• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్ ఆఫ్టర్ డిసెంబర్ ఫీవర్

By Pratap
|
K Chandrasekhar Rao
డిసెంబర్ తర్వాతి ఆందోళనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్ని శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఆయన కొద్ది కొద్దిగా రుచి చూపిస్తున్నట్లు భావిస్తున్నారు. ఒక వేళ శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనుకూలంగా వచ్చి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయాన్ని ప్రకటించకపోయినా పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన చెప్పదలుచుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక సమర్పిస్తుందనే నమ్మకం తెలంగాణవాదుల్లో లేదు. తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు చెబుతున్నా మిగతావారెవరూ దాన్ని నమ్మడం లేదు. డిసెంబర్ 9వ తేదీ చిదంబరం ప్రకటనను అడ్డుకున్నట్లుగానే మళ్లీ కేంద్రం ప్రకటన వెలువరించినా మళ్లీ సీమాంధ్ర నాయకులు అడ్డుకోరనే గ్యారంటీ ఏమీ లేదు. ఏ విధంగా చూసినా డిసెంబర్ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మునుపటి కన్నా ముమ్మరంగా ముందుకు నడిపించాల్సి ఉంటుందనేది కెసిఆర్ ఉద్దేశం. అందుకే ఆయన పార్టీ శ్రేణులనే కాకుండా కోదండరాం నాయకత్వంలోని ప్రజా సంఘాల జెఎసిలను కూడా ఆయన క్రియాశీలం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి అంశాన్ని వివాదం చేయడానికి తెలంగాణవాదులు పూనుకుంటున్నారని అనుకోవాలి.

గతంలో ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీమాంధ్రులు ప్రశ్న పత్రాలను దిద్దడాన్ని తీవ్ర వివాదంగా మార్చారు. ఒక రకంగా ప్రభుత్వం ఈ రెండు విషయాల్లోనూ ఇరకాటంలో పడింది. కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిర్వహించిన బతుకమ్మ జాతర కూడా తెలంగాణ ఉద్యమానికి చేవను ఇచ్చింది. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ జాతర నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై విగ్రహాల అంశంపై దుమారం రేపింది. స్వయంగా కెసిఆర్ కుమారుడు కెటి రామారావు ఈ వివాదానికి తెర తీశారు. ఈ వివాదం కారణంగా ట్యాంక్ బండ్ పై నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కొమురం భీమ్ విగ్రహాన్ని పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు నవంబర్ 1 రాష్ట్రావతరణ దినోత్సవాన్ని వివాదంగా మార్చింది. ఈ ఉత్సవాల్లో తెలంగాణ మంత్రులు పాల్గొనకూడదని తెరాసతో పాటు తెలంగాణ జెఎసిలు హెచ్చరిస్తున్నాయి.

తెలంగాణకు చెందిన ప్రతి వివాదంలోనూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తెరాస వాదాన్ని సమర్థించాల్సిన పరిస్థితిలో పడ్డారు. అలా సమర్థించకపోతే తెలంగాణలో పార్టీ నష్టపోతుందనే ఆందోళనలో పడ్డారు. దీంతో తెరాస నాయకుల కన్నా దూకుడుగా వ్యవహరించేందుకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు సిద్దపడ్డారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు కూడా ఈ వివాదాలన్నింటిలో తెరాస వైఖరిని సమర్థించాల్సిన పరిస్థితిలో పడ్డారు. తెరాసను, ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ను దుమ్మెత్తిపోస్తున్న అంశాలపై ఆ వైఖరిని సమర్థించక తప్పడం లేదు. దీనికి తోడు, కెసిఆర్ నెలకొల్పిన రాజ్ న్యూస్ టీవీ చానెల్ అన్ని విషయాల్లో తెలంగాణ కోణాన్ని సమగ్రంగా ప్రదర్శిస్తూ వస్తోంది. తెలంగాణ శ్రేణులకు తగిన ప్రచారాన్ని కల్పిస్తూ కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. డిసెంబర్ తర్వాత ఆందోళనకు ఇప్పటి నుంచే కెసిఆర్ సమాయత్తమవుతున్నారని ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X