పొంగల్ స్పెషల్: కిక్కిరిసిన రైల్వే, బస్‌స్టేషన్లు.. సొంతూళ్లకు తరలి వెళ్లిన హైదరాబాదీలు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: భాగ్యనగరం పల్లెకు తరలి వెళ్లింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాదీలు సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. శనివారమూ హైదరాబాద్‌లోని ప్రధాన బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. హైదరాబాద్ నగరం నలుమూలల శివార్ల నుంచి సైతం జనం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ - పికెట్ ప్రాంతంలోని జేబీఎస్ తదితర ప్రాంతాలనుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన రైళ్లు, బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఎలాగైనా సరే సొంత ఊళ్లకు వెళ్లి రావాలనే పట్టుదలతో హైదరాబాద్ వాసులు పలు ఇబ్బందుల నడుమ ప్రయాణం చేశారు.

సికింద్రాబాద్‌ నుంచి ప్రతి రోజు రాకపోకలు సాగించే 80 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 100 ప్యాసింజర్‌ రైళ్లతో పాటు మరో పది రైళ్లు అదనంగా వివిధ ప్రాంతాలకు బయలు దేరాయి. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలని భావించే వారి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్‌తోపాటు విమాన యాన సంస్థలు దండిగా చార్జీలు వసూలు చేసేశాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు సొంతూళ్లకు చేరుకుని సందడి చేశారు.

 వారంలో సొంతూళ్లకు తరలి వెళ్లిన 20 లక్షల మంది

వారంలో సొంతూళ్లకు తరలి వెళ్లిన 20 లక్షల మంది

నాలుగు రోజులుగా ఆర్టీసీ మూడువేలకు పైగా ప్రత్యేక బస్సులను నడిపింది. శనివారం ఒక్కరోజే వెయ్యి బస్సులు అదనంగా బయలుదేరగా, ఐదు లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు చేరుకున్నారు. వారంలో 20 లక్షల మందికి పైగా హైదరాబాదీలు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. ఉప్పల్, ఎల్బీనగర్‌ వంటి నగర శివారు ప్రాంతాలు ఒకవైపు ప్రయాణికుల రద్దీతో, మరోవైపు వాహనాలతో స్తంభించాయి. గంటల తరబడి ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

 ప్రైవేట్ ట్రావెల్స్‌లో 50 శాతం చార్జీ

ప్రైవేట్ ట్రావెల్స్‌లో 50 శాతం చార్జీ

సికింద్రాబాద్, నాంపల్లి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, బాలానగర్, మెహిదీపట్నం, జేబీఎస్, కూకట్‌పల్లి, మియాపూర్, తదితర ప్రాంతాలలో రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక రైళ్లతో పాటు ప్రైవేట్‌ ట్రావెల్స్‌లోనూ 20 నుంచి 50 శాతం వరకూ చార్జీలు పెంచి వసూలు చేశారు. కాగా చౌటుప్పల్, భువనగిరి, తదితర ప్రాంతాల్లోని టోల్‌గేట్ల వద్ద రద్దీ పట్టపగలు చుక్కలు చూపింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది.

 విమానాశ్రయంలోనూ బారులు తీరిన ప్రయాణికులు

విమానాశ్రయంలోనూ బారులు తీరిన ప్రయాణికులు

కానీ సొంతూరు బయలుదేరినవారి బాధలు అంతా ఇంతా కాదు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపే క్షణాలకోసం గంటలకు గంటలు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ ట్రావెల్స్‌ వసూలు చేస్తున్న స్పెషల్‌ చార్జీలను, టికెట్‌పై రాబడుతున్న అదనపు రేట్లను భరిస్తున్నా, అనుకొన్న సమయానికి గమ్యం చేరుతామా? అనే ఆందోళన మాత్రం ప్రయాణికులకు తప్పడం లేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు పరుగులు పెట్టేవారికే కాదు, విమానం పట్టు కోవడానికి విమానాశ్రయంలో బారులు తీరిన ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. సంక్రాంతి పండగ సీజన్‌లో విమానయాన సంస్థలు టికెట్‌ ధరలను పెంచేశాయి. విమానాశ్రయంలో గంట గంటకు పెరుగుతున్న టికెట్‌ ధరను చూసి ప్రయాణికులు కంగారు పడ్డారు.

 ప్రైవేట్ ఆపరేటర్ల దాడితో నలిగిపోతున్న ప్రయాణికులు

ప్రైవేట్ ఆపరేటర్ల దాడితో నలిగిపోతున్న ప్రయాణికులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని విమాన సంస్థలు విమానంలోని చివరి 20 సీట్ల టికెట్లకు స్పెషల్‌ రేట్లు పెట్టాయి. ఈ సీట్లను ఒక్కొక్కటి రూ.15వేల నుంచి రూ.18 వేల వరకు విక్రయిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి బెజవాడకు ప్రయాణ సమయం గంట. ఇంతకొద్ది దూరానికి రూ.2000 దాకా వసూలు చేయడం ఏమిటని ప్రయాణికులు వాపోతున్నారు. విజయవాడ- విశాఖపట్నం వెళ్లే విమానాల్లో రూ. 14 వేలు వసూలు చేస్తున్నారు. విమానయానం పరిస్థితి ఇలాఉంటే, రోడ్డు రవాణాలో ప్రయాణికులు మరింతగా నలిగిపోతున్నారు. భోగి ముందురోజు ప్రైవేట్ ఆపరేటర్లు డిమాండ్‌ చేసిన రేట్లు చూసి ప్రయాణికులు బెంబేలెత్తారు. వెనుకాముందాడితే, అసలు సీటుకే ఎసరు వస్తుందని భయపడ్డారు. అడిగినంత చేతిలో పెట్టి ప్రయాణం అయిపోయారు.

 ఆర్టీసీ ఆధ్వర్యంలో 50 % అదనపు చార్జీ

ఆర్టీసీ ఆధ్వర్యంలో 50 % అదనపు చార్జీ

ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు హైదరాబాద్‌- విజయవాడకి రూ.2500, విజయవాడ-విశాఖపట్నం మధ్య రూ. 2,400 మేర వసూలు చేశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రావడం ఒక ఎత్తు. అక్కడినుంచి సొంతూళ్లకు చేరుకోవడం అన్నది పెద్ద ప్రయాస. తమ ఊరి బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులతో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోని బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను తెచ్చింది. సాధారణ రోజుల్లో చార్జీ కంటే దాదాపు యాభై శాతం అదనంగా వసూలు చేస్తోంది. హైదరాబాద్‌ - విజయవాడకు రూ.700 కాగా రూ. 900, విజయవాడ - బెంగళూరుకు రూ. 1000 కాగా రూ. 1500, బెజవాడ-విశాఖకు రూ. 700కాగా, రూ. 1050 మేర చార్జీ వసూలు చేస్తోంది.

ఇలా ఖాళీ అయిన భాగ్యనగరం

ఇలా ఖాళీ అయిన భాగ్యనగరం

టికెట్‌పై అదనపు రేట్లు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌ బస్సులపై అధికారులు కన్నేశారు. విశాఖపట్నంలోని అగనంపూడి టోల్‌గేటు వద్ద 22 బస్సులపై కేసులు నమోదుచేశారు. హైదరాబాద్‌- విజయవాడ హైవేపై పొగమంచు కురుస్తోంది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై శుక్ర, శనివారాల్లో 25వేలకు పైగా వాహనాలు ప్రయాణించాయి. అవి ప్రయాణిస్తున్న హైవే పరిధిలోని జగ్గయ్యపేట రూరల్‌, కంచికచర్ల ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున దట్టంగా మంచు పడింది. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నాలుగైదు రోజులుగా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్లడంతో శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు రద్దీగా కనిపించిన రహదారులు ఆ తరువాత ఖాళీ అయ్యాయి. ఒకవైపు సంక్రాంతి, మరోవైపు వీకెండ్‌ సెలవులు కావడంతో భాగ్యనగరవాసులు సైతం పెద్దగా ఇళ్ల నుంచి బయటకు రాలేదు. మరోవైపు 20 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు తరలి వెళ్లడంతో హైదరాబాద్ సిటీ రోడ్లపై జనం చాలా తక్కువగా కనిపించారు.

 ఒకరోజు ముందే నారావారిపల్లెలో పొంగల్ సందడి

ఒకరోజు ముందే నారావారిపల్లెలో పొంగల్ సందడి

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు నగరాలు, పట్టణాలు.. ప్రముఖులు, పేదలు అంతా స్వగ్రామాలకు తరలివస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు తదితర ప్రముఖులంతా పల్లెబాట పట్టారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ శనివారం రాత్రి నారావారిపల్లె చేరుకున్నారు. వీరికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇంటి ముందు ఉన్న నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు మాట్లాడి వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే నారావారిపల్లెకు చేరుకున్నారు. కాగా, నారావారిపల్లెలో శనివారమే సంక్రాంతి సందడి మొదలైంది. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ముగ్గులు, సాక్‌రేస్‌, లెమన్‌ అండ్‌ స్పూన్‌, మ్యూజికల్‌ చైర్స్‌, పోటోటా గేదరింగ్‌, టగ్‌ ఆఫ్‌వార్‌ తదితర పోటీలు జరిపారు. విజేతలకు భువనేశ్వరి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఆ కార్యక్రమాల్లో నారా ఇందిర, ఎన్టీఆర్‌ కుమార్తె లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 దుగ్గిరాలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

దుగ్గిరాలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు శనివారం తన సొంత ఊరు నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామానికి చేరుకున్నారు. ఆదివారం గ్రామంలో ‘పల్లెకు పోదాం' పేరిట ఆయన ఆత్మీయ సమావేశం, సంబరాలు జరుపుతున్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఇప్పటికే స్వగ్రామం దుగ్గిరాల చేరుకుని శనివారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన స్వగ్రామం ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తన స్వగ్రామం అమరావతి మండలం ఉంగుటూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabadi people gone to their native places for celebrate Sankranti. Railway stations, Bus stations made additional arrangments for passingers but insufficient. VIP's also gone to their own villages.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి