'జెఏసి నుండి బయటపడితేనే మంచిది?'

Kishan Reddy-Kodandaram
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తీరుతో భారతీయ జనతా పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. జెఏసిలో తమ మాటకు విలువ లేక పోవడం ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటే చెల్లుబాటు కావడంతో ప్రత్యేక రాష్ట్రం కోసం జెఏసి నుండి బయటకు వెళ్లి సొంత ఉద్యమం చేయాలన్న భావనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలోని ఆ పార్టీ క్యాడర్‌ నుండి ఈ దిశలో తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జేఏసీ నుంచి ఎంత తొందరగా బయట పడితే పార్టీకి అంత మేలన్న వాదనలు బలం పుంజుకుంటున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కేడర్‌ను పెట్టుకుని.. జేఏసీ పంచన చేరి ప్రాభవాన్ని కోల్పోవడమేమిటంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మసకబారేలా టీఆర్ఎస్ చేస్తోందని, అలాంటప్పుడు జేఏసీలో ఉండడమెందుకని కొంతమంది నేతలు తీవ్రంగా వాదిస్తున్నారు. జేఏసీతో పలుమార్లు అవమానకర పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తోందని, అయినా దానితో అంటకాగడమెందుకని నిలదీస్తున్నారు.

అలిగిన ప్రతిసారీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ బీజేపీ కార్యాలయానికి రావడం, ఏవో నాలుగు మాటలు చెప్పి సర్దిపుచ్చడంతో సరిపోతోందని భగ్గు మంటున్నారు. ఆ తర్వాత, పొలోమంటూ మళ్లీ జేఏసీతో వెళ్లడం... పార్టీకి దీనస్థితి తీసుకురావడం అవసరమా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. సొంతంగా ఉద్యమించడం ద్వారా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేద్దామని సూచిస్తున్నారు. వాస్తవానికి, ఆవిర్భవించిన తొలినాళ్లలో తెలంగాణ జేఏసీలో కాంగ్రెస్, టీడీపీ సహా జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా భాగస్వామిగా చేరింది. కానీ, జేఏసీతో పొసగక కొన్నాళ్లకే కాంగ్రెస్, టీడీపీ బయటకు వచ్చాయి. బీజేపీ మాత్రం మొదటి నుంచీ జేఏసీతోనే ఉంటోంది. కానీ, ఇటీవల కొన్ని ఘటనల నేపథ్యంలో బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది. అన్ని అంశాల్లోనూ జేఏసీ చెప్పినట్లు తలాడిస్తే పార్టీ ఇమేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని నేతలు అభిప్రాయపడుతున్నారు.

పైగా స్టీరింగ్ కమిటీ సమావేశాల్లో టీఆర్ఎస్ పెద్దన్న పాత్ర పోషిస్తోందని, తమ పార్టీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోదండరామ్ కూడా టీఆర్ఎస్‌కు ఇచ్చినంత ప్రాధాన్యం తమ పార్టీకి ఇవ్వడం లేదని కినుక వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవేళ కాంగ్రెస్ ఇవ్వాలని అనుకున్నా బీజేపీ మద్దతు తప్పనిసరి అని, ఈ విషయం తెలిసినా తమ పార్టీని రెండో శ్రేణి సభ్యుడిగా చూడడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి మూడు ఉదాహరణలను బీజేపీ నేతలు ఎత్తి చూపుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సావధాన తీర్మానంపై సుష్మా స్వరాజ్ మాట్లాడతారని, అందుకు జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపును వాయిదా వేయాలని కోరితే జేఏసీ పెద్దగా స్పందించలేదని గుర్తు చేస్తున్నారు. చివరకు కోదండరామ్ బీజేపీ కార్యాలయానికి వచ్చి శాంతపర్చారని ఉటంకిస్తున్నారు. ఇటీవల జేఏసీ నేతలను కేసీఆర్ ఢిల్లీకి తీసుకెళ్లిన సందర్భంలోనూ బీజేపీని పెద్దగా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.

ఢిల్లీలో ఉన్న తమ పార్టీ నేతలు విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయలను కలుపుకొన్నా.. సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికే సమాచారం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలోనూ మళ్లీ కోదండరామ్ బీజేపీ కార్యాలయానికి రావడం, క్షమాపణ చెప్పడం ఎప్పటి తంతుగా గడిచిపోయిందని గుర్తు చేస్తున్నారు. అద్వానీ రథ యాత్ర విషయంలోనూ తమ వాదనను జేఏసీ వినిపించుకోలేదని, కేవలం కేసీఆర్ చెప్పినట్లే నడుచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18, 19 తేదీల్లో రథ యాత్ర సాగుతుందని, 17 నుంచే బీజేపీ ముఖ్య నాయకులు దృష్టి సారించాల్సి ఉంటుందని చెప్పినా పట్టించుకోకుండా 15, 16, 17 తేదీలకు రైల్ రోకోను పొడిగించిందని విమర్శిస్తున్నారు. ఇదంతా కావాలని చేస్తున్న తంతులాగే కనిపిస్తోందని పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.

తెలంగాణ జిల్లాల్లో క్యాడర్ ఉన్నప్పటికీ జెఏసిలో తెరాస హవానే ఉండటంతో ఇప్పటికే జిల్లాల్లోని క్యాడర్‌లో ఒకింత నిరుత్సాహం నెలకొందట. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అంతో ఇంతో కేడర్ ఉన్న పార్టీకి ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు బలపడకపోతే భవిష్యత్తులో కష్టమని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసుకునే చర్యలకు ఉపక్రమించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జేఏసీ నుంచి బయటపడి తెలంగాణ కోసం సొంతంగా ఉద్యమించాలని చెబుతున్నారు. అద్వానీ రథ యాత్ర అనంతరం పార్టీకి శ్రేణుల్లో కొత్త ఊపు వస్తుందని, ఆ తర్వాత సొంత ఉద్యమంపై ఆలోచించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అద్వానీ రథ యాత్ర అనంతరం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+