బాబుకు చిరు, కెసిఆర్ ల గుబులు

తెలంగాణ పట్ల చంద్రబాబు తీసుకున్న వైఖరి మొత్తంగానే తెలంగాణ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. తెలంగాణ నాయకులు ఎవరు కూడా పెద్దగా పార్టీని వీడే పరిస్థితి లేదు. అయితే క్యాడర్ మాత్రం దూరమవుతోంది. కార్యకర్తులు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరమవుతున్నారు. భవిష్యత్తులో నాయకులు ఎలా మారుతారో చెప్పడం కూడా కష్టమే. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ తెలంగాణలో పారేట్లు లేదు. ఇదే అదునుగా కెసిఆర్ చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికితోడు, రాజోలీబండ డైవర్షన్ స్కీమ్ తూముల ధ్వంసం చంద్రబాబు మెడకు చుట్టుకుంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి తన అనుచరులతో తూములను పగులగొట్టించారని కెసిఆర్ ఆరోపిస్తున్నారు. బాబ్లీ అక్రమ నిర్మాణంపై ఆందోళనకు దిగిన చంద్రబాబు ఆర్డీఎస్ తూముల ధ్వంసంపై నోరు విప్పడం లేదు. దీనికి సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి నష్ట నివారణకు దిగినప్పటికీ లాభం లేకుండా పోతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయినట్లేననే మాట వినిపిస్తోంది.
సీమాంధ్రలో చిరంజీవి పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన సీమాంధ్రలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలకు ప్రజలు పెద్ద యెత్తునే వస్తున్నారు. అంతేకాకుండా, చిరంజీవి కాంగ్రెసుతో చేతులు కలుపుతున్నారు. చిరంజీవి కాంగ్రెసుతో కలిస్తే చంద్రబాబుకు కష్టాలు తప్పవు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. రాయలసీమలోనూ కోస్తాంధ్రలోనూ ప్రజారాజ్యం, కాంగ్రెసు ఓట్లు కలిస్తే తెలుగుదేశం వెనకబడి పోవచ్చు. ఇదే సమయంలో చంద్రబాబు వైఖరిపై చిరంజీవి తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. చిరంజీవి, కెసిఆర్ ల వైఖరులు కాంగ్రెసును కాకుండా తెలుగుదేశం పార్టీని తీవ్రంగా దెబ్బ తీసే విధంగా ఉన్నాయి. దీంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి కాక తప్పేట్లు లేదు.












Click it and Unblock the Notifications