తాను సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నానన్నారు.
విద్యుత్తు విషయంలో మాత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేస్తున్న పోరాటానికి అన్ని పార్టీలూ రాజకీయాలకు అతీతంగా అండగా నిలవాలని సూచించారు. అంతకు ముందు పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి పలు పర్యాయాలు పొన్నాలపై విమర్శలు చేశారు. ఆ తర్వాత మెత్తబడ్డారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించాలని పొన్నాల నిర్ణయించి మీడియాకు కబురు పెట్టారు. అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో వరుసగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీ శ్రీనివాస్, షబ్బీర్ అలీ మీడియా సమావేశాలు నిర్వహించారు. దీంతో పొన్నాల తన సమావేశాన్ని ఒంటి గంటకు మార్చుకున్నారు. అయినా సీఎల్పీలోనే మీడియా సమావేశాలు కొనసాగుతుండడంతో పొన్నాల మరోసారి 2 గంటలకు వాయిదా వేసుకున్నారు.












Click it and Unblock the Notifications