• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరుతో సోనియాకు కొత్త చిక్కులు?

By Pratap
|
Google Oneindia TeluguNews
Sonia Gandhi
ప్రజారాజ్యం పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకుని పార్టీ రాష్ట్ర బాధ్యతలను చిరంజీవికి అప్పగిస్తే కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కొత్త తలనొప్పులు ప్రారంభం కావచ్చు. చిరంజీవిని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమించి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపి 2014 ఎన్నికలను ఎదుర్కోవాలని సోనియా గాంధీ భావిస్తే మాత్రమే పప్పులో కాలేసినట్లే అవుతుందని అంటున్నారు. దాసరి నారాయణ రావు స్థానాన్ని భర్తీ చేసి, మరింత ప్రజాదరణను పొందడానికి చిరంజీవి పనికి వస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని విజయం దిశగా నడిపించడం అంత సులభం కాకపోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో చిరంజీవిని అడుగు పెట్టనివ్వకపోవడాన్ని పక్కన పెడితే, ఒక వేళ స్టార్ కాంపైనర్‌గా రంగంలోకి తెలంగాణలో కూడా పర్యటించే వెసులుబాటు ఉన్నా కూడా లక్ష్యాన్ని సాధించడం కష్టమేనని అంటున్నారు. చిరంజీవికి రాష్ట్రబాధ్యతలు అప్పగిస్తే రాష్ట్ర స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయకుండా తీసుకున్న నిర్ణయమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం నాయకత్వంలో నడుస్తుండగా, కాంగ్రెసు పార్టీ రెడ్ల సామాజిక వర్గం నాయకత్వంలో నడుస్తోందనే అభిప్రాయం బలం ఉంది. కోస్తాంధ్రలో పోటీ ప్రధానంగా కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య పోటీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కమ్మల నాయకత్వంలో ఉంది కాబట్టి కాపులు సర్వసాధారణంగా కాంగ్రెసు వైపు ఉంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత కాపు వర్గం కొంత మేరకు చిరంజీవిని ఆలంబనగా చేసుకుంది. అయితే, గత ఎన్నికల్లో చిరంజీవికి ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలున్నాయనే ఆందోళనతో కాపు ఓటర్లు కూడా కాంగ్రెసుకు ఓటేసినట్లు పరిశీలకులు తేల్చారు. దీంతో ప్రజారాజ్యం పార్టీ పెద్ద యెత్తున దెబ్బ తినడమే కాకుండా ఏదో మేరకు కాంగ్రెసుకు నష్టం తగ్గింది. కోస్తాలో కాపులను కూడగట్టి కాంగ్రెసు వైపు తీసుకురావడానికి చిరంజీవి కాంగ్రెసుకు అత్యద్భుతంగా పనికి వస్తారు. కానీ, రెడ్లు మాత్రం చిరంజీవికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం లేదు.

తెలంగాణలో చాలా వరకు బిసిల ప్రాబల్యం ఉంది. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కూడా ఏదో మేరకు రెడ్డి భావన ఆ సామాజిక వర్గంలో చోటు చేసుకుంది. బిసిలు మొత్తంగా కాంగ్రెసు వైపు ఉండే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకి కూడా బిసి పునాదులున్నాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వచ్చే వరకు ఎస్సీలు ఓటు బ్యాంక్ కాంగ్రెసుకు ఉండేది. ఎమ్మార్పీయస్ వచ్చిన తర్వాత మాదిగ ఓటు బ్యాంక్ చాలా వరకు తెలుగుదేశం వైపు మళ్లింది. కాంగ్రెసు ఓటు బ్యాంకును చీల్చడానికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎమ్మార్పీయస్‌ను ప్రోత్సహించారనే ప్రచారం కూడా ఉంది. అందువల్ల చిరంజీవి వల్ల తెలంగాణలో నటుడిగా ఆయనకు గల అభిమానం కొంత మేరకు లాభిస్తుందే తప్ప మాస్ లీడర్‌లాగా ఓట్ల దండుకురావడం సాధ్యం కాదు. రాయలసీమలో చిరంజీవి ప్రభావం తక్కువే. ఈ ప్రాంతంలో రెడ్ల ప్రభావమే ఎక్కువ. రెడ్లలోనూ ఫాక్షినిజం వల్ల ఆయా జిల్లాలో నాయకులు కాంగ్రెసులో, తెలుగుదేశంలో రెండు గ్రూపులుగా సర్దుకుపోతారు. వైయస్ జగన్ వల్ల రాయలసీమలో కాంగ్రెసు నష్టపోయే అవకాశం ఉంది. ఆ నష్టాన్ని చిరంజీవి పూడ్చలేరు. ఇప్పటి మాదిరిగానే పరిస్థితి కొంత మేరకు కొనసాగుతుంది.

ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి సీమాంధ్రకు చిరంజీవికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఫలితం కాంగ్రెసుకు పూర్తి అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. కాలం గడుస్తున్నకొద్దీ కోస్తాంధ్రలో వైయస్ జగన్ ప్రాబల్యం తగ్గుతుందని, రాయలసీమలో జగన్ వైపు వెళ్లాలని అనుకునేవారు ఏదో మేరకు కాంగ్రెసులో సర్దుకుపోతారని అంటున్నారు. తెలంగాణ ఇస్తే, ఈ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసులకు మధ్యనే పోటీ ఉంటుందని, తెలుగుదేశం తిరిగి ప్రాబల్యం సంతరించుకోవడం సాధ్యం కాదని అంటున్నారు. ఒకవేళ కెసిఆర్ కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయడానికి ముందుకు వస్తే ఫలితాలు ఏకపక్షం కావచ్చు కూడా. ఏమైనా, చిరంజీవి విషయంలో కాంగ్రెసు జాగ్రత్తగానే ఆలోచించాల్సి ఉంటుంది. రెడ్ల నాయకత్వం లేకుండా గంపగుత్తగా చిరంజీవి మీద ఆధారపడదలుచుకుంటే ఫలితాలు సందేహాస్పదంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
Desktop Bottom Promotion