మరోసారి ఆజాద్ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వల్ల పరిష్కారం లభించనందు వల్లనే మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయించామని, మూడు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పుడే సమస్య పరిష్కారమవుతుందని గత మాటలనే మరోసారి మరో రూపంలో ఆయన బయటపెట్టారు. దీన్నిబట్టి తెలంగాణ నాయకులను బుజ్జగించడం లేదా వారిపై చర్యలు తీసుకోవడం అనే అంశాలపైనే పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశం మళ్లీ మొదటికి వచ్చిందని ఆయన బీజింగ్‌లో గతంలో అన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలని, శాసనసభ ఏకగ్రీవ తీర్మానం కావాలని ఆయన అన్నారు. దీంతో పార్టీ తెలంగాణ నాయకులు తీవ్రంగా తీసుకున్నారు.
బీజింగ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు ఆజాద్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని తెలంగాణ నాయకులు మొండికేశారు. దీంతో ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటూ వివరణ ఇచ్చారు. ఈ వివరణతో తెలంగాణ నేతలు మెత్తబడి చర్చలకు అంగీకరించారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఏదో ఒక రోజు చర్చలకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ నేతలపై తాజా వ్యాఖ్య గుదిబండలా పడింది. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్ప మరోదానిపై చర్చలకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ నేతలు చెబుతున్నారు. కానీ, పార్టీ అధిష్టానం పెద్దల్లో తెలంగాణ నేతలపై మరో అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. వెనక్కి తగ్గడానికి కొంత మంది నాయకులు మాత్రమే మొండికేస్తున్నారని, చాలా మంది వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే చర్చల ప్రక్రియ పేరుతో వారిని వెనక్కి లాగాలని చూస్తున్నట్లు భావిస్తున్నారు.