జగన్ వెంట మిగిలేదెవరు?

శుక్రవారం జగన్ ను కలిసినవారిలో ఎపిఐఐసి మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, శాసనసభ్యురాలు కొండా సురేఖ, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ముఖ్యమైన వారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జగన్ తో భేటీ అయ్యారు. వచ్చే నెల 3వ తేదీన జగన్ ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లాలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఆయనకు మొదట వీర అనుచరుడిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర జరుగుతుందనే సమాచారం తనకు లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకే చిరంజీవి మద్దతు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. జగన్ ను పార్టీ నుంచి పంపే కుట్ర జరుగుతోందని విమర్సలను ఆయన ఖండించారు. దీన్ని బట్టి ఇటీవల నెల్లూరు పర్యటనలో ఆనం వివేకానంద రెడ్డికి చిరంజీవికి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని పసిగట్ట వచ్చు. ఆ రకంగా చిరంజీవి కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతూ జగన్ దూరమవుతున్నారని అనుకోవాలి.
ఆనం వివేకానంద రెడ్డి లాగానే పలువురు శాసనసభ్యులు కూడా జగన్ కు దూరం కావచ్చు. శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వంటి కొంత మంది జూనియర్ శాసనసభ్యులు మాత్రమే జగన్ వెంట ఉంటారనే ప్రచారం సాగుతోంది. పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి కూడా జగన్ కు మద్దతిస్తున్నారు. అయితే డ్రామా క్లైమాక్స్ కు చేరే సరికి ఆమె కూడా ఉంటారో, ఉండరో తెలియదు. జగన్ కు మద్దతుగా నిలుస్తున్న సబ్బం హరి వైఖరి అర్థం కాకుండా ఉంది. రాష్టానికి చెందిన మిగతా పార్లమెంటు సభ్యులంతా జగన్ కు దూరంగానే ఉంటున్నట్లు సమాచారం. తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒక్కరు కూడా ఆయన వెంట ఉండే అవకాశం లేదు. మొదట ఉన్న జగన్ కు ఉన్న హైప్ ఇప్పుడు లేదు. బహుశా, జగన్ తనకు ప్రజా బలం ఉందని భావిస్తూ ఉండవచ్చు. ఏమైనా, ఆయన భవిష్యత్తును తిరుపతి సభనే నిర్ణయిస్తుంది.