కిరణ్ ది రాజకీయ చాణక్యమా?

Kiran Kumar Reddy
మంత్రులకు శాఖల కేటాయింపు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి తలనొప్పిని తెచ్చి పెట్టింది. తమకు కేటాయించిన శాఖలపై దాదాపు పది మంది సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించేదాకా వెళ్లారు. ఇదంతా కిరణ్ కుమార్ రెడ్డి అనుభవరాహిత్యం వల్లనే జరిగిందనే మీడియా వ్యాఖ్యానిస్తోంది. నిజంగా అనుభవరాహిత్యం వల్లనే ఇదంతా జరిగిందా, కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారా అనేది ప్రశ్నార్థంగా మారింది. శాఖల కేటాయింపు విషయంలో కావాలనే కిరణ్ కుమార్ రెడ్డి ఆ రకంగా వ్యవహరించారని చెప్పవచ్చు. సీనియర్లను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకే ఆ విధంగా వ్యవహరించారని అంటున్నారు. తన మిత్రుడు కెఆర్ సురేష్ రెడ్డి, నల్లగొండ జిల్లా శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చించి సీనియర్లకు ప్రాధాన్యం లేని శాఖలను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అసమ్మతి పెల్లుబుకుతుందనే విషయం ఆయనకు తెలుసునని అంటున్నారు. ఈ అసమ్మతితోనే వారు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్తే తదుపరి పదవులపై గొడవ చేయడానికి గానీ అధిష్టానం వద్దకు వెళ్లడానికి గానీ వీలు కాదనే ఉద్దేశంతో ఆయన ఆ పని చేసినట్లు చెబుతున్నారు.

ఇంకా పిసిసి అధ్యక్ష పదవితో పాటు శాసనసభ స్పీకర్, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవులు పెండింగులో ఉన్నాయి. ఈ మూడు ముఖ్యమైన పదవుల భర్తీ తనకు అనుకూలంగా చేసుకోవాలనే ఉద్దేశం కిరణ్ కుమార్ రెడ్డి ఉండడం వల్లనే శాఖల వద్దనే ఆయన కొలికి పెట్టినట్లు చెబుతున్నారు. సీనియర్లు తమ తమ జిల్లాల్లో స్థానిక సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. తమ తమ జిల్లాల్లో తమ కుటుంబ సభ్యులు, బంధువులు రాజ్యమేలే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. వైయస్ జగన్ మాదిరిగానే ఏదో ఒక సమయంలో జిల్లా రాజకీయాలకే కాదు, రాష్ట్ర రాజకీయాలకు కూడా వచ్చే సరికి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతారనే అభిప్రాయం అధిష్టానానికి కూడా ఉందని చెబుతారు. ఈ భవిష్యత్తు ప్రమాదాన్ని పసిగట్టి ఇప్పుడే వారి తోక కత్తిరించాలని, పార్టీ అధిష్టానం మాట వినాల్సిందేనని, రాష్ట్ర నాయకుడి స్థానాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదని భావించి చక్రం తిప్పినట్లు భావిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుటుంబానిదే హవా. వరంగల్ జిల్లాలో పొన్నాల లక్ష్మయ్య ఆధిపత్యం సాధిస్తున్నారు. బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి పదవిని కూడా ఆశించారు. అయితే, ఆ పదవిని రెడ్డి వర్గానికి ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ చాన్స్ వారికి దక్కలేదు. పిసిసి అధ్యక్ష పదివికి, డిప్యూటీ సిఎం పదవికి కూడా వారు పోటీ పడుతున్నారు. పిసిసి పదవి ఇస్తే తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని బొత్స సత్యనారాయణ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. జె. గీతారెడ్డికి దక్కుతుందని భావించిన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి దామోదర రాజనర్సింహను వరించే పరిస్థితి వచ్చింది. ఈ పదవిని తెలంగాణవారికే ఇస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. ఈ స్థితిలో పిసిసి అధ్యక్ష పదవి, స్పీకర్ పదవి తనకు నచ్చిన వారికి దక్కేలా చూసుకోవడానికే కిరణ్ కుమార్ రెడ్డి శాఖల కేటాయింపులో వివాదాన్ని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. స్పీకర్ పదవిని తెలంగాణకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పించుకుంటే ఉప ముఖ్యమంత్రి పదవిని పెండింగులో పెట్టడానికి వీలవుతందనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. పిసిసి పదవి ఎలాగూ కోస్తాంధ్రకు దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. అవసరమైతే పిసిసి అధ్యక్ష పదవిని కూడా పెండింగులో పెట్టించే ఆలోచన ఆయన చేస్తున్నట్లు సమాచారం. గురువారం రాత్రి పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కిరణ్ కుమార్ రెడ్డిని కలవడం ఇందులో భాగమేనని అంటున్నారు. శుక్రవారం సాయంత్రం డి. శ్రీనివాస్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ పెద్దలతో కిరణ్ కుమార్ మంత్రాంగాన్ని అమలులో పెట్టించడానికి ప్రయత్నించవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+