'ఫలక్‌నుమా'కు మరో అరుదైన ప్రపంచ గుర్తింపు
నిజాం పాలకుల రాజసానికి, ఆనాటి నిర్మాణ వైభవానికి చిహ్నంగా నిలిచిన ఫలక్‌నుమా ప్యాలెస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. 2015 సంవత్సరానికి ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ ప్యాలెస్ హోటల్‌గా ఎంపికైంది. ఈ ప్యాలెస్ నిర్వహణను కొన్ని సంవత్సరాల క్రితం తాజ్ గ్రూపు చేపట్టిన సంగతి తెలిసిందే.
60 గదులను కలిగి ఉన్న ఈ ప్యాలెస్‌ను తాజ్ గ్రూపు పర్యాటకుల అవసరాలకు తగినట్టుగా నిర్వహిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత టూరిజం, ట్రావెల్ వెబ్‌సైట్ ట్రిప్ అడ్వయిజర్ ప్రపంచ పర్యాటకుల అభిప్రాయాలు, సమీక్షల ఆధారంగా తాజ్ ఫలక్‌నుమాను బెస్ట్ ప్యాలెస్ హోటల్‌గా గుర్తించింది. ప్యాలెస్ హోటళ్ల కేటగిరీలో ఈ అవార్డు దక్కింది.
ఈ అవార్డుపై ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్ జనరల్ మేనేజర్ గిరీశ్ సెహ్‌గల్ మాట్లాడుతూ ఈ అవార్డు, ఈ గుర్తింపు మాకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ ఎంపిక భారతీయ సంస్కృతి, సంప్రదాయ అతిథి మర్యాదల్ని మేళవించి సాగే ప్రపంచ స్థాయి సేవలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.
కాగా, గతంలో కూడా ఈ ప్యాలెస్ హోటల్ కాండే నాస్ట్ ట్రావెలర్ యూకే రీడర్స్ ట్రావెల్ అవార్డు, ట్రావెల్, లీజర్ ఇండియా అండ్ సౌతాసియాస్ బెస్ట్ హెరిటేజ్ హోటల్ అవార్డులను సొంతం చేసుకుంది. నిజాం రాచఠీవిని నింపుకున్న భవన నిర్మాణం, ఫర్నిచర్, భారీ షాండ్లియర్లు, కుడ్యచిత్రాలు, పురాతన వస్తువులు, విలాసవంతమైన గదులతో ఈ హోటల్ ప్రపంచ పర్యాటకుల మనసులను గెలిచిందని ట్రిప్ అడ్వయిజర్ పేర్కొన్నది.

ప్రపంచంలోని 37 లక్షల రెస్టారెంట్లు, హోటళ్లు, దర్శనీయ స్థలాలు, వసతి సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే ఈ వెబ్‌సైట్‌ను నెలవారీగా 26 కోట్ల మంది సందర్శిస్తారు. ఇక ఉర్దూలో ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. అందులోని ఒక అద్దం విలువ నేడు రూ. 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని మూడు వందల ఎకరాల్లో నిర్మించారు.
దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్ ప్రధాని సర్ వికారుల్ ఉమ్రా ఇక్బాల్ దౌలా బహదూర్ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి.
ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు.1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు.
అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్ ఎడ్వర్డ్స్, వైస్రాయ్ లార్డ్ వేవెల్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గతంలో ఈ ప్యాలెస్‌లో విడిది చేశారు.












Click it and Unblock the Notifications