'సైకిల్' దూసుకెళ్లిందా?
తెలంగాణ జిల్లాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం చోటు చేసుకుంది. ఒక పార్లమెంటు సీటును, నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీంతోనే ఆ పార్టీ సంబరపడిపోతోంది. అయితే కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం పార్టీకి ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. ఆ లెక్కన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ రెండు పార్టీల కన్నా ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ఆ రెండు పార్టీల కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. నిజానికి, వరంగల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావుకు 900 మెజారిటీ మాత్రమే వచ్చింది. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి సంతోషపడాల్సిందేమీ లేదని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. 2004 ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ పొత్తు వల్ల ఆ సీట్లను పోగొట్టుకున్నామని భావించినా, ఇప్పుడు ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడైనా ఇంకా ఎక్కువ సీట్లు గెలవాల్సి ఉంది.
ఎన్నికలు జరిగిన 16 సీట్లు తెరాసవి కావడం వల్లనే కొన్ని సీట్లను కోల్పోవడం వల్ల ఆ పార్టీ ఓడిపోయినంత పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ముషీరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ సీట్లు కాంగ్రెస్ బలం లేకుండా 2004 ఎన్నికల్లోనూ తెరాస గెలుచుకుని ఉండేది కాదు. మిగతా స్థానాల విషయానికి వస్తే రామాయంపేట, డిచ్ పల్లి సీట్లను కోల్పోవడం తెరాసపై తీవ్రంగా దెబ్బ తీసినట్లయింది. అలాగే కరీంనగర్ లోకసభ స్థానంలో ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మెజారిటీ గణనీయంగా తగ్గడం కూడా ఫలితాల ప్రభావం తెరాసపై తీవ్రంగా పడింది.
2004 సాధారణ ఎన్నికలకు ముందు ఈ 16 సీట్లలో చాలా సీట్లు తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటలు. తెలుగుదేశం పార్టీ 14 సీట్లలో పోటీ చేసింది. చేర్యాల, ముషీరాబాద్ నియోజకవర్గాలను సిపిఎంకు వదిలిపెట్టింది. హుజూరాబాద్, కమలాపూర్, స్టేషన్ ఘనపూర్, డిచ్ పల్లి, ఆలేరు, జడ్చర్ల, సికింద్రాబాద్, ఖానాపూర్, రామాయంపేట అలాంటి సీట్లలో కొన్ని. ఆదిలాబాద్ లోకసభ సీటులో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటూ వస్తున్నది. ఆ సీట్లలో తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం వల్ల, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తెలుగుదేశం పార్టీ ఆ సీట్లను కోల్పోయిందని అనుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుంజుకుని ఉంటే ఆ సీట్లను తిరిగి కైవసం చేసుకోవాల్సి ఉండింది. కానీ అలా జరగలేదు. సికింద్రాబాద్, రామాయంపేట, స్టేషన్ ఘనపూర్ సీట్లను మాత్రమే తిరిగి తెలుగుదేశం సొంతం చేసుకోగలిగింది. మిగతా సీట్లలో దాని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
చేర్యాల, ముషీరాబాద్ సీట్లలో సిపిఎం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండి కూడా సిపిఎం అభ్యర్థులు పోటీ కూడా ఇవ్వలేకపోవడాన్ని బట్టి చూస్తే కూడా పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ తమకు సరిగా సహకరించలేదేమోనని సిపిఎం కార్యదర్శి రాఘవులు అంటున్నారు. అది కూడా టిడిపి వైఫల్యమే అవుతుంది. ఈ ఎన్నికల్లో ఎక్కువగా లాభపడింది కాంగ్రెస్ పార్టీ. ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. మూడ దశాబ్దాలుగా ఊసే లేని నియోజకవర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అందువల్ల టిడిపి సంతోషపడాల్సిందేమీ లేదని ఫలితాలు తెలియజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications