ముందు విలీనం తర్వాతే పంపకాలు!

అయితే సభ జరగక ముందే మంత్రివర్గ విస్తరణ చేపడితే బాగుండదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. వైఎస్ వివేకా, జూపల్లి రాజీనామాలతో అయిన ఖాళీ అయిన స్థానాలతోపాటు అదనంగా మరో నలుగురికి కేబినెట్‌లో చోటు కల్పించవచ్చు. ఈ ఆరింటినీ ఇప్పుడే భర్తీ చేస్తారా.. లేక రెండు స్థానాలను సీఎం రిజర్వ్‌లో ఉంచుకుంటారా అనేది తేలాలి. పిఆర్పీ నేతలకు రెండు బెర్తులిస్తారని కాంగ్రెస్‌నేతలు చెబుతున్నారు. మిగిలిన పదవుల కోసం కాంగ్రెస్‌లో తీవ్రపోటీ ఉంది. ఎప్పట్లాగే మొదటిసారి ఎన్నికైన వారికి మంత్రి పదవులు ఉండవని అంటున్నారు. అయితే సిఎం కిరణ్ విస్తరణకే పరిమితమవుతారా, కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. కిరణ్ సిఎం అయ్యాక జరిగిన మంత్రివర్గ కూర్పుపై పలువురు సీనియర్ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ పట్ల ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
ఈ శాఖను రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నవారికి కేటాయించాలన్నది ఆయన వాదన. ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దామోదర రాజనర్సింహ హోం శాఖను కోరుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలంతా సబితారెడ్డికి వ్యతిరేకంగా జట్టుకట్టారు. ఆమెకు ఉద్వాసన పలకాలని సీఎంను, అధిష్ఠానాన్ని కోరుతున్నారు. మరో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తన శాఖలపై పూర్తి పట్టు సాధించలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఆమెనుంచి ఇందిరా క్రాంతిపథం, మహిళా స్వయం సహాయ బృందాల శాఖలను తప్పించి వాటిని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్‌కు అప్పగించే వీలుందని చెబుతున్నారు. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, వ్యవసాయం వంటి కీలక శాఖలను రాయలసీమ నేతలకే కేటాయించడంతో... కోస్తామంత్రులు కినుక వహించారు. అప్పట్లో ఈ అంశంపై అధిష్ఠానం జోక్యం చేసుకుని త్వరలోనే పరిస్థితి చక్కదిద్దుతామని హామీ ఇచ్చింది. దీంతో మంత్రుల మార్పులకంటే శాఖల మార్పే అధికంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో స్థానం కోసం ఎస్సీ వర్గానికి చెందిన ప్రసాద్‌కుమార్, కొండ్రు మురళీమోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి వీరిద్దరికీ చాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి కూడా పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ మహమ్మద్ జానీ, సీనియర్ నేతగా పాలడుగు వెంకట్రావు పదవులు ఆశిస్తున్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడికి పలువురు ఎమ్మెల్యేలు లేఖలు కూడా రాశారు. ప్రధానంగా ఎస్సీల్లో మాల మాదిగలకు, గిరిజనుల్లో కోయ లంబాడ కులాలకు, బీసీల్లో అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలుంటే ఒక్కరికే పదవి దక్కిందని, పొరుగున ఉన్న మెదక్ జిల్లాలో పది స్థానాలకు ముగ్గురికి పదవులు దక్కాయని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక పదవి ఉండేలా చూడాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించని వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దని సూచించారు. ఇలా చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications