బాబుకు బిజెపి గాలం

తృతీయ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతోంది. వామపక్షాల నేతృత్వంలోని తృతీయ కూటమిలో ఉండడం వల్ల లాభం లేదని, కాంగ్రెసు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే తమకు మద్దతివ్వాలని బిజెపి నాయకులు చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చే పరిస్థితులు కేంద్రంలో ఉంటే చంద్రబాబు ఎన్డీయెకు మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
అలాగే వివిధ రాష్ట్రాల్లో తమకు దూరంగా ఉన్న పార్టీలను దగ్గర చేసుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. పకడ్బందీగా ఈ వ్యవహారాన్ని నడుపుతోంది. ఇందులో భాగంగానే చంద్రబాబును దువ్వే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రమాదాన్ని ఊహించే సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ సోమవారం చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. వామపక్షాలు కేంద్రంలో కాంగ్రెసుకు మద్దతిచ్చే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. ఈ స్థితిలో వామపక్షాలతో ఉండడం చంద్రబాబుకు ప్రయోజనకారి కాదని అంటున్నారు. కాంగ్రెసుకు వామపక్షాలు మద్దతిస్తే చంద్రబాబు ఎన్డీయె వైపు రాకతప్పదని కూడా అంటున్నారు. బిజెడి నాయకుడు నవీన్ పట్నాయక్ కూడా తిరిగి బిజెపికి దగ్గర కావచ్చునని చెబుతున్నారు. తమిళనాడులో జయలలితను కూడా దగ్గర చేసుకోవడానికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది. మహారాష్ట్రలోని నవ నిర్మాణ సేనను దువ్వే ప్రయత్నాన్ని బిజెపి గోపీనాథ్ ముండేకు అప్పగించింది.












Click it and Unblock the Notifications