రోజా స్థానంలో జయప్రద?

పార్టీలో చేరడానికి తగిన విధంగా జయప్రద వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, క్రమశిక్షణతో కూడిన పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని ఆమె హామీ ఇస్తున్నారట. జయప్రదను పార్టీలో చేర్చుకునే విషయంపై శాసనసభ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు వినికిడి. అయితే, జయప్రదకు ఇప్పటికిప్పుడు ఏదో పార్టీలో ఉండడం అంత అవసరమేమీ కాదు. ఆమె పదవీ కాలం పూర్తయ్యేనాటికి ఆ అవసరం ఏర్పడుతుంది. అందుకు ఇంకా దాదాపు నాలుగేళ్ల దాకా వ్యవధి ఉంది. అయితే ఇప్పుడే తెలుగుదేశంలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల నాటికి తిరిగి పోటీ చేయడానికి వీలవుతుందనేది ఆమె అభిప్రాయంగా చెబుతున్నారు.
కాగా, మరికొంత మంది పార్టీ మాజీలు కూడా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు, అందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ ఈ నెల 6వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ కూడా పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే, ఊహించిన ఊపు ప్రజారాజ్యం పార్టీకి రాకపోవడం ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ స్థితిలో ఆయన సైకిలెక్కడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications