వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు తెలంగాణ శాపం

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అధికారాన్ని దగ్గర చేస్తున్నదీ, దూరం చేస్తున్నదీ తెలంగాణ అంశమే అవుతుందా. పరిస్థితులను విశ్లేషిస్తే ఆ ప్రశ్నకు అవుననే సమాధానం వచ్చే అవకాశాలున్నాయి. మహాకూటమికి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మహాకూటమి చెక్కుచెదరకుండా ఉంటే అధికారం చంద్రబాబుకు అంది రావచ్చు. కానీ, పరిస్థితులు అలా లేవు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చంద్రబాబుకు కుచ్చుటోపీ పెట్టే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వచ్చే పార్టీలతో జత కట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని కెసిఆర్ చేసిన ప్రకటన చంద్రబాబు గుండెల్లో గుబులు రేపుతోంది. దానికి తోడు, రాష్ట్ర రాజకీయాల్లో చకచకా పావులు కదులుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు అధికారం దక్కనివ్వకూడదనే ఎత్తుగడలతో కాంగ్రెసు పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు.

తెలుగుదేశం, వామపక్షాలకు కలిపి 120 నుంచి 130 శాసనసభా స్థానాలు వచ్చే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు 25 నుంచి 29 సీట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. తెరాస కలిసి వస్తేనే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠం దక్కే పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నారు. ఈ స్థితిలో కెసిఆర్ తనకు అనుకూలమైన రాజకీయ క్రీడకు తెర తీసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు నాయకులు తెరాసను దగ్గరకు తీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మద్దతు తీసుకున్నా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదనేది విశ్లేషకుల అంచనా. చంద్రబాబును అధికారానికి దూరం చేయాలంటే కెసిఆర్ మద్దతు కూడా కాంగ్రెసుకు కావాల్సి ఉంటుంది. దానికి తోడు, కేంద్రంలో అధికారం కోసం కూడా కెసిఆర్ మద్దతు కాంగ్రెసుకు అవసరం పడవచ్చు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని కెసిఆర్ మద్దతు పొందడానికి కాంగ్రెసు ముందుకు రావచ్చునని అంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మాటలను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. తెలంగాణ ఇచ్చే పార్టీలతో జత కడతామని కెసిఆర్ చెప్పారు, ఇక కాంగ్రెసు కెసిఆర్ మద్దతు తీసుకోవడానికి అడ్డంకేముందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టి తెలంగాణకు చెందిన బిసి నేతను ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నాలు ఇప్పటికే కాంగ్రెసులో ఊపందుకున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డికి కూడా ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానవర్గం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి తనకు అత్యంత సన్నిహితుడైన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరును సూచించారు. అందుకే పొన్నాల లక్ష్మయ్య ఇటీవల వైయస్, డిఎస్ లతో పాటు ఢిల్లీలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం డి.శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు తెరాస అధినేత కెసిఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆయన తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నారు. దీనికి తోడు, డి. శ్రీనివాస్ మనుషులు ఇప్పటికే చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరో కాంగ్రెసు నేత డాక్టర్ కె. కేశవరావు కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారు. కేశవరావుకు కూడా కెసిఆర్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈయన కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా లేరు. మరో నేత వి. హనుమంతరావు పేరు కూడా ముఖ్యమంత్రి పదవికి వినిపిస్తోంది. తెలంగాణ బిసీ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలనే అధిష్ఠానం ఆలోచనపై కోస్తా ప్రాంతానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు రుసరుసలాడారు కూడా. వైయస్ రాజశేఖర రెడ్డికి చెందని తెలంగాణ బిసి నేతను ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్ర విభజనకు మార్గం సుగమం అవుతుందనేది కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు.

తాము కేంద్రంలో ఎన్డీయెకు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని తాజాగా తెరాస నాయకుడు వినోద్ కుమార్ చెప్పారు. చంద్రబాబు కూడా ఎన్డీయెతో వస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో అయోమయాన్ని సృష్టించడానికే ఆయన ఈ ప్రకటన చేశారని చెప్పవచ్చు. లేదంటే, కాంగ్రెసు పార్టీని తొందర పెట్టడం కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. ఈ స్థితిలో చంద్రబాబును అధికారానికి దూరంగా ఉంచాలనే కాంగ్రెసు ఎత్తుగడలకు కెసిఆర్ ఉపయోగపడవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు ఒక రకంగా వరంగానూ మరో రకంగా శాపంగానూ పరిణమించే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X