ఆ ఇద్దరికీ కీలకమే

YS Rajasekhar Reddy
తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికలు అటు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో విజయం ఇద్దరికీ అవసరమే. అందుకే ఈ ఇద్దరు కూడా ఎన్నికల్లో విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తెర్లాం, ఖైరతాబాద్ ఎన్నికలే కాకుండా తెరాస రాజీనామా చేసిన 16 శాసనసభా నియోజకవర్గాలకు, నాలుగు లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక భావోద్వేగాన్ని చాటడానికి చంద్రశేఖరరావు తన శాసనసభ్యులు, లోకసభ సభ్యులతో రాజీనామాలు చేయించారు. చేజేతులా ఉప ఎన్నికలను ఆహ్వానించి కెసిఆర్ సాహసం చేశారనే చెప్పవచ్చు. అయితే తాము తిరిగి గెలవడం ఖాయమనే ధీమాతో ఆయన ఉన్నారు. మొత్తం స్థానాలను గెలుచుకోవడం ఆయనకు అనివార్యంగా మారింది. నాలుగైదు సీట్లు పోయినా తెలంగాణ సెంటిమెంటు లేదనే అభిప్రాయానికి బలం చేకూరుతుంది. ఇది ఆయనకు తీవ్రంగా నష్టం చేస్తుందనడంలో సందేహం లేదు.

పార్టీ శాసనసభ్యులు, లోకసభ సభ్యులు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించింది కెసిఆరే. అందువల్ల వ్యక్తిగతంగా ఆయనకు విజయం అవసరంగా మారింది. ఓడిపోయే అభ్యర్థులపై ఆ భారం తక్కువగా పడుతుంది. తెలంగాణకు అంతగా బలం లేని హైదరాబాదులోని ముషిరాబాద్, సికింద్రాబాద్ శాసనసభ నియోజకరవర్గాల్లో పార్టీ విజయంపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముషిరాబాదులో బిజెపి అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ బరిలో ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో లక్ష్మణ్ తెరాస అభ్యర్థి నాయని నర్సింహారెడ్డిపై కేవలం 230 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఈ స్థితిలో లక్ష్మణ్ నుంచి పోటీని తట్టుకోవడం నాయని నర్సింహారెడ్డికి కష్టమే కావచ్చు. పైగా ఈ ఒక్క సీటులోనే బిజెపి పోటీ చేస్తోంది. రాష్ట్ర నాయకులందరూ ఈ సీటుపైనే దృష్టి పెడ్తారు. తెరాస - ఎన్ అధ్యక్షుడు ఎ. నరేంద్ర లక్ష్మణ్ కు తన మద్దతు ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి వ్యక్తిగతంగా బలం ఉన్నవారు. ఇక్కడ కూడా తెరాసకు పోటీ గట్టిగానే ఉంటుంది. సికింద్రాబాదులో తెరాస అభ్యర్థి పద్మారావుకు తెలుగుదేశం అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ నుంచే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి పిట్ల కృష్ణ నుంచి కూడా తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. పిట్ల కృష్ణకు విజయం వ్యక్తిగతంగా అవసరం. ఈ సీటు నుంచి పోటీ చేయడానికి ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విజయం సాధిస్తే శాశ్వతంగా అక్కడ నిలదొక్కుకోవడానికి, తనకు పోటీ లేకుండా చేసుకోవడానికి వీలవుతుంది. తెరాస అభ్యర్థులు ఓటమి చవి చూస్తే ఎదురయ్యే పరిణామాల గురించి కెసిఆర్ కు తెలియంది కాదు. అయినా ఆయన జంకడం లేదు.

తెలంగాణ సెంటిమెంటు బలంగా లేదని చాటడానికే కాకుండా తన వాదనకు బలం చేకూరి పార్టీ అధిష్ఠానవర్గం వద్ద తన పలుకుబడిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అవసరం. ఇప్పటి వరకు అధిష్ఠానం వద్ద ముఖ్యమంత్రి ఆడిందే ఆట, పాడిందే పాట అవుతోంది. అది కొనసాగాలంటే తెరాస ఓడిపోవడమే కాదు, కాంగ్రెస్ గెలవాలి కూడా. చాలా శాసనసభా నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బలంగా ఉన్నారు. పైగా తెలంగాణపై ఈ ఉప ఎన్నికలు రెఫరెండం కాదని ఆయన వాదిస్తున్నారు. దీనివల్ల ఆయన ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయమే ఈ ఉప ఎన్నికల్లో వ్యక్తమవుతుందనే భావనకు అవకాశం ఏర్పడుతుంది. ఈ ఎన్నికల ఫలితాలను బట్టే పార్టీ అధిష్ఠానవర్గం వైఖరి వైయస్ పట్ల ఖరారవుతుంది. కాంగ్రెస్ ఓడిపోయి తెరాస గెలిచినా, తెలుగుదేశం గెలిచినా ఆయకు చిక్కులు తప్పవు. తెరాస గెలిస్తే తెలంగాణ సెంటిమెంటు బలమేమిటో నిరూపించినట్లవుతుంది. దీని వల్ల తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుల కార్యకలాపాలు మళ్లీ ముమ్మరం కావచ్చు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే త్వరలో రానున్న సాధారణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉండబోతున్నాయనే సూచన చేసినట్లవుతుంది. ఈ రెండు పరిస్థితులు కూడా వైయస్ రాజశేఖర రెడ్డికి కష్టాలు తెచ్చిపెట్టేవే. అందువల్ల ఆయనకు ఉప ఎన్నికల్లో గెలుపు అత్యవసరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+