అప్పుడే చంద్రబాబు ఇలా చేసి ఉంటే...

అప్పటి నుండి బాబును తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ తెలంగాణపై బాబును ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా తాము గతంలోనే చెప్పామనే మాటలు మినహా అనుకూలమా, వ్యతిరేకమా అనే మాటను మాత్రం బయటకు చెప్పడం లేదు. అంటే బాబు చిదంబరం ప్రకటనకు ముందు తెలంగాణకు అనుకూలంగా, ఆ తర్వాత వ్యతిరేకంగా మాట్లాడడానే భావన అటు తెలంగాణ ప్రజల్లోనే కాదు, ఇటు సీమాంధ్ర ప్రజల్లోనూ ఉంది. మరి బాబు ఏ మాటలు చెప్పాడని భావించవలసి ఉంటుంది. తీర్మానం చేశాం కదా అనే జవాబు చెబితే తీర్మానం చేశాక ప్రణబ్‌కు ఇచ్చిన మాదిరి చిదంబరంకు సైతం ఓ లేఖ ఇవ్వవచ్చు కదా. లేదా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తాము తెలంగాణకు అనుకూలమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కుండబద్దలు కొట్టవచ్చు కదా. అలాంటివేమీ చేయకుండా తమకు రెండు ప్రాంతాలు ముఖ్యమని చెబితే ఏ ప్రాంతం వారూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. చిదంబరం ప్రకటన తర్వాత అయినా, ఇప్పటికైనా చంద్రబాబు తెలంగాణకు ఓకే అంటే కాంగ్రెసు గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. కేంద్రం తెలంగాణ ఇవ్వలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. అయితే ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి బాబు అస్పష్ట వైఖరి కారణంగా కాంగ్రెసు టిడిపినే దోషిగా చేసే ప్రయత్నాలు చేసింది, చేస్తోంది.
ఖచ్చితంగా తెలంగాణపై టిడిపి వైఖరి అవసరం లేదు. కానీ తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు వైఖరి వారికి అనుకూలిస్తుందనడంలో సందేహం లేదు. ఇవి రాజకీయాలలో సహజమే కాబట్టి దానికి కాంగ్రెసును తప్పు పట్టాల్సిన పని లేదు. బాబు తెలంగాణకు ఓకే అంటే కేంద్ర ప్రభుత్వం ఇరుక్కు పోతుంది. తెలంగాణ ఇవ్వడమా లేదా అనే నిర్ణయం పూర్తిగా దానిపైనే భారం పడుతోంది. ఇప్పటికే సీమాంధ్రలో వైయ్ససాఆర్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సత్తా చూపుతున్నాడు. చంద్రబాబు, కాంగ్రెసుల కంటే భిన్నంగా జగన్ తెలంగాణపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెబుతూ ఆయన సమైక్యవాదాన్ని బలపరిచే ఉద్దేశ్యం కనిపిస్తోంది. ఇప్పటికే సీమాంధ్రలో పాతుకు పోయిన జగన్ తెలంగాణకు అభ్యంతరం లేదని చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజల్లో ఎక్కువ విశ్వాసం పొంద లేక పోయినా చంద్రబాబు, కాంగ్రెసులపై ఉన్నంత వ్యతిరేకత మాత్రం కనిపించదు. జగన్ కారణంగా సీమాంధ్రలో టిడిపి, కాంగ్రెసు పరిస్థితి ఆందోళనగా ఉంది. తెలంగాణ అంశం కారణంగా తెలంగాణలోనూ వారి పరిస్థితి అంతే. బాబు, కాంగ్రెసుల పరిస్థితి రెండు ప్రాంతాలలోనూ అంతంత మాత్రమే. తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లోకి వెళ్లినందున వారు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో మళ్లీ బలపడటమే కాకుండా అంతగా సమైక్యాంధ్ర సెంటిమెంట్ లేని సీమాంధ్రలో ఇప్పటికిప్పుడు కాస్త బలహీనపడినా తొందరగానే పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక తెలంగాణ విషయంలో చంద్రబాబు వేసిన మరో ముఖ్యమైన తప్పటడుగు ఆలస్యం. ఏ విషయాన్ని అయినా తెగేదాలా లాగకూడదు. దాదాపు 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమం కారణంగా సెంటిమెంట్ తెలంగాణలోని ప్రతి ఇంటిని చేరుకుంది. మరోవైపు జై ఆంధ్ర, ప్రత్యేక రాయలసీమ అంటూ అప్పుడప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమైక్య రాష్ట్రం పైపై పూతే అనే విషయం చంద్రబాబు మదిని తట్టని విషయమేమీ కాదనే అనుకోవచ్చు. అంతగా మద్దతు లేని సమైక్యవాదానికి చెక్ పెట్టి తెలంగాణకు అనుకూలంగా బాబు నిర్ణయం తీసుకుంటే ఇటు తెలంగాణలో టిడిపి బాగా పుంజుకోవడమే కాకుండా సీమాంధ్రలోనూ అదే స్థాయిలో ఉండేది. కానీ బాబు తన నిర్ణయాన్ని ఆలస్యం చేసిన కారణంగా తెలంగాణలోని సెంటిమెంట్ మాదిరి సీమాంధ్రలోనూ నేతలు సెంటిమెంట్ సృష్టించే ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. దీంతో అంతగా కాకపోయనా కొద్దొగొప్పో సీమాంధ్రలోని యువకుల్లో సమైక్య సెంటిమెంట్ అంటుకుంది. బాబు ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో ఆ కాస్త సెంటిమెంటూ బలపడపోయేదేమో. ప్రస్తుతం సీమాంధ్రులంతా టిడిపిది సమైక్యవాదం అనే భావనలో ఉన్నారు. అయితే ఇప్పటికైనా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఇప్పటికిప్పుడు అక్కడ దెబ్బ తిన్నప్పటికీ 2014 వరకు పుంజుకునే అవకాశాలే ఎక్కువ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.