తెలుగుదేశంలో తెలంగాణ లొల్లి
తెలుగుదేశం పార్టీలో తెలంగాణ లొల్లి హద్దు దాటుతున్నది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వస్తున్న డిమాండ్లను అదుపు చేయడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు కష్టంగానే మారింది. తెలంగాణపై బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆయన చేసిన ప్రకటనలు ఏ మాత్రం ఫలితం ఇవ్వడం లేదు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత అకస్మాత్తుగా సికింద్రాబాద్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రకటన ఈ గొడవకు మూలకారణమైంది. తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని ఆయన ప్రకటన చేశారు. ఆ వెంటనే దేవేందర్ గౌడ్ తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటనతో విభేదిస్తూ ప్రకటన చేశారు. ఈ వివాదం తెలంగాణవాదులకు, సమైక్యవాదులకు మధ్య పోరుగా ముందుకు వచ్చింది.
కాకినాడ సమీపంలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశానికి ముందు దేవేందర్ గౌడ్ తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేవేందర్ గౌడ్ తన వైఖరిని చంద్రబాబు వద్ద గట్టిగానే వినిపించారని సమాచారం. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని కూడా దేవేందర్ పార్టీ నేతతో చెప్పినట్లు తెలిసింది. ఈ స్థితిలో తెలంగాణ లొల్లి పార్టీని కుదిపేసింది. నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులుకు ఓటమికి బాధ్యుడంటూ పార్టీ నాయకత్వం గుత్తా సుఖేందర్ రెడ్డిపై చర్యకు ఉపక్రమించింది. తెలంగాణవాదులను పార్టీ బయటకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటన వెనక కోస్తాంధ్ర నాయకుడు యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని దేవేందర్ గౌడ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీలో స్పష్టంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. కాగా, తెలంగాణకు అనుకూలంగా కడియం శ్రీహరి, ముత్యంరెడ్డి, ఇ. పెద్దిరెడ్డి వంటివారు గట్టిగా మాట్లాడారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. అయితే అనుకూలమని మాత్రం చెప్పలేదు. తెలంగాణపై తాము వేసిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు.
వరంగల్ పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు మధ్యవర్తిత్వం నెరిపి దేవేందర్ గౌడ్ తో చంద్రబాబు మాట్లాడేలా చూశారు. దీంతో చంద్రబాబు దేవేందర్ గౌడ్ తో మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, యనమల రామకృష్ణుడులతో కూడా ఆయన ఫోనులో మాట్లాడారు. దాంతో కాస్తా సద్దుమణిగినట్లు అనిపించినా కడియం శ్రీహరి పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ సమస్య వెంటనే పరిష్కారమయ్యేది కాదని, కమిటీ సమావేశం ఒక్కసారి సమావేశమైనంత మాత్రాన పరిష్కారం కాదని, కమిటీలో విస్తృత చర్చ జరుగుతుందని, ఆ చర్చ తర్వాతనే పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు అంటున్నారు. తెలంగాణపై బహిరంగ ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.
తాము వ్యతిరేకం కాదని చెబుతూ తెలంగాణ అంశాన్ని నాన్చేందుకు లేదా ప్రస్తుత వైఖరినే కొనసాగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. దీని వల్ల పార్టీకి నష్టం ఉండదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కోస్తాలోని నాయకులు చాలా మంది పార్టీని వైదొలిగే ప్రమాదం కూడా లేకపోలేదు. తెలంగాణ అంశాన్ని గుర్తించి కమిటీ వేయడమే తప్పనంతగా తెలుగుదేశం పార్టీలో ఒక అభిప్రాయం ఉంది. తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు చంద్రబాబుకు లేదనే వాదన వినిపిస్తోంది. ఈ స్థితిలో తెలంగాణవాదులకు మిగిలి ఉన్న తొవ్వ ఏదనేది ప్రశ్న.












Click it and Unblock the Notifications