• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమైక్యాంద్ర ప్రదేశ్ లో మాదిగలకు అన్యాయం

By Pratap
|

Telangana Talli
ఆంద్రప్రదేశ్ లోని ఎస్ లకు విద్య, ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మొత్తం ఎస్సీల్లో 43 శాతం మంది మాదిగలు, 43 శాతం మంది మాలలు, ఆరు శాతం మంది ఇతర ఎస్సీలు ఉన్నారు. ప్రభుత్వ రంగంలోని విద్య, ఉద్యోగాల్లోని ఎస్సీ రిజర్వేషన్లను దాదాపు పూర్తిగా మాలలే వినియోగించుకున్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) గత పదేళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పోరాటం చేస్తూ వస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలకు, ఇతర ఎస్సీ గ్రూపులకు తగిన కోటా లభించడానికి వీలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకకణ జరగాలని జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్, జస్టీస్ ఉషా మెహ్రా కమిషన్ సూచించాయి. వర్గీకరణకు కాంగ్రెసు హామీ ఇచ్చినప్పటికీ ఆంద్ర ప్రాంతానికి చెందిన ఆధిపత్య మాలల ఒత్తిడి వల్ల పార్లమెంటులో బిల్లు రావడం లేదు. మొత్తం మాదిగల్లో 70 శాతం మంది తెలంగాణలోనే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల మాదిగలకు ప్రయోజనం చేకూరుతుంది.

ఆంద్ర వలసవాదం

ఆంధ్ర, రాయలసీమల నుంచి వలసలు పెరగడం వల్ల తెలంగాణ జనాభాలో 18 శాతం పెరుగుదల కనిపిస్తుంది. గత 30 ఏళ్లలో హైదరాబాదులోని కాకుండా తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో పలు కాలనీలు వెలిశాయి.

తెలంగాణ అమరవీరులు, నాయకుల విస్మరణ

తెలంగాణకు చెందిన రామనంద తీర్థ, కెవి రంగారెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, కొమురం భీం, రావి నారాయణ రెడ్డి, షోబుల్లా ఖాన్, బద్దం ఎల్లా రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కాళోజీ నారాయణ రావు వంటి మహానుభావులకు ఏ విధమైన గుర్తింపు ప్రభుత్వాలు కల్పించడం లేదు. తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయని ఆంద్ర నాయకులు పేర్లు మాత్రం ఇక్కడి వీధులకు, రోడ్లకు, కాలనీలకు పెట్టుకుంటున్నారు. వారి విగ్రహాలు స్థాపిస్తున్నారు. హైదరాబాదులోని ట్యాంక్ బందడ్ పై 31 విగ్రహాలుంటే తెలంగాణకు చెందినవారివి రెండు మూడు మాత్రమే.

హైదరాబాద్ (హైదర్ - ఆబాద్), సికింద్రాబాద్ (సికిందర్ - ఆబాద్) జంటనగరాలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్లు ఆంధ్ర పాలకులు గొంతు చించుకుంటున్నారు. నిజానికి, విలీనానికి ముందే హైదరాబాద్ లో అన్ని మౌలిక వసతులున్నాయి. విలీనానికి ముందు దేశంలో హైదరాబాద్ ఐదో అతి పెద్ద నగరం. ఇప్పుడు కూడా హైదరాబాద్ స్థానం అదే.

చాళుక్యులు, చోళులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, సైనిక దాడి ద్వారా మొఘల్స్, చివరగా నిజామ్ లు హైదరాబాద్ పై తమ ముద్రలు వేశారు. ముత్యాలు, ఆభరణాలు, చుడి బజార్, బిర్యానీ, మొఘలీ భోజనాలు, సంపద్వంతమైన దక్కనీ సంస్కృతి (దక్షిణ, ఉత్తర భారత సంస్కృతీ సమ్మేళనం)లకు హైదరాబాద్ ప్రసిద్ధి. హిందూ, తెలుగు సాహిత్యానికి ఈ రెండు భాషల కవులు ఎంతో అందించారు. కన్నడిగులకు, మరాఠీలకు, తమిళులకు, మలయాళీలకు, సింధీలకు, పార్సీలకు, గుజరాతీలకు, రాజస్తానీలకు, బెంగాలీలకు తదితరులకు హైదరాబాద్ సొంత నగరంగా విలసిల్లుతోంది. తెలుగు మాట్లాడేవారితో పాటు ఉర్దూ మాట్లాడే వారు కూడా శతాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు హైదరాబాద్ లో మతఘర్షణలు జరగలేదు. సాయుధ పోరాట కాలంలో సాగిన దమనకాండ బయటి నుంచి వచ్చిన రజాకార్ల వల్ల, హైదరాబాద్ రాజ్యాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించడం వల్ల జరిగిందే. ఈ దమనకాండకు మతం కన్నా పాలకవర్గ లక్షణమే ఎక్కువగా ఉంటుంది. దానికి మతాన్ని వాడుకుంటే వాడుకుని ఉండవచ్చు.

హైదరాబాద్ లో ప్రజలకు మంచినీరు అందించడానికి నిజాం హయాం నాటికే 200 సరస్సులున్నాయి. వందలాది ఏళ్లుగా హైదరాబాద్ పర్యాటక స్థలంగా వర్ధిల్లుతున్నది. చార్మినార్, మినార్లు, సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, హుస్సేన్ సాగర్, గండిపేట, ఖైరతాబాద్ గణేష, గోల్కొండ తదితర ఎన్నో ఆసక్తికరమైన చారిత్రక కట్టడాలున్నాయి. ఎంతో మంది పండితులు, చరిత్రకారులు, యాత్రికులు హైదరాబాద్ ను సందర్శించి దాని సాంస్కృతి వారసత్వాన్ని ప్రశంసించారు.

నేటి హైదరాబాద్, మిగతా తెలంగాణ

గత దశాబ్ది కాలంలో హైదరాబాదులో బహుళజాతి సంస్థలతో పాటు పలు ఐటి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మౌలిక సదుపాయాలు ఉండడం, ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం, చౌక ధరలకు భూములు ఇవ్వండ, నైపుణ్యం గల మానవశక్తి అందుబాటులో ఉండడం అందుకు కారణం. పైగా భౌగోళికంగా అమెరికాతో 11 గంటల సమయం వ్యత్యాసం కూడా అందుకు మరో ప్రధాన కారణం. వీటిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 15 నుంచి 20 శాతం మంది మాత్రమే ఉంటారు.

హైదరాబాదులోని ఫ్లై ఓవర్లు, విశాలమైన రోడ్లు, హైటెక్ నగరాలు వంటి ఆధునిక హంగులు తెలంగాణ జిల్లాల్లోని తీవ్రమైన సమస్యలకు పరిష్కారం కావు. ఆదిలాబాద్ జిల్లాలో కలరా మరణాలు, గిరిజన ప్రాంతాల్లో మలేరియా, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, మహబూబ్ నగర్ జిల్లాలో కరవు, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్, నిజాం సాగర్ కింద ఆయకట్టు తగ్గుదల, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కాలుష్యం వంటి సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాల్సి ఉంది. కానీ వాటిని ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

హైదరాబాద్ అభివృద్ధి పేరు మీద చేపట్టిన రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, విమానాశ్రయం ప్రాజెక్టులు, సెజ్ వంటి కార్యక్రమాల వల్ల తెలంగాణ ప్రజలు భూములు, నీళ్లు కోల్పోయారు. అందుకు ప్రజలకు నష్టపరిహారం ఏమీ లభించలేదు. హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఆంద్ర, రాయలసీమ పెద్దలు వారి కోసం చేసుకున్నారే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు.

భూమల కేటాయింపు, విద్యుత్తు, నీళ్లు వంటి సౌకర్యాల కల్పన వల్ల, రాయితీల వల్ల హైదరాబాదుకు సినీ పరిశ్రమ హైదరాబాదుకు వచ్చి స్థిరపడింది. దురదృష్టవశాత్తు, రెండు పెద్ద నిర్మాణ సంస్థలు తెలంగాణలోని అన్ని సినిమా హాళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తద్వారా తెలంగాణలో సినీ పరిశ్రమను ఆ రెండు సంస్థలు నియంత్రిస్తున్నాయి. దీంతో తెలంగాణకు చెందిన చిన్నస్థాయి నిర్మాతలు సినీ పరిశ్రమలోకి ప్రవేశించలేకపోతున్నారు.

రాజకీయాధికారం కొద్ది మంది స్థానికేతరుల చేతుల్లో ఉండడం వల్ల తెలంగాణ ప్రజలు రెండో తరగతి పౌరులుగా జీవించాల్సిన దుస్థితి పట్టింది. తెలంగాణ సంస్కృతిని, భాషను, యాసను అవమానకరమైన రీతిలో సినిమాల్లో వాడుతున్నారు. విలన్లకు, జోకర్లకు, దుష్ట రాజకీయ నేతలకు తెలంగాణ భాషను, యాసను వాడుతూ, తెలంగాణ నాయకులను అధికార కాంక్షగలవారిగా చూపుతూ అవమానాలకు గురి చేస్తున్నారు.

హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులు రంగారెడ్డి, హైదరాబాదుల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారంపై గుత్తాధిపత్యం వహిస్తూ హైదరాబాదు ఆవల 75 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో విస్తరించారు.

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X