జగన్ కు బాబాయ్ దెబ్బ

YS Jagan
రాజకీయంగా ఇంత ఉన్నత స్థితికి ఎదగడానికి తోడ్పడ్డ పార్టీని వదిలేసి కొత్త పార్టీ పెడుతున్న కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్తో వెళ్లకుండా కాంగ్రెస్ లోనే కొనసాగడానికి వ్యవసాయ శాఖమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నిర్ణయించుకున్నారు. క్రిస్మస్ రోజుకు ముందు వారిద్ధరి మధ్య కెవిపి రామచంద్రారావు సయోధ్య కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అదంతా వట్టిదేనని కాంగ్రెస్ నేతలు అన్నారు. అయినప్పటికీ శనివారం పులివెందులలో వైఎస్ వివేకా బహిరంగ ప్రకటనతో అందరి ఊహలు పటాపంచలైపోయాయి.

శుక్రవారం, శనివారాల్లో పలు దఫాలుగా వివేకానందరెడ్డితో జగన్ చర్చలు జరిపారు. పులివెందులలో జగన్ మామ ఈసీ గంగిరెడ్డి ఇంట్లో జగన్, వివేకాలతో కుటుంబ సభ్యులు శనివారం పలుమార్లు చర్చలు జరిపారు. వైఎస్ కుటుంబం అంటే రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉందని, ఇప్పుడు మీరిరువురు చెరోదారిన వెళితే ప్రజల్లో అపార్థాలు నెలకొంటాయని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో జగన్ మామ గంగిరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డిలు కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకల్లో కూడా జగన్, వివేకా పక్కపక్కనే కూర్చున్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ క్రమంలో వారిరువురి మధ్య కలతలు చెరిగిపోయాయని అందరూ అనుకున్నారు.

అయితే అందరి ఊహలను తారుమారు చేస్తూ వివేకానందరెడ్డి రెడ్డి సాయంత్రం కడప ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం పెట్టి తాను కాంగ్రెస్ లోనే ఉంటానని తెల్చి చెప్పారు. గత కొన్నాళ్లుగా వైఎస్‌కి చెందిన తోటలో క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నట్లుగానే ఈ ఏడాది చేసుకున్నామని చెప్పారు. అయితే బంధువులు సయోధ్యకు యత్నాలు చేశారని కానీ సోనియాతో, కాంగ్రెస్‌తో ఉన్నఅనుబంధం రీత్యా పార్టీలోనే ఉంటానని చెప్పారు. క్రిస్మస్ వేడుకల్లో జగన్ ను తాను కలవడంపై మీడియాలో ఊహా కథనాలు ప్రసారం కావటంతో కార్యకర్తలు ఎలాంటి అయోమయానికి గురి కాకుండా తాను ఈ విషయాన్ని విలేకరుల ప్రతినిధుల ముందు చెబుతున్నానని వివరించారు.

సెంటిమెంట్ వేరు కమిట్ మెంట్ వేరు అని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పులివెందులలో ఈ నెల 30న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు, జిల్లాకు చెందిన మరో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో వివేకా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారిద్దరూ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అధిష్ఠానం నిర్ణయాల గురించి చర్చించుకున్నారని సమాచారం.

జగన్, వివేకాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు గంగిరెడ్డి మధ్యవర్తిత్వం చేసేందుకు కారణం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య వచ్చిన ఈ విభజన వల్ల నష్టం ఎవరికి అనే విషయమై విశ్లేషణ చేసుకున్న జగన్ వర్గం చివరకు నష్టపోయేది తామేనని భావించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాలు ఎలా ఉన్నా, బాబాయ్, అబ్బాయ్‌లు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగరాదని గంగిరెడ్డి ప్రతిపాదించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+