వైయస్‌ కక్ష: బాబు పోరు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముఖ్యమంత్రిగా ఎంత సక్సెస్‌ అనిపించుకున్నారో ప్రతిపక్ష నాయకుడిగా అంత విఫలమయ్యారనే బరువును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మోస్తున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు అంతగా పండడం లేదు. ఆయన చేపట్టాలని తలపెట్టిన ఉద్యమాలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. తాజాగా తలపెట్టిన ఉద్యమం ఏ మాత్రం విజయం అవుతుందనేది కూడా చెప్పడం కష్టమే.

ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై పోరాడాలని మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయించింది. అవినీతిని, కుంభకోణాలను బయటపెట్టిన పత్రికలపై, ప్రతిపక్షాల నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. తన ఇంటి ద్వారం మూసివేశారంటూ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డి నిరసనకు దిగారు. ఆయన చేత దీక్ష విరమింపజేసిన అనంతరం రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు ఈ కొత్త విమర్శనాస్త్రాలను తీసి సంధించారు.

తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఈ నెలాఖరున ఆందోళన తలపెట్టారు. పాదయాత్ర కూడా చేపట్టాలని నిర్ణయించారు. దీనికి మద్దతు ఇస్తూ పోలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీలోని టి. దేవేందర్‌ గౌడ్‌, కడియం శ్రీహరి, పయ్యావుల కేశవ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నలుగురైదుగురు మినహా మిగతా నాయకులెవరూ పెద్దగా గళమెత్తడం లేదు. ఉద్యమాలు చేపట్టి ప్రజలను కూడగట్టే స్థితిలో తెలుగుదేశం ఉందా అనేది సందేహమే. పైగా ఎన్నికలకు చాలా గడువు ఉంది. అందువల్ల ఇప్పటి నుంచి కష్టపడడమెందుకనే అభిప్రాయం కూడా చాలా మంది నాయకుల్లో ఉండి వుండవచ్చు.

ఇదిలావుంటే, ఓటమి తర్వాత కూడా చంద్రబాబు పార్టీ నిర్వహణా పద్ధతిని మార్చుకున్న దాఖలా కనిపించడం లేదు. తానే అంతా అయి నడిపే పద్ధతికి ఆయన స్వస్తి చెప్పినట్లు లేదు. బహుళ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే వైయస్‌ అనుచరగణం తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న వ్యూహం ఆ పార్టీని ఏ మాత్రం అడుగు ముందుకు పడనీయడం లేదు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాజశేఖర్‌ రెడ్డి వ్యవహరిస్తుండడం చంద్రబాబుకు కనాకష్టంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి