జయప్రదకు 'ఆజం' వణుకు

ఆజంఖాన్ కు ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆశీస్సులున్నాయి. ఈ విషయంపై అమర్ సింగ్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ ను అదుపు చేయకపోతే తాను పార్టీ నుంచి తప్పుకుంటానని అమర్ సింగ్ అల్టిమేటం కూడా ఇచ్చారు. ఆజంఖాన్ తనపై ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా మాట్లాడవద్దని ములాయం సింగ్ తనకు చెబుతున్నారని, ఇదే పరిస్థితి ఉంటే పార్టీలో కొనసాగడం కష్టమని ఆయన అంటున్నారు. అమర్ సింగ్ పై అదే స్థాయిలో ఆజంఖాన్ విరుచుకు పడుతున్నారు. తనపై శివుడి మూడో కన్ను తెరుస్తానని అమర్ సింగ్ అంటున్నారని, అంటే తన ప్రాణాలకు అమర్ సింగ్ నుంచి ముప్పు ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు.
2004 ఎన్నికల్లో ఆజంఖాన్ ముందుండి జయప్రదను గెలిపించారు. కానీ ఈసారి ఆమెను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు. జయప్రదకు ఓటేస్తే బాబ్రీ మసీదును కూల్చిన కళ్యాణ్ సింగ్ కు ఓటేసినట్లేనని ఆయన ప్రచారం చేస్తున్నారు. నిజానికి, కళ్యాణ్ సింగ్ ఎస్పీలోకి రావడంతోనే అమర్ సింగ్, ఆజంఖాన్ లకు మధ్య విభేదాలు పొడసూపాయి. అమర్ సింగ్ చొరవతోనే మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఎస్పీలో చేరారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన ప్రవేశాన్ని ఆజంఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఎస్పీలో ముసలానికి దారి తీసింది. అది జయప్రద విజయానికి ఎసరు పెట్టింది.












Click it and Unblock the Notifications