• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇరకాటంలో కెవిపి

By Pratap
|

KVP Ramachandar Rao
రాష్ట్ర ప్రజా భద్రతా సలహాదారు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ఇరకాటంలో పడ్డారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో, పార్టీ అధిష్టానంపై ధిక్కారం విషయంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి కెవిపి ప్రియమిత్రుడు. ఆయనపై ప్రేమతో జగన్ కు అండదండలు అందిస్తూ వస్తున్నారు. వైయస్ మరణించిన మరుక్షణం నుంచి జగన్ వర్గీయులు అనుసరిస్తున్న విధానాలు ఆయనకు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని వారి డిమాండ్, ముఖ్యమంత్రి పదవి కావాలని నోటి మాటగా అనకపోయినప్పటికీ జగన్ ఆ పదవి ఆశిస్తూ చేస్తున్న కార్యక్రమాలు కెవిపిని ఇరకాటంలో పడేస్తున్నాయని అంటున్నారు. పార్టీ అధిష్టానానికి సర్ది చెప్పలేక ఆయన ఇబ్బంది పడుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. కెవిపి మంత్రాంగం లేకపోతే జగన్ పై ఇది వరకే కాంగ్రెసు అధిష్టానం తీవ్రమైన చర్యలు తీసుకుని ఉండేదని కూడా అంటున్నారు. జగన్ తీరును సరి చేసే బాధ్యతను అధిష్టానం తొలుత అధిష్టానం కెవిపికి అప్పగించిందని, అయితే కెవిపి వల్ల సాధ్యం కాదని తెలుసుకుని తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.

దానికితోడు, రాష్టంలో సంభవిస్తున్న పలు పరిణామాలు, ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలు కూడా కెవిపి రామచందర్ రావుకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ప్రతిపక్షాలకు, ప్రజలకు పలు సంఘటనలు ముఖ్యమంత్రి రోశయ్య వైఫల్యంగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులు వాటికి రామచందర్ రావు బాధ్యత వహించాల్సి రావచ్చుననే మాట వినిపిస్తోంది. హైదరాబాద్ అల్లర్లు మొదలు ఇటీవలి సోంపేట ఘటన వరకు శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలు కెవిపి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రధానమైన ప్రజా భద్రతా సలహాదారు పదవిని ఆయన కట్టబెట్టారు. దీంతో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాంతిభద్రతల విషయంలో నామమాత్రంగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. శాంతిభద్రతల విషయాలను వైయస్ రాజశేఖర రెడ్డి, కెవిపి రామచందర్ రావు చూసుకుంటూ వచ్చారు. అయితే వైయస్ మరణించిన తర్వాత కూడా కెవిపి ప్రజా భద్రతా సలహాదారుగా కొనసాగుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు నిరాహార దీక్ష పరిణామాలు, హైదరాబాద్ అల్లర్లు, జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర వల్ల జరిగిన మహబూబాబాద్ కాల్పులు, సోంపేటలో పోలీసు కాల్పులు, ఇప్పుడు చంద్రబాబు బాబ్లీ యాత్ర వల్ల తలెత్తిన సమస్య వంటివి కెవిపికి భవిష్యత్తులో కష్టాలను తెచ్చి పెట్టవచ్చు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి రోశయ్యకు సన్నిహితంగా మెలుగుతున్న కెవిపి రామచందర్ రావుపై అధికార పక్షం నుంచి ఏ విధమైన విమర్శలు రావడం లేదు. వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితురాలు కావడంతో సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ విషయంలో విమర్శలను తానే మోస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం పలు మార్లు కెవిపిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసింది. జగన్ ఓదార్పు యాత్ర పరిణామాలు కూడా ఆయనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

వైయస్ జగన్ పార్టీ అధిష్టానంపై ధిక్కారం పెంచి, మరింత దూకుడుగా ముందుకు సాగితే కెవిపి మరింత గడ్డు సమస్యను ఎదుర్కునే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం మాట వింటూ కాంగ్రెసులో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్న కెవిపి సలహాను జగన్ వినడం లేదని అంటున్నారు. అయినా వైయస్ పై ప్రేమతో జగన్ ను ఎప్పటికప్పుడు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు చేయి దాటి పోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు కెవిపి తన మార్గమేదో ఎన్నుకోవాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X