• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు

By Pratap
|

Telangana Talli
ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జవహర్ లాల్ నెహ్రూ 1956 మార్చి 5వ తేదీన నిజామాబాద్ లో మాట్లాడుతూ అమాయకమైన పిల్లను (తెలంగాణను), తెలివైన పిలగాడికి పెళ్లి చేసినట్లుగా ఉంది, కలిసి ఉండాలా, విడిపోవాలా అనేది వారిష్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రెండు ప్రాంతాలను విలీనం చేస్తున్నట్లు ఆ ప్రకటన ద్వారా తొలిసారి తెలిసింది. హైదరాబాద్ (తెలంగాణ), ఆంధ్ర రాష్ట్రాలను విలీనం చేస్తూ 1956 నవంబర్ 1వ తేదీన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

విలీనం సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. విద్య, ఉద్యోగాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని, తెలంగాణలోని అదనపు రెవెన్యూను ఆ ప్రాంతంలోనే ఖర్చు చేస్తామని, తెలంగాణ ప్రాంతానికి కేటాయించే నిధుల లెక్కలు ప్రత్యేకంగా చూపుతామని, అందుకు ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి గానీ ఉప ముఖ్యమంత్రి పదవి గానీ తెలంగాణకు దక్కాలని, అలాగే హోం, రెవెన్యూ, ప్రణాళక, అభివృద్ధి శాఖల్లో కనీసం రెండు ప్రధాన మంత్రిత్వ శాఖలను తెలంగాణవారికి ఇవ్వాలని కూడా ఒప్పందం కుదిరింది. నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన మరు క్షణమే పెద్ద మనుషులు ఒప్పందం ఉల్లంఘన మొదలైంది. ఆరో వేలితో సమానమంటూ తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించారు. హోం మంత్రిత్వ శాఖ మినహా మిగతా ప్రధానమైన శాఖలను గత 53 ఏళ్లలో ఎప్పుడో గాని ఇవ్వలేదు.

1969 జై తెలంగాణ ఉద్యమం

ముల్కీ నిబంధనలను, పెద్ద మనుషుల ఒప్పందాన్ని యధేచ్ఛగా ఉల్లంఘించారు. దీంతో 1968 నాటికి 25 వేల మందికి పైగా తెలంగాణలోని ఉద్యోగాల్లో చేరిపోయారు. దాంతో విద్యార్థులు, ఉద్యోగుల్లో తమకు మోసం జరిగిందనే భావన పాదుకుంది. తమకు అర్హతలు, సామర్థ్యం, పోటీ తత్వం ఉన్నప్పటికీ ఉద్యోగాలు లభించడం లేదనే ఆవేదన గూడుకట్టుకుంది. తెలంగాణేతర ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారుల బంధుప్రీతి వల్ల తెలంగాణేతర ప్రాంతాలవారే ఉద్యోగాలను కొల్లగొడుతూ వచ్చారనే అభిప్రాయం బలంగా నాటుకుంది.

ముల్కీ నిబంధనలను కాలరాస్తూ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ప్రభుత్వోద్యోగాల్లో నిండిపోయారు. సీనియారిటీ ప్రాతిపదికపై తెలంగాణవారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభించలేదు. వాటిని తెలంగాణేతర ప్రాంత ఉద్యోగులతో నింపేస్తూ వచ్చారు. పన్నుల తదితర రూపాల్లో తెలంగాణలో సమీకరించిన నిధులను ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు మళ్లించింది. బొగ్గు, నీరు వంటి సహజ వనరులను ఆంధ్ర ప్రాంత అబివృద్ధికి, పరిశ్రమలకు తరలించారు. దీంతో విద్యార్థుల ఉద్యమం ఎగసిపడింది. దాన్నే 1968 - 69 జై తెలంగాణ ఉద్యమంగా పిలుస్తారు.

ఆ ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తలెత్తినప్పటికీ అనతి కాలంలోనే తెలంగాణ ప్రాంతమంతా విస్తరించింది. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వోద్యోగులు, ప్రతిపక్ష సభ్యులు ప్రత్యక్ష చర్యకు దిగుతామని హెచ్చరించారు. ఉద్యోగులు పెన్ డౌన్ వంటి సమ్మెలకు దిగారు. అన్ని వర్గాలవారు ఉద్యమంలోకి వచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి దిగారు. మదన్ మోహన్, మల్లికార్జున్, విబి రాజు, పులి వీరన్న వంటి నాయకులు ఉద్యమంలోకి వచ్చారు.

తొమ్మిది నెలల ఉద్యమ కాలంలో పోలీసు కాల్పుల్లో 370 మందికిపైగా విద్యార్థులు మరణించారు. 70 వేల మందికి పైగా అరెస్టయ్యారు. వారిలో 7 వేల మంది మహిళలున్నారు. 3266 సార్లు ఆందోళనకారులపై పోలీసు లాఠీచార్జీలు జరిగాయి. ఈ లాఠీచార్జీల్లో 20 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 1840 మంది బుల్లెట్లకు, టియర్ గ్యాస్ షెల్స్ కు గాయపడ్డారు. ఇదంతా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి కనుసన్నల్లో జరిగింది.

ఉద్యమం తీవ్రతరం కావడంతో తెలంగాణ హక్కుల రక్షణకు అఖిల పక్ష ఒప్పందం కుదిరింది. అయితే ఆరు నెలలలోపలే దానికి కాలదోషం పట్టింది. అప్పటి ప్రధాని ఇందిరా గాందీ ఎనిమిది సూత్రాలు, ఐదు సూత్రాల ఫార్ములాలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేశారు. దీంతో 1971 సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను బ్యాలెట్ రూపంలో తెలియజేశారు. తెలంగాణ ప్రాంతంలోని 14 లోకసభ సీట్లలో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి 11 సీట్లను గెలుచుకుంది.

ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ పార్టీ కొత్త నాయకులు 1971 సెప్టెంబర్ లో ఉద్యమాన్ని వదిలేశారు. మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులు తెలంగాణ ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తూ కాంగ్రెసు పార్టీలో చేరారు. 1971 సెప్టెంబర్ లో కాసు బ్రహ్మానందరెడ్డి స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనల కింద స్థానికులకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన ప్రత్యేక అవకాశాలను సమర్థిస్తూ 1972లో తీర్పు ఇచ్చింది.

దాంతో జై ఆంధ్ర ఉద్యమం తలెత్తింది. ముఖ్యమంత్రి పివి నరసింహారావు తన మంత్రివర్గాన్ని ప్రకటించిన రోజే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.

తెలంగాణకు జై ఆంధ్ర ఉద్యమం పెను ముప్పుగా పరిణమించింది. దాంతో ఈ కింది అంశాలపై చర్చలు జరిగాయి.

ఎ. ముల్కీ నిబంధనలు కొట్టేశారు.

బి. తెలంగాణ ప్రాంతీయ బోర్టు రద్దయింది.

సి. ఫ్రీజోన్ గా ప్రకటించకుండానే ఆరో జోన్ లోని హైదరాబాద్ అనధికారికంగా ఫ్రీజోన్ అయిపోయింది.

డి. స్థానికతకు 12 నుంచి 14 నివాసం విధానంగా మారింది.

ఇ. ఆంద్ర, తెలంగాణ ప్రాంతాల రెవెన్యూను విడివిడిగా చూపడాన్ని ప్రభుత్వం ఆపేసింది.

ఎప్. తెలంగాణ రైతుల నుంచి భూములను కొనుగోలు చేయడానికి స్వేచ్ఛ లభించింది.

దాంతో ఆరు సూత్రాల పథకాన్ని తుంగలో తొక్కారు. తద్వారా తెలంగాణ ప్రజలకు మరోసారి ద్రోహం తలపెట్టారు.

జలవనరులను, ఉద్యోగాలను, విద్యావకాశాలను కొల్లగొట్టే విషయంలో ఆంద్రులు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని చూద్దాం. తెలంగాణలో దేశంలోనే అతి పెద్ద బొగ్గు గనులున్నాయి. సున్నంరాయి నిల్వలు, విశాలమైన అడవులు, థర్మల్ విద్యుదుత్పత్తి సౌకర్యాలున్నాయి. వివిధ ఉపనదులున్న కృష్ణా, గోదావరి నదుల 70 శాతం క్యాచ్ మెంట్ ఏరియా ఉంది.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజలు ప్రతిసారీ ఆత్మగౌరవ, స్వయంపాలన పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలుగు భాష, తెలుగు సహోదరత్వం పేరు చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు కాలరాస్తూనే ఉన్నారు. తెలంగాణవాదులను వేర్పాటువాదులుగా చిత్రీకరిస్తూ తెలంగాణ ప్రజల డిమాండ్ పై దెబ్బ కొడుతూనే ఉన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడడానికి పోరాటం చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులను వేర్పాటువాదులుగా కాకుండా మహా నాయకులుగా ఎందుకు కీర్తిస్తున్నారనేది ప్రశ్న. గత 53 ఏళ్లలో అన్ని నిబంధనలను ఒప్పందాలను, ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారు. వనరులను ఉద్యోగాలను, నిధులను ఆంద్ర ప్రాంతాభివృద్ధికి మళ్లిన్తూనే ఉన్నారు.

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X