కడప ఫలితంపైనే కిరణ్ భవిష్యత్తు

కాగా, కడపలో వైయస్ జగన్‌ను ఓడించలేకపోయినా కనీసం రెండో స్థానంలోనైనా నిలబడేలా చూసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌కు విజయం నల్లేరు మీద బండి నడక కాకూడాదని, భారీగా మెజారిటీ తగ్గించే విధంగా కృషి చేయాలని అధిష్టానం ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ, వైయస్ జగన్‌కు మధ్య పోటీ జరిగి, తమ పార్టీ మూడో స్థానానికి పడిపోతే దాని ప్రభావం తీవ్రంగా పడుతుందని అంటున్నారు. భవిష్యత్తులో దాని వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట అటుంచితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని అనుకుంటున్నారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ పోటీలోనే ఉండకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
జగన్‌ను ముప్పు తిప్పలు పెట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి తగిన లక్ష్యాలు నిర్దేశిస్తూనే కాంగ్రెసు అధిష్టానం తన వంతు వ్యూహాన్ని తాను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులుగా ఉండి, ఆయనకు సన్నిహితులుగా మెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులను రంగంలోకి దింపింది. ఉప ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కూడా తిప్పలు తప్పవని అంటున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి కడప ఉప ఎన్నిక పరీక్షలాంటిదే.