వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కు కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంపై పట్టు సాధించడానికి ఆ రెండు పార్టీల తెలంగాణ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. తెలంగాణ జెఎసిలో ఉంటూ అందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో వారు తెరాసను, దాని అధ్యక్షుడు కెసిఆర్ ను దెబ్బ తీయాలనే ఎత్తుగడను ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్నాయని అంటున్నారు. ఇందులో కొంత మేరకు విజయం సాధించినట్లు కూడా భావిస్తున్నారు. తెరాసను శాసనసభకు దూరం చేసి, సభా సమావేశాలను తమ పద్ధతిలో నడిపించుకోవాలని వ్యూహం పన్నిన ఆ పార్టీలు అందుకు అనుగుణంగా వ్యవహరించి విజయం సాధించినట్లు భావించవచ్చు. శాసనసభలో తెలంగాణ అంశంపై గొడవ చెలరేగి పార్టీలకు అతీతంగా తమ రెండు పార్టీలు విడిపోవడం ఇష్టం లేని ఆ పార్టీల అగ్ర నేతలు తెరాసను శాసనసభకు దూరం చేయడం ద్వారా ఫలితం సాధించినట్లు చెబుతున్నారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెరాస రాజీనామాలకు సిద్ధపడింది. అందరి కన్నా ముందుండాలనే ఉద్దేశంతో తెరాస శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. వాటిని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించారు. వారితో పాటు రాజీనామాలు చేసిన కాంగ్రెసు సభ్యులు దామోదర్ రెడ్డి, ముత్యం రెడ్డి రాజీనామాలను మాత్రం ఆయన ఆమోదించలేదు. వారిద్దరిని కూడా కాంగ్రెసు అధిష్టానం తన దారికి తెచ్చుకుంది. దీంతో మళ్లీ తెరాస తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏకాకిగానే మిగిలింది. రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలను ఆహ్వానించడం తెరాసకు మామూలు వ్యవహారమని, రాజీనామాల వల్ల తెలంగాణ రాదని కాంగ్రెసు పార్టీ ప్రచారం సాగిస్తుండగా కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాలు చేస్తేనే తాము రాజీనామాలు చేస్తామని తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు తప్పించుకున్నారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. తద్వారా కెసిఆర్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాయి.

జెఎసి కన్వీనర్ కోదండరామ్ పాత్రను తగ్గించడం, కెసిఆర్ ప్రాబల్యం తగ్గించడం, శాసనసభ సమావేశాలను తమకు అనువుగా నడిపించుకోవడం ఆ రెండు పార్టీల ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. అందుకే తెరాస రాజీనామాలు చేసినా ఆ రెండు పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయలేదు. రాజీనామాలు తెరాసకు అలవాటేనని అనిపించి ఉప ఎన్నికల్లో ఆ పార్టీని మరింత బలహీన పరిచే ఎత్తుగడలను కూడా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అనుసరించవచ్చు. ఇప్పటికే తెరాస శాసనసభ్యుల బలం సగానికి సగం పడిపోయింది. ఉప ఎన్నికల్లో మరింతగా బలహీనపరిచి తెలంగాణ నినాదం పెద్గగా లేదని సమైక్యాంధ్రవాదుల చేత అనిపించే ప్రయత్నం కూడా జరగవచ్చు. ఎన్నికలకు, ఉద్యమానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు పొంతన లేదనే విషయాన్ని నిరూపించడంలో తెరాస రాజీనామాల పర్వం ద్వారా విఫలమవుతోందనే అభిప్రాయం కూడా ఉంది.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించడానికి పది నెలల గడువు ఉంది. నివేదిక సిఫార్సులు ఎలా ఉన్నా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల తెలంగాణ నాయకులకు పెద్గగా పట్టకపోవచ్చు. ఈలోగా తెలంగాణ ఉద్యమం చల్లబడుతుందనే అభిప్రాయం కూడా ఆ రెండు పార్టీలకు ఉన్నట్లుంది. లేకపోతే భద్రతా బలగాల ద్వారా, ఇతరేతర రూపాల్లో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఒడిగడుతుందనే విషయంలో రెండో మాట లేదు. అలాగే, తెలంగాణ ఉద్యమకారులను చీల్చే ప్రయత్నాలు కూడా ముమ్మరంగానే సాగవచ్చు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ డిమాండ్ ను తగ్గించడం, తెరాసను బలహీనపరచడం తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు తక్షణావసరంగా పనిచేయవచ్చు. అయితే, తెలంగాణ ఉద్యమం ఇదే రీతిలో కొనసాగితే మాత్రం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలకు గురి కావాల్సి వస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X