కెసిఆర్ పై బాబు దిగదుడుపే?

కెసిఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ పార్టీ నాయకులను ఎగదోసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. దాంతో రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్ వంటి నాయకులు కెసిఆర్ పై విమర్శలు చేశారు. చివరకు నాగం జనార్దన్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. వారు కెసిఆర్ ను ధీటుగా ఎదుర్కోలేకపోయారు. ఆర్డీఎస్ తూముల ధ్వంసం విషయంలో వారు సరైన జవాబు ఇవ్వడంలో విఫలమయ్యారు. చంద్రబాబును కాదని తెలుగుదేశం తెలంగాణ నాయకులు అంగుళం కూడా కదలలేరనే విషయం మరోసారి బయటపడింది. ఇది చంద్రబాబుకే కాకుండా తెలుగుదేశం తెలంగాణ నాయకులకు కూడా మింగుడు పడని విషయంగా మారింది.
ఎంత చెప్పినా చంద్రబాబు వైఖరి తెలంగాణకు వ్యతిరేకంగా ఉందనేది ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నది. తెలంగాణపై ఎవరు మాట్లాడినా అది పార్టీ వైఖరి కాదని, తాను చెప్పిందే పార్టీ వైఖరి అని చంద్రబాబు చెప్పడంతో తెలంగాణ పార్టీ నాయకుల గాలి పోయింది. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ బహిరంగ లేఖ తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని బయటపెట్టింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నామనే విషయాన్ని చంద్రబాబు ఎంతగా దాచాలన్నా లాభం లేకుండా పోతోంది. దీంతో తెలంగాణలో చంద్రబాబు అడుగు పెట్టలేని స్థితే ఉంది. పార్టీ తెలంగాణ నాయకులు కూడా క్రమంగా బలహీన పడే ప్రమాదం ఉంది. సీమాంధ్రలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వల్ల చంద్రబాబు బలహీన పడే అవకాశాలున్నాయి. చంద్రబాబు రెండు ప్రాంతాలకు కాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అయితే, ఎన్నికలు వచ్చేనాటికి పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం.












Click it and Unblock the Notifications