ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో నిజాం 12 కోట్ల విలవు చేసే సెక్యూరిటీ బాండ్లు ఇచ్చాడు. ప్రస్తుతం పన్నల రూపంలో ప్రభుత్వ ఖజానాకు 50 శాతం రెవెన్యూ వస్తున్నది. అయితే 29 శాతం మాత్రమే తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు. సెజ్ లు, ఐటి పార్కులు వంటి వాటి పేరు మేద ప్రభుత్వం గత దశాబ్ది కాలంలో 20 వేల కోట్ల విలువ చేసే భూములను విక్రయించింది. భూములు అమ్మడం ద్వారా వచ్చిన సొమ్మును ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మళ్లించారు.
వైద్య, ఆరోగ్య సేవలు
తెలంగాణ ప్రాంతంలో ఈ కింది ఆస్పత్రులున్నాయి. మెంటల్ హెల్త్ ఎర్రగడ్డ సంస్థ, నిలోఫర్ ఆస్పత్రి, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి, నిమ్స్, ఇఎన్టీ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, టిబి ఆస్పత్రి, కోఠీ జనరల్ ఆస్పత్రి, పలు ఆయుర్వేద, యునానీ ఆస్పత్రులు. ఇవ్వన్నీ నిజాం హయాం నుంచీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత వరంగల్లులోని ఎంజిఎం తప్ప ప్రధాన ఆస్పత్రేదీ తెలంగాణ ప్రాంతంలో రాలేదు. ఆంద్రలో 666, రాయలసీమలో 303, తెలంగాణలో 270 ఆస్పత్రులున్నాయి.
పరిశ్రమలు, విద్యుత్తు వినియోగం
ఆంద్రలో 6045 లఘు, మధ్యతరహా ఉత్పత్తి యూనిట్లున్నాయి. వీటికి 54 శాతం విద్యుత్తు వినియోగం జరుగుతున్నది. రాయలసీమలో 773 యూనిట్లు 23 శాతం విద్యుత్తును వినియోగించుకుంటున్నాయి. తెలంగాణలోని 1253 యూనిట్లు 23 శాతం విద్యుత్తును వినియోగించుకుంటున్నాయి.
ఆజం జాహీ మిల్స్, సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటైన భారీ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. వేలాది మంది తెలంగాణవారు ఉద్యోగాలు కోల్పోయారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప వంటి చోట్ల ప్రభుత్వం పలు పరిశ్రమలను స్థాపించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
వరుస ప్రభుత్వాలు తాము అభివృద్ధి చేశామనే మాటల్లో ఏ మాత్రం నిజం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల పలు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి యూనిట్లను తెరిచారు. దీనివల్ల పటాన్ చెరు, కాటేదాన్, బాలానగర్, బొల్లారం వంటి ప్రాంతాల్లో నీరు, గాలి కలుషితమై పోయింది. ఈ కంపెనీల్లో పనిచేస్తున్నవారిలో 90 శాతం మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే.
ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణలోని చేనేత, పవర్లూమ్ వంటి కాటేజీ పరిశ్రమలు మూతపడ్డాయి. లఘు, కాటేజీ, చేనేత పరిశ్రమల పట్ల నిర్లక్ష్యం. ప్రభుత్వ విదానాల వల్ల తెలంగాణలోని పలు లఘు, కాటేజీ పరిశ్రమలు మూతపడ్డాయి. స్థానికేతరులు నెలకొల్పిన ఐటి, ఫార్మా కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సహకాలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణలోని చేనేత, లఘు, కాటేజీ పరిశ్రమల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
రాష్ట్రంలో ఈ ఏడాదిలో రూ. 324 కోట్ల చేనేత రుణాలను ప్రభుత్వం రద్దు చేసింది. అందులో తెలంగాణకు సంబందించి 140 కోట్ల రుణాలుంటాయి. అయితే వాటికి బడ్జెట్ లో కేటాయింపులు లేవు. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బొమ్మన బ్రదర్స్, ఆర్ ఎస్ బ్రదర్స్, చందనా బ్రదర్స్ వంటి బడా షాపింగ్ మాల్స్ కు ప్రభుత్వం అనుమతించింది. ఇవి ప్రత్యక్షంగా తెలంగాణలోని చేనేత కార్మికుల పొట్టలు కొడుతున్నాయి.
తెలంగాణలో తాటి చెట్లు విరివిగా ఉన్నాయి. అయితే కల్లును బహిరంగంగా అమ్మడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. నగర పరిధిలో కల్లు విక్రయాలపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. కోస్తాంధ్రలోని కొబ్బరి నీళ్ల వ్యాపారాన్ని మాత్రం తెలంగాణతో సహా అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అవకాశం కల్పించింది. కాకతీయ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పెంబర్తి షీట్ క్రాఫ్ట్, బ్రాస్ వేర్ క్రాఫ్ట్ లను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి.
రాజకీయాధికారం
గత 53 ఏళ్లలో రాష్ట్ర చరిత్రలో అభివృద్ధిలో రాజకీయాధికారం కీలక పాత్ర పోషించింది. ఆంద్ర ముఖ్యమంత్రులు 24 ఏళ్లు, రాయలసీమ ముఖ్యమంత్రులు 22 ఏళ్లు, తెలంగాణ ముంక్యమంత్రులు ఆరేళ్లు పాలించారు. తెలంగాణేతర ముఖ్యమంత్రులను మార్చడానికి ముగ్గురు తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులను వాడుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరు కూడా పూర్తి అధికారాన్ని వినియోగించుకుని పూర్తి ఐదేళ్లపాటు సాగకుండానే చూశారు. తెలంగాణ ముఖ్యమంత్రులు పరిపాలన సాగించడానికి అవకాశం కల్పించి ఉంటే పరిస్థితి భిన్నంగానే ఉండేది. ఒత్తిడి రాజకీయాల వల్ల మేధావి అయిన పివి నరసింహారావు కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేకపోయారు. మర్రి చెన్నారెడ్డిని గద్దె దించడానికి తెలంగాణేతర నాయకుడు హైదరాబాదులో మతకల్లోలాలు సృష్టించాడనే ఆరోపణ ఉంది. అందువల్ల తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులు తెలంగాణకు ఏమీ చేయలేకపోయారు.
పట్టణాభివృద్ధి
జెఎన్ఎన్ఆర్ఎం కింద పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులు వస్తాయి. వాటిలో వందలాది కోట్ల రూపాయలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలను అభివృద్ధి చేయడానికి మాత్రమే ఖర్చు చేశారు. హైదరాబాద్ మినహా ఇతర నగరాలేవీ అభివృద్ధి చెందలేదనేది అసత్యం. విశాఖ, విజయవాడ నగరాలను ఎవరు అభివృద్ధి చేశారు. హైదరాబాద్ మినహా అభివృద్ధి చెందిన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలంగాణేతర ప్రాంతాల్లోనే ఉన్నాయి.
రైతుల తొలగింపు, ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారం
ప్రధాన పట్టణాలు, నగరాలు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లోని చిన్న, సన్నకారు రైతులు నిస్సహాయులుగా మారిపోయారు. సెజ్ ల అభివృద్ధికి బలవంతంగా తమ భూములను ఎపిఐఐసికి విక్రయించాల్సి వచ్చింది. భూలావాదేవీల్లో ఎపిఐఐసి మధ్యదళారీగా మారిపోయింది. ఎపిఐఐసి వందలాది ఎకరాలు సేకరించి ఆంద్ర, రాయలసీమ పెద్దలకు చెందిన కంపెనీలకు కట్టబెట్టింది. సెజ్ లకు పన్ను మినహాయింపులు, ప్రోత్సహకాలను ప్రభుత్వం ఇస్తుంది. అవి మాత్రం స్థానికులకు ఉపాధిని కల్పించవు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్ లు) పరిసరాల అసమతుల్యతకు, ఆహార కొరతకు కారణమవుతాయి. సెజ్ లకు కేటాయించిన వందలాది ఎకరాల్లో నాలుగో వంతు మాత్రమే వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు, మిగతా భూములను రియల్ ఎస్టేట్ వెంచర్స్ కు మారుస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆంద్ర పెట్టుబడిదారులకు ఆ భూములు బంగారు పంట పండిస్తున్నాయి. లగడపాటి రాజగోపాల్ వక్ఫ్ భూములను, ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను ఆక్రమించుకుని ల్యాంకో హిల్స్ ప్రాజెక్టును చేపట్టారు.
సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్
సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో మణుగూరు, ఇల్లందు, కోయగూడెం, కొత్తగూడెం, కైరిగుడా, సత్తుపల్లి, దోర్లీ, అబ్బాపూర్, శ్రీరాంపూర్, భూపాలపల్లి వంటి 14 చోట్ల ఓపెన్ మైనింగ్ జరుగుతోంది. దాని వల్ల వాతావరణ కాలుష్యం, అడవుల ధ్వంసం, ప్రజల స్థానభ్రంశం చోటు చేసుకుంటున్నాయి. నిరాశ్రయులవుతున్న ప్రజలకు సరైన పునరావాసం కూడా కల్పించడం లేదు.
నల్లగొండ జిల్లాలోని జలాల్లో ఫ్లోరైడ్ స్థాయిలు
కృష్ణా నది నల్లగొండ జిల్లా మీదుగా పారుతుంది. కానీ ఆ నదీ జలాలు నల్లగొండ జిల్లా రైతులకు అందుబాటులోకి రాలేదు. పైగా, నల్లగొండ జిల్లాలోని భూగర్భ జలాల్లో మోతాదుకు మించి. ఫ్లోరైడ్ ఉంది. దాంతో ఆ జలాలు విషపూరితంగా మారాయి. ఆ జలాలను తాగడం వల్ల ప్రజలు డెంటల్, స్కెలెటల్ ఫ్లోరోసిస్ కు గురవుతున్నారు. నల్లగొండ జిల్లాలోని 885 గ్రామాలు ఫ్లోరోసిస్ కు గురయ్యాయి. దాని వల్ల ఆరు లక్షల మంది బాధితులుగా మారారు. ఈ సమస్య పరిష్కారానికి ఏ ప్రభుత్వం కూడా కృషి చేయలేదు.
ఖనిజ వనరులు, అడవులు
ఆంద్రప్రదేశ్ లోని వంద శాతం బొగ్గు తెలంగాణ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతుంది. ఈ బొగ్గును థర్మల్ విద్యుత్కేంద్రాలకు వాడుతున్నారు. ఈ విద్యుత్కేంద్రాల ద్వారా మొత్తం దక్షిణ భారత దేశానికి విద్యుత్ సరఫరా అవుతుంది. తెలంగాణ రైతులకు 2-4 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతున్నది. తెలంగాణలో భారీ సున్నంరాయి నిక్షేపాలున్నాయి. ఆంద్ర నుంచి వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నల్లగొండ జిల్లాలో సిమెంట్ కర్మాగారాలు స్థాపించారు.












Click it and Unblock the Notifications