వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంపీల వెనక సోనియా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల పోరాటం వెనక పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిరవధిక దీక్ష చేపట్టాలనే తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా ఆశ్చర్యకరమే. పార్టీ అధిష్టానానికి చేతావాతా కట్టుబడి ఉండే తెలంగాణ ప్రాంత నాయకులు వ్యూహాత్మకంగానే ముందుకు వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు, మూడు రకాలుగా ఆలోచించి అధిష్టానం తెలంగాణ ప్రాంత నాయకులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టడానికి సిద్ధపడిన వైయస్ జగన్ తెలంగాణలో ప్రవేశించకుండా చేయడానికి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దూకుడుకు కళ్లెం వేయడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తమ ప్రభుత్వంపైనే పోరాటానికి దిగేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.

తెలంగాణకు అనుకూలంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంపై ధ్వజమెత్తుతూ వైయస్ జగన్ తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టే అవకాశం ఉంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఆయన తెలంగాణలో అడుగు పెట్టవచ్చుననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఆదివారం జరిగిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ అంశం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే, ఆందోళనలకు దిగకపోతే వైయస్ జగన్ తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించి కాంగ్రెసుపై దుమ్మెత్తి పోసే అవకాశం ఉందని టి. జీవన్ రెడ్డి వంటి కాంగ్రెసు తెలంగాణ నేతలు అన్నారు. అందువల్ల వైయస్ జగన్ కన్నా ముందే తెలంగాణపై క్రియాశీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో సోనియా సూచన మేరకు వారు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

కాగా, శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే గడువు సమీపించింది. ఆ నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తే సీమాంధ్ర నాయకులు గొడవ చేసే ప్రమాదం ఉంది. అనుకూలంగా రాకపోతే తెలంగాణలో ప్రజలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయి. ఈ రెండు కారణాల రీత్యా కూడా ముందే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తమ కార్యాచరణకు పదును పెట్టినట్లు భావిస్తున్నారు. తెలంగాణ నాయకుల తీవ్రతను చూపి తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పడానికి కాంగ్రెసు అధిష్టానానికి వీలవుతుంది. అంత తీవ్రంగా తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్పాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండులోని సామంజస్యం ఏమిటో అధిష్టానం వారికి వివరించడానికి వీలవుతుంది.

ఇకపోతే, కెసిఆర్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బ తిన్నది. అది కోలుకోలేని స్థితిలో పడింది. ఇప్పుడు కెసిఆర్ కాంగ్రెసును టార్గెట్ చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు. ఆయన ప్రదాన పోరాటం కాంగ్రెసుపైన కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఈ విమర్శల వల్ల తాము ప్రజల్లో పలుచనయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు గ్రహించారు. దీంతో ప్రజల్లో తమ పలుకుబడిని పెంచుకోవడానికి, కెసిఆర్ కు దీటుగా నిలబడుతామని చెప్పడానికి కాంగ్రెసు వారు సిద్ధపడి నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులకు అధిష్టానం నుంచి, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి మద్దతు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు అధిష్టానానికి చాలా దగ్గరయ్యారు. అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడానికి వీలైన కార్యక్రమాన్ని ఇచ్చే నాయకుడు ఆయనే. ఆయన మాటలు కూడా అధిష్టానం భవిష్యత్తు వ్యూహాన్ని పట్టిస్తాయి. ప్రస్తుత ఆందోళనకు కేశవరావు నాయకత్వం వహిస్తున్నారు. అందువల్ల కూడా కాంగ్రెసు ఎంపీల పోరాటానికి పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని భావించాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X