గద్దర్ ఎంట్రీ సీమాంధ్రకు వరం?

కెసిఆర్ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతున్న కొద్దీ సీమాంధ్ర నాయకులకు, సీమాంధ్ర నాయకుల ఆధిపత్యంలోని పార్టీలకు ఊపిరి ఆడడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన సంక్షోభంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఉనికికి తెలంగాణలో ప్రమాదం ఏర్పడింది. గద్దర్ రాకతో తెలుగుదేశం పార్టీ మళ్లీ ఉనికిని చాటుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు. అందుకే, తెలుగుదేశం తెలంగాణ నాయకులు కూడా గద్దర్ ఫ్రంట్ ను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ కూడా వ్యూహాత్మకంగానే గద్దర్ ఫ్రంట్ కు స్వాగతం చెబుతోంది. కెసిఆర్ చేతుల్లోంచి తెలంగాణ ఉద్యమం జారిపోవాలనేది ఈ రెండు పార్టీల అభిమతంగా కనిపిస్తోంది. అందువల్లనే ఆ పార్టీలు గద్దర్ కు స్వాగతం చెబుతున్నాయని అంటున్నారు.
గద్దర్ ను అహ్వానించడానికి సీమాంధ్ర ఆధిపత్యంలోని మీడియా గమ్మత్తయిన వాదనలను ముందుకు తెస్తోంది. గద్దర్ వల్ల సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడుతుందని మీడియా వ్యాఖ్యానిస్తోంది. కెసిఆర్ విద్వేషాన్ని రెచ్చగొట్టారని, సీమాంధ్ర నాయకులపై అసభ్య పదజాలాన్ని వాడారని, ఈ విద్వేషపూరిత వాతావరణం తొలగడానికి గద్దర్ ఫ్రంట్ ఉపయోగపడుతుందని వాదిస్తోంది. ఇందులో ఉచితానుచితాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ, ఏదో మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దెబ్బ తగలడం ఖాయమని భావిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందే లోగా గద్దర్ రాజకీయ ప్రజా ఫ్రంట్ దుమారం రేపాలని, కెసిఆర్ నుంచి ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఆ స్థితిలో సీమాంధ్రకు ప్రస్తుత తెలంగా రాజకీయ వాతావరణం వరంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications