వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ప్రత్యర్థులెవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమ పార్టీని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పదే పదే విమర్శిస్తున్నారు. కాంగ్రెసు పట్ల మాత్రం మెతగ్గా వ్యవహరిస్తున్నారని ఆయన అంటున్నారు. ఈ స్థితిలో కెసిఆర్ నిజమైన ప్రత్యర్థులెవరనే ప్రశ్న ఉదయిస్తుంది. తెలంగాణకు ఏ మాత్రం అనుకూలంగా లేని పార్టీలను టార్గెట్ చేసుకోవడం, కాంగ్రెసు పార్టీని అనుకూలంగా మలుచుకుంటూ రావడం కెసిఆర్ ఎత్తుగడలో భాగమని చెప్పవచ్చు. ఇలా చూసినప్పుడు సీమాంధ్రకు చెందిన రాష్ట్ర నాయకులు ఆయనకు టార్గెట్ గా మారడంలో ఆశ్చర్యం లేదు. అలా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానమైన ప్రత్యర్థి అవుతారు. పైగా, ఇప్పటి వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ బలం చూసుకునే చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును బయట పెట్టి ఆ క్యాడర్ ను తనవైపు లాక్కోవడం కెసిఆర్ ప్రధానమైన లక్ష్యం కావడాన్ని కాదనలేం.

తెలంగాణపై బయటకు ఏం చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు ఏం మాట్లాడినా చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారనేది స్పష్టంగా తెలిసిపోతూనే ఉన్నది. ఆయన వ్యవహారశైలి అందుకు అనుగుణంగానే ఉంది. అందువల్ల తెలంగాణపై చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ స్థితిలో తెలుగుదేశం పునాదులను తెలంగాణలో కదిలించడానికి కెసిఆర్ పూనుకున్నారు. పలువురు తెలుగుదేశం నాయకులే కాకుండా కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు తెరాసలో చేరుతున్నారు. దాన్ని కెసిఆర్ ప్రోత్సహిస్తున్నారు. ఏ పార్టీ అయినా చేసే పని అదే.

కాగా, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కూడా కెసిఆర్ కు ప్రధాన ప్రత్యర్థే. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగినప్పుడే వైయస్ జగన్ ముఖం ఏమిటో తెలిసిపోయింది. దాని వల్లనే ఆయన మహబూబ్ నగర్ ఓదార్పు యాత్రను అడ్డుకున్నారు. దానివల్లనే వైయస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను తెరాస నాయకులు తవ్వి తీస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో పెద్ద యెత్తున ఆరోపణలకు దిగడానికి కూడా ఇదే కారణం. రాయలసీమకు మేలు చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తూ వైయస్ తీసుకున్న నిర్ణయాలపై కెసిఆర్ తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. వైయస్ ప్రభుత్వ హయాంలో పోతిరెడ్డి పాడు వంటి ప్రాజెక్టుల విషయంలో అనుసరించిన వైఖరిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

ఇక చిరంజీవి విషయానికి వస్తే, సమైక్యాంధ్ర నినాదాన్ని అందుకుని ఆయన సీమాంధ్రకు మాత్రమే పరిమితమయ్యారు. దానితో ప్రజారాజ్యం పార్టీ పునాదులు తెలంగాణలో బీటలు వారాయి. మెగాస్టార్ గా చిరంజీవిని అభిమానించడం వేరు, ప్రజారాజ్యం పార్టీ నేతగా రాజకీయంగా వ్యతిరేకించడం వేరు అనే దృక్పథాన్ని స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్నందున ఆయనపై దాడి కూడా తక్కువగానే ఉంటుంది.

పోతే, కాంగ్రెసులోని తెలంగాణ నాయకులపై ఒత్తిడి తేవడం కెసిఆర్ వ్యూహంగా ఉంటుంది. కాంగ్రెసు తెలంగాణ నాయకులు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ అధిష్టానం మీద తేవాల్సినంత ఒత్తిడి తేవడం లేదని, సీమాంధ్ర నాయకుల ఆధిపత్యం కాంగ్రెసులో కొనసాగుతోందని భావిస్తూ కాంగ్రెసును తెలంగాణకు అనుకూలంగా మలుచుకు రావడం కెసిఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే చంద్రబాబుపై దాడి ఎక్కువగానూ కాంగ్రెసు మీద తక్కువగానూ కెసిఆర్ పెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X