• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యాదయ్యకు, తెలంగాణకు బొంద

By దుర్గం రవీందర్
|

Pro-Telangana
సిరిపురం యాదగిరి (యాదయ్య)ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం పెయికి అగ్గి అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో విస్పష్టంగా పేర్కొన్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం పొద్దు పోయాక యాదయ్య చనిపోయాడు. అదే రోజు ఆర్థరాత్రి యాదయ్య మృతదేహాన్ని ఆయన స్వగ్రామం నాగారం తరలించి వారి ఆచారం ప్రకారం బొంద పెట్టారు. తెలంగాణ గ్రామాల్లో పెళ్లి కాని యువతీయువకులు చనిపోతే బొంద పెట్టడం ఆచారం. యాదయ్య సమాధి ఆ ఆచారం ప్రకారమే జరిగిందంటే ఇందులో చర్చించడానికి గాని, ఆశ్చర్యపోవడానికి గాని ప్రత్యేకంగా వ్యాసం రాయడానికి గాని ఏమీ ఉండదు. కాని అలా జరగలేదు. పోలీసులు వారిదైన వ్యూహాత్మక ధోరణిని ప్రదర్శించారు.

యాదయ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను తర్వాత విశ్లేషిద్దాం. ఆత్మహత్యా యత్నం దగ్గర నుంచి ఏం జరిగిందో చూద్దాం. యాదయ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నది యూనివర్శిటీ గేట్ ముందు. వెంటనే 108 వాహనం వచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సమీప ఆసుపత్రికి పేషెంటును తీసుకెళ్తారు. పక్కనే అర కిలోమీటర్ దూరంలో మహిళా సభ ఆసుపత్రి ఉంది. యూనివర్శిటీ అవతలి గేట్ దగ్గర ఆర్టీసి వారి ఆసుపత్రి ఉంది. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఒక వైపు ఉస్మానియా ఆసుపత్రి ఉంది. ఇంకో వైపు గాంధీ ఆసుపత్రి ఉంది. మొదట గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని, ఎక్కడో సాగర్ రింగు రోడ్డు దగ్గర సైదాబాద్ అవతల ఉన్న డిఆర్డీఎల్ అపోలో ఆసుపత్రికి యాదయ్యను ఎందుకు తరలించినట్లు. సాయంత్రం యాదయ్యను చూడడానికి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. అక్కడ ఉన్న తెలంగాణవాదులు కొందరు ఆమెను నిలదీశారు. ఏమిటీ అన్యాయం, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోరా, మీ మంత్రి పదవులే మీకు కావాలా, తెలంగాణ వద్దా అని వారు అడిగారు. దీంతో ఆవిడ కోపంతోనే అక్కడి నుంచి నిష్క్రమించారు. సబితను ప్రశ్నించిన ఫిరోజ్ ఖాన్ అనే కరీంనగర్ విద్యార్థి పోలీసుల చేతిలో పడి సోమవారం సాయంత్రం దాక ఆచూకీ లేకుండా పోయాడు. 20వ తేదీన సాయంత్రం పొద్దుపోయాక యాదయ్య మరణించాడు. యాదయ్య మరణవార్తకు సీమాంధ్ర యాజమాన్యంలోని మీడియా సహజంగానే ప్రాముఖ్యం ఇవ్వలేదు. హిందూ దినపత్రికలో మాత్రం ఆ వార్త ప్రముఖంగా వచ్చింది. సాక్షితో పాటు ఒకటి రెండు పేపర్లలో ఆ వార్తను ప్రచురించారు. ఆంధ్రజ్యోతిలో యాదయ్య మరణవార్త లేనే లేదు. సరే, అది మీడియా ఎప్పుడూ చూపే వివక్షనే. ఆయన స్వయంగా అంటించుకున్నాడా, ఇతరులెవరైనా అంటించారా లాంటి అర్థం లేని మూర్ఖపు ప్రశ్నలు అడిగిన ఒక మీడియా ప్రతినిధిని విద్యార్థులు కొట్టినంత పని చేశారు. ఈ ప్రశ్న వెనక ఎంత కుట్ర దాగి ఉందో, అతను ఏ ప్రాంతంవాడో సులభంగా అర్థం చేసుకోవచ్చు. వైష్ణవి కిడ్నాప్ - మృతిపై స్పందించినట్లుగా యాదయ్య మృతి పట్ల మీడియా స్పందించకపోవడంలోనే వారి వైఖరి తేటతెల్లం అవుతున్నది. అది అలా ఉండగా పోలీసులు ఈ ఘటనలో పరమ దుర్మార్గంగా, అనైతికంగా, చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు.

సాధారణంగా ఒక వ్యక్తి ఎంతగా కాలినా ఆ గాయాలతో 24 గంటల తర్వాతనే మరణిస్తాడు. కాని యాదయ్య 12 గంటలు గడిచీ గడవగానే మరణించాడు. కారణం తెలియదు. ఈ విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. యాదయ్య బతికితే అతను బాగుపడి బయటకు రావడానకి కనీసం రెండు నెలలు అయినా పట్టి ఉండేది. ఈ రెండు నెలలు ఆసుపత్రి ముందు టెంట్లు వేసి దీక్షలు చేసి నానా హడావిడి చేస్తారు. నాయకులు పరామర్శించడానికి వస్తారు. దీంతో మీడియావారి హడావిడి, ఉద్యమకారుల గోల ఉంటుంది. యాదయ్య శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు తరలించినట్లు. మీడియావారికి ఎందుకు ఎరుక పరచనట్లు. సాధారణంగా ఎవరైనా ఇలా కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో గాని జంటనగరాల్లోని ఏ ఆసుపత్రిలోనైనా మరణిస్తే పోస్టుమార్టం చేయడానికి శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా రాత్రికి రాత్రి వైద్యులు అక్కడ రాత్రికి రాత్రి వైద్యులు అక్కడ పోస్టుమార్టం చేయరు. మరి ఇవేవి చేయకుండా యాదయ్యను ఆయన స్వంత ఊరికి ఎలా తరలించారు. పోలీసులకు ఈ ఆలోచన ముందే ఉంది కాబట్టి యాదయ్యను ఆయన స్వగ్రామానికి వెళ్లే దారిలో ఉన్న డిఆర్డిఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లారని అనుకోవాల్సి వస్తుంది. అటు నుంచి అటే శవాన్ని మూడో కంటికి తెలియకుండా తరలించారు. 85 శాతం కాలిన శరీరంతో యాదయ్య ఎలాగు చనిపోయేవాడే అనుకోవడం వేరు. కాని ఈ విషయంపై తెలంగాణవాదులకు తీవ్రమైన అనుమానాలున్నాయి. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కాల్చుకుని చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి శవాన్ని పోలీసులు ఇలానే తరలించుకుపోయారు. విద్యార్థులు వేణు మృతదేహాన్ని గన్ పార్కుకు ముందు తీసుకెళ్తామన్నారు. కాని పోలీలు అడ్డుకుని, విద్యార్థులను తప్పు దోవ పట్టించి శవాన్ని నగరం దాటించారు.

యాదయ్య ఆత్మహత్యకు ఎందుకు ఒడిగట్టాడు. యాదయ్యకు రాజకీయాల పట్ల ఆసక్తి, కొంత అవగాహన ఉంది. కెసిఆర్, సబిత, చంద్రబాబు తదితరులతో యాదయ్య దిగిన ఫొటోలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆ ఫొటోలను, మార్కుల మెమోలను సూసైడ్ నోట్ ఆయన ఆత్మహత్యాస్థలంలో వదిలాడు. తెలంగాణ విషయంలో రాజకీయవాదులు చేసిన, చేస్తున్న మోసాలు యాదయ్యకు అర్థమై ఉంటాయి. మిత్రులందరితో కలిసి చలో అసెంబ్లీ కార్యక్రమానికి వద్దామని ముందు రోజు చెప్పిన యాదయ్య ఆ రోజు ఉదయం ఒక్కడే బయలుదేరి వచ్చాడు. ఆ ముందు రోజు రాత్రి కెసిఆర్ లాంటి నాయకులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం వద్దని విద్యార్థులను నిరుత్సాహపరిచిన సంగతి యాదయ్యకు తెలిసే ఉంటుంది. ఎబివిపి, బిజెపి, కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులందరు ఎవరికి వీలైన రీతిలో వారు మాట్లాడడం వల్ల తీవ్ర నిరుత్సాహానికి, నిరాశకు గురైనందుననే యాదయ్య ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తెలంగాణ రాదనే నిరాశనే యాదయ్యను ఆత్మహత్యయత్నానికి పురికొల్పింది. రాజకీయాలపై అంతో ఇంతో అవగాహన ఉన్న యాదయ్య నిరాశతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్యను, యాదయ్య తరాన్ని చావనిచ్చి, చంపి తెలంగాణను తాత్కాలికంగా ఆపినా ముందు తరం వారు కూడా యాదయ్యలా చస్తారని చెప్పడానికి ఆస్కారం లేదు. యాదయ్య వెనకనే ఉన్న ఈ తరం వారు ఇంకో రకంగా రియాక్ట్ కారని చెప్పడానికి ఎంత మాత్రం వీలు లేదు.

ఇక యాదయ్య గ్రామం సిరిపురానికి వెళ్లేందుకు మూడే దారులున్నాయి. ఇందులో రెండు తారురోడ్లు. ఈ రెండు దారులను పోలీసులు మూసేశారు. ఆబిడ్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వాడే బారికేడ్లతో సిరిపురం రోడ్లను పోలీసులు మూసేశారు. ఈ బారికేడ్లు సిరిపురం ఎలా వెళ్లాయి. ఊరి నిండా పోలీసులు నిండారు. టీ షర్టులు వేసుకున్న 2- - 25 ఏళ్ల వయస్సున్న పోలీసులు, కర్నాటక పోలీసులు, సీమాంధ్ర పోలీసులు ఆ ఊరిని స్వాధీనం చేసుకుని, యాదయ్య బంధువులను అదిలించి, బెదిరించి యాదయ్య శవాన్ని బొంద పెట్టేశారు. ఈ టీషర్టులు వేసుకున్న పోలీసులే అవసరానని బట్టి విద్యార్థుల్లో కలిసి దుండగపు పనులు చేస్తున్నారని విద్యార్థి సంఘాలవారు ఆరోపిస్తున్నారు. మీడిాయ వారిని అందరిని కూడా ఖనన స్థలానికి వెళ్లనివ్వలేదు. వెళ్లిన ఒకరిద్దరు కెమెరాల వారిని అదుపు చేసి బొంద పెట్టే వార్తాదృశ్యాలను అదుపు చేసి ఉంటారు లేదా పోలీసువారికి ఇబ్బంది లేనివిధంగా చిత్రీకరించుకోనిచ్చి ఉంటారు. విమర్శకులకు సమాధానం చెప్పడానికే అన్నట్లు గద్దర్, హరీష్, తీగల కృష్ణారెడ్డి లాంటి ముగ్గురిని పోలీసులు అనుమతించారు. పోలీసులు ఇంత దుర్మార్గం ఎందుకు చేస్తున్నారు. కింది పోలీసులు వారంతట వారుగా ఇలాంటి పనులు చేయరు. వారికి ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నవారెవరు. ఈ ఆదేశాలు ఇస్తున్నవారిని ప్రోత్సహిస్తున్నవారెవరు. పోలీసు అధికారుల్లో తెలంగాణవారు ఏడు శాతం మంది కూడా లేకపోవడం దీనికి.

మొత్తం మీద పోలీసులు ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాదయ్య శవాన్ని బొంద పెట్టేశారు. యాదయ్య శవంతో పాటు తెలంగాణ సమస్యను బొంద పెట్టేశాం అని కించిత్తు గర్వంతో ఊపిరి పీల్చుకుని ఉంటారు. పోలీసు మంత్రి సబిత, ముఖ్యమంత్రి రోశయ్యలు మాత్రం ఈ విషయాన్ని గమనించనట్లే ఉండిపోయారు. ఎప్పటిలాగే పట్టువదలని విక్రమార్కుల వలే ఉస్మానియా విద్యార్థులు మాత్రం ఆ రోజు రాత్రి వెలుగుతున్న క్యాండిల్స్ తో యాదయ్యకు నివాళులు అర్పించారు. బహుశా యాదయ్యది 289వ శవం. మరణం. భేతాళ పోలీసులు ఇంకో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ వ్యక్తి శవాన్ని వెతుక్కుంటూ వెళ్లారు.

శనివారం ఉదయం పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన యాదయ్య ఆ రాత్రికే శవమయ్యాడు. ఆదివారం ఉదయం దాదాపు అదే వేళకు బొంద పెట్టబడ్డాడు. అతి సాధారణ రీతిలో, ఆసాధారణంగా పోలీసు బలగాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. యాదయ్య నక్సలైట్ కాదు కాబట్టి మానవ హక్కుల సంఘాలు యాగిచేయవు. యాదయ్య అగ్రకులం వాడు కాదు కాబట్టి వారి కనుసన్నల్లో మెదిలే మీడియా, ప్రజా సంఘాలు ఏమీ మాట్లావు. యాదయ్య టిఆర్ఎస్ నాయకుడు కాదు కాబట్టి వారూ ఏమీ మాట్లాడలేదు. యాదయ్య పేద శాలోల్ల పిల్లవాడు. ఆయన తాత ముత్తాతలందరూ నాగారం వారే. నేత పనివారే, అందుకే యాదయ్య మరణాన్ని త్యాగాన్ని ఎవరూ కీర్తించలేదు. గానం చేయలేదు. యాదయ్య నాయన చేనేతపని చేసి పేదరికంతో అర్దాయుష్కుడయ్యాడు. హైదరాబాదాులో ఆత్మహత్యాయత్నం చేసి చనిపోయాడు. కాబట్టి యాదయ్య ఈ మాత్రం రాతకైనా నోచుకున్నాడు. ఇలా తెలంగాణలో సరాసరిన రోజుకు ఇద్దరు మరణిస్తున్నారు. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. వారు మీడియాలో సింగిల్ కాలం వార్తకు పరిమితమవుతున్నారు.

యాదయ్య తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నాడు. అతని అంత్యక్రియలు కెసిఆర్, జయశంకర్, కోదండరామ్, దామోదర్ రెడ్డి లాంటి నాయకులు వేసే మొదటి పిడికెడు మట్టితో మొదలుకొని, తెలంగాణ విద్యార్థులందరూ వేసే తలో పిడికెడు మట్టితో జరగాలని. అలా వేసిన మట్టి గుట్టగా ఏర్పడాలని. అది జహంగీర్ పీర్ దర్గాలాగా తెలంగాణవారందరికీ పుణ్యక్షేత్రం కావాలి. పాపం యాదయ్య అనామకంగా ముగిసిపోయాడు. కొండంత త్యాగానికి బదులుగా పిడికెడు మట్టిని, పిసిరంత గౌరవానికి కూడా నోచుకోలేదు. తప్పు చేసిన పౌరుడిలా పోలీసుల పహారాలో ఖననం అయ్యాడు. యాదయ్యా, క్షమించు, నీ త్యాగానికి, ధైర్యానికి తగిన చావును నీకు చేయలేకపోయాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X