• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ జగన్‌దే బంగారు భవితవ్యం!

By Pratap
|
Google Oneindia TeluguNews
YS Jagan
ఆంధ్రుల అభిమాన నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి ముందు ఎందరో నాయకులు వున్నారు. ఆయన అకాల మరణం తర్వాత కూడా ఎందరో నాయకులు పుట్టుకు వస్తున్నారు. కానీ వైయస్ఆర్ తన తరంలోనూ, భవిష్యత్తు తరాల వారికోసం కూడా ప్రజా నాయకుడు ఎలా వుంటాడో, ఎలా ఉండాలో తిరిగి నిర్వచించుకునేలా తన ఆచరణలో చేసి చూపించాడు. కష్ట సుఖాలు రెండింటిలో ఆయన తన అనుచరులకు, అనుయాయుల పక్కన నిలబడ్డాడు. వారు అభివృద్ధిలోకి వచ్చేందుకు అవకాశాలను అందించాడు. వారికి తోడు నీడగా నిలబడి వాళ్ళను పరిరక్షించాడు. కృష్ణుడు ఎవరి పక్కనుంటే వారిని విజయం వరిస్తుందని అర్థం చేసుకున్న పాండవుల్లాగా, వైయస్సార్ లాంటి వ్యక్తి తమ వైపు వుండాలని కుల, మత, వర్గ,పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బహుశా కోరుకుంటారు. ఆయనంటే వారికి గౌరవం, ఆయన వారి లక్ష్యం. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే వాళ్ళకు కాళ్ళల్లో వణుకు పుట్టుకువచ్చేది. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరి దృష్టి ఆయన మీదనే నిమగ్నమయ్యేది. ఆయన మేరునగ ధీర వ్యక్తిత్వ్బాన్ని చూసి అప్రయత్నంగానే లేచి నిలబడేవారు. అదే సమయంలో ఆయన దగ్గర అందరికీ ఒక నిశ్చింత. ఆయన వున్నారన్న ఒక ధీమా. ఆయనే మా నాయకుడు అని గర్వం. ఏం జరిగినా ఆయన చూసుకుంటాడన్న ఒక భద్రత. భగవాన్ కృష్ణుడు లాగా, ఈ ప్రపంచంలో వున్న మంచి పనులన్నీ ఆయన ఆచరణలో చేసి చూపించాడు. ప్రజల సంక్షేమం ఎలా చేపట్టాలో, ప్రజల కోసం ఎలా జీవించాలో ఆయన మార్గదర్శకంగా నిలిచి భవిష్యత్తు నాయకులకు మార్గదర్శకమయ్యాడు.

వైయస్సార్ హఠాన్మరణం తర్వాత ఒక్కసారిగా వైయస్ జగన్ వెలుగులోకి వచ్చాడు. తగినంత రాజకీయ అనుభవం లేకుండానే, ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ నాయకులు, మేధావులు, మామూలు ప్రజల అంచనాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే ఒక్కసారిగా అగ్రనాకుడి బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ఒక్కసారిగా పద్మవ్యూహం లోకి వచ్చి పడ్డాడు. అయినా సరే జగన్ వొణకలేదు, తొణకలేదు. అనేక విపత్కర, ప్రతికూల పరిస్థితులను కూడా తన మేధస్సుతో, ధైర్య సాహసాలతో, అకుంఠిత దీక్షతో, తండ్రి అందించిన బలంతో సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అయితే ఆయన ఎలాంటి తప్పులు చేయలేదా? చేశాడు. ఆ తప్పులు వ్యక్తిగతమైనవా? కాదు, కానే కాదు. వ్యూహాత్మకమైనవా? అవును. కొన్ని పొరపాట్లు మరీ పెద్దవి కాకపోయినా, అవి జరగకుండా నివారించుకోవచ్చు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎమెల్సీ ఎన్నికలు ఉదాహరణగా తీసుకోండి. ఆ ఎన్నికలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం కానీ, ప్రమాదం కానీ లేదు. మొట్ట మొదటిగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ కి మద్దతు నివ్వదు. అంటే, మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులుఎన్నికయినా, లేక ఒకరిని ఓడించినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి వొరిగెదేమీ లేదు. అక్కడ ఏం జరిగినా అది మనకు అవకాశం కాదు, తెలుగుదేశం కి అనుకూలంగా మాత్రమే మారుతుంది. అలా జరగకుండా చూడటమే మన లక్ష్యం అయ్యి ఉండి ఉండాలి. వైయస్సార్ పార్టీ కున్న ముఖ్యమైన అవకాశం ఏమిటంటే సొంత అభ్యర్ధిని నిలబెట్టుకోవడం. అది కూడా ఓ కడప ముస్లిం మేధావిని అయితే చాలా మంచిది అయ్యేది. మొదటి బాలెట్ లోనే ఆ అభ్యర్థి ఎంపికయ్యేలా చూసి ఉండొచ్చు. తద్వారా మనం వైయస్సార్ బాటలోనే నడుస్తున్నామని ముస్లిం సోదరులకి చెప్పి ఉండేవాళ్ళం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మోన్న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలిచింది. అధికార దుర్వినియోగం లేకుండా, మనం సరైన ప్రయత్నం చేసుంటే ఇంకో రెండు స్థానాల్లో గెలిచేవారం. అనంతపూర్ లో పాటిల్ వేణుగోపాల రెడ్డిని, కర్నూల్లో ఎస్వి మోహన్ రెడ్డిని వారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా మనం సమర్ధించకుండా ఉండాల్సింది. ఈ విషయంలో మనం జాని అయినా పాటిల్ అయినా, ఎస్వి అయినా ఇంకెవరైనా ఒక్కటే. మా పక్కుంటే మేము పోరాడుతాము, లేకపోతే ఓడిస్తాం అనే ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఒక్క నెల్లూరులో అదనంగా గెలిచుంటే, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోయ్యేది. త్వరలో పడిపోదా అంటే తప్పకుండా పదిపోద్ది. ప్రజాబలం లేని ఏ ప్రభుత్వం మనజాలదు. ప్రజలు మన పక్కనున్నారు. అది నిర్వివాదం.

ఇప్పటివరకూ జరిగిన వ్యూహాత్మకమైన తప్పులు మరో సారి జరగకుండా అరికట్టాలి. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి. అవును. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహమ్మద్ జానీకి వ్యతిరేకంగా వెళ్లవచ్చు. జానీ ఒకప్పుడు వైయస్సార్ మద్దుతాదారుడే అయినా అధికార కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం ప్రస్తుతం పాకులాడుతున్నాడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా వెళ్ళటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత అభ్యర్థి కడప ముస్లిం తోనే జానీని ఓడించటంతో మన లక్ష్యం, పట్టుదల, సిద్ధాంతాలు ప్రజలకి అర్ధం అవుతాయి. ఇందులో రెండు మార్గాలంటూ ఏమీ లేవు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షానైనా ఉండాలి లేదా శత్రువుగా నైనా ఉండాలి. ఇందులో మళ్ళీ వేరే డొంక తిరుగుడు మాటలు, దొడ్డిదారి వ్యూహాలు ఏమీ లేవు. ఉండవు కూడా. ఇదే విషయాన్ని జగన్ ప్రజలకి స్పష్టం చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీ ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ తన ఓటు వాటాని పోగొట్టుకుంటోంది. తెలుగు దేశం ఎప్పటికీ తాను పోగొట్టుకున్నది పొందలేదు. ఇప్పుడు జన సామాన్యానికి వున్నది ఒకే ఒకే ఛాయిస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ముందుకు దూసుకు వెళ్లకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడే తిరుగుతూ ఉండే లాంటి తప్పులు చేయకపోతే వచ్చే జనరల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి గెలుపు సునాయాసమవుతుంది.

చంద్రబాబు 2020 విజన్ నుండి 420 స్థాయికి పడిపోయాడు. జగన్ ని ఓడించటానికి, జగన్ ఎదుగుదలను అడ్డుకునేందుకు, తాత్కాలిక ప్రయోజనాలకు కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీతో తెలుగు దేశం కుమ్మక్కయ్యేలా చేసి టిడిపి ని నిర్వీర్యం చేశాడు. అలా చేయడం వల్ల, టిడిపి అనేక జిల్లాల్లో మౌలిక స్థాయిలో పోరాట శక్తిని, విశ్వాసాన్ని కోల్పోయింది. ఆయన రెండు కళ్ల, 2020 అబద్ధాల సిద్ధాంతానికి ఇది అదనమయింది. ఆయన వెన్నుపోటు రాజకీయం తిరిగి ఆయన మీదకే నిప్పులు కక్కింది. దీనివల్ల తెలుగు దేశం తెలంగాణా లో పోటీ చేయకపోవడమే మేలు. తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు ప్రకటించి, నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు బిక్కచచ్చి ఎర్రబడ్డ మొహాలతో మిగిలిపోయిన వారి పట్ల నాకు సానుభూతి కలుగుతోంది. తెలుగు దేశం పార్టీ ని చంద్రబాబు కాంగ్రెస్ తో కలిపేయాలి, లేదా పార్టీ ని రద్దు చేసి వ్యాపార రంగం లోకి వెళ్లిపోవాలి. అది తప్ప ఇప్పుడు ఆయనకు మరో మార్గం లేదని నా అంచనా.

వైయస్సార్ మరణం నుంచి జగన్ ముందున్నది పూల బాట కాదు. ముళ్ళ బాట. ఇంకా ముందు ముందు మరిన్ని ప్రతికూల, అననుకూల పరిస్థితులు పొంచి వున్నాయి. రాష్ట్రం లోనూ, కేంద్రం లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా జగన్ ని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకు తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ తొత్తుగా పసుపు మీడియా కూడా తమ తెలివైన వ్యూహాలతో జగన్ మీద బురద చల్లటంలో తమ వంతు సహాయాన్ని చేస్తాయి. అందులో సందేహమే లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా తల ఎత్తి జగన్ తో పోటీ పడదు, దాని బదులు ప్రజల ముందు జగన్ ని అణగదొక్కాలని చూస్తుంది.

కుటుంబంలో అంతర్గత చీలికలు, వాటితో పాటు కొత్త పార్టీ, మద్దతుదారులను కూడగట్టుకునేందుకు వెల్లువలా ఖర్చుపెట్టాల్సిన నిధులు, స్థానిక నాయకులతో వచ్చే సమస్యలను ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కరించటం ఇన్నింటి మధ్యా జగన్ తలమునకలై వున్నాడు. కానీ నాకు వైయస్సార్ అన్నా, జగన్ అన్నా ప్రాణమిచ్చే ప్రజాభిమానం మీద నమ్మకముంది. అప్పుడు వైయస్సార్ వెంట, ఇప్పుడు జగన్ వెంట నడిచే ఆ ప్రజల మీద గౌరవం, విశ్వాసం వున్నాయి. అయినప్పటికీ జగన్ వారితో మరింత ఆత్మీయంగా అనుసంధానం కావాల్సి ఉందని నేననుకుంటున్నాను. వైయస్సార్ పేరు చెప్పగానే నాయకత్వానికి ఓ బలం, ఓ నమ్మకం వస్తాయి కానీ అంతకు మించి కూడా కొంత కావాల్సి ఉంది. వైయస్సార్ కోసం, ఆయన వారసుడి కోసం, ఆయన పేరిట పెట్టిన పార్టీ కోసం జగన్ కి ప్రాణమిచ్చే ప్రజలతో జగన్ ప్రేమాభిమానాలతో అనుసంధానం చేసుకునేందుకు కావాల్సింది యువత, విద్యార్థులు, రైతులు, కార్మికులు, మేధావులు. ఇందులో ఒకొక్కరిది, ఒకొక్క వర్గానిది ఒక్కో భాష. కానీ వారి గొంతుకలన్నీ వినిపించాలి. వారి బాధలన్నీ అర్థం చేసుకోవాలి. ఒకరి బాధను మరొకరికి అర్థమయ్యేలా వివరించగలగాలి. ఉత్తర తెలంగాణా లో కెసిఆర్ చేసినట్లు ప్రతిపక్షాన్ని జగన్ తన కాళ్ళ కింద అణచివేయాలి. కానీ వైయస్ జగన్ ఎప్పటికీ కెసిఆర్ వెళ్ళిపోయిన అధఃపాతాళమ్ స్థాయికి వెళ్లకూడదు. ప్రజలతో జగన్ ఒక్కసారి మమేకమయ్యాక, తన ఉన్నత స్థానంలోకి ఎవరినీ రానివ్వకూడదు. ఎవరికి స్థానం కల్పించకూడదు. అది వివేకానంద రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, లేక చివరకు సోనియా గాంధీ అయినా సరే. అది కెసిఆర్ సాధించాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కెసిఆర్ ఎద్దు ని చూపి పంది అంటే అందరూ అవును, అది పందే అని చెప్పెటట్లు తయారయింది. రాజకీయ చక్రాన్ని కెసిఆర్ అంతగా శాసించగలుగుతున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఒకటుంది. అప్పుడప్పుడూ ఇందులో కొన్ని నిట్టూర్పులు, అసంతృప్తులు వస్తాయి. కానీ మొత్తంగా అవి సమసిపోతాయి. అతని అధికారస్థానం మళ్ళీ అతనికి దక్కుతుంది. సెంటిమెంట్ల ను పక్కన బెట్టి, తప్పనిసరిగా తన మార్గం లో అడ్డం వస్తున్న అందరినీ వివేకానంద రెడ్డితో సహా అందరినీ పక్కకు నెట్టేసి జగన్ తనదైన మార్గం లో ముందుకు సాగాలి. అధికార కళ్లాలను అందుకోవాలి. ప్రధానంగా మన శత్రువులని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓడించి తీరాలి. అప్పుడే వైయస్ జగన్ శక్తి ఏమిటో అందరికీ తెలుస్తుంది. అర్థమవుతుంది.

వైయస్ జగన్, నూతన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించాల్సింది వచ్చే 2014 సాధారణ ఎన్నికల మీద. పులివెందుల లో విజయమ్మ 50 వేల మెజారిటీతో, కడప ఎంపీ సీట్లో జగన్ నాలుగు లక్షలకు పైగా మెజారిటీ తో గెలుపొందితే మధ్యంతర ఎన్నికలు సాధ్యపడతాయి. దీని వల్ల శాసనసభ్యులకు భవిష్యత్తు మనదే అన్న నమ్మకం ఏర్పడుతుంది. అర్థమవుతుంది కూడా. ఖచ్చితంగా అప్పుడే మనం సరిహద్దుల దగ్గర కాపలాను, వొత్తిడిని పెట్టాలి. అప్పుడు మాత్రమే వాళ్ళంతా మన పార్టీ లోకి రాగలరు అనే విషయం జగన్ అర్థమయ్యేలా చెప్పాలి. వారిని మన పార్టీ లోకి ఎప్పటికీ రానివ్వము అనే విషయాన్ని తెలియజేయాలి. వారి స్థానాల్లో వేరే అభ్యర్ధుల్ని తయారు చేసుకుంటాము అని చెప్పాలి. ఈ విషయం లో మాత్రం ఖచ్చితమైన, శాశ్వతమైన అడుగు మనమంతా వేయాలి.

రాష్ట్రం లో పై నుంచి కింద స్థాయి వరకూ వైయస్ జగన్ కి అపూర్వ ప్రజాదరణ వుంది. రాష్ట్రంలో యే ప్రజా నాయకుడు సాధించలేనంత ప్రజాభిమానాన్ని ఆయన పొందగలడు. పొందవచ్చు కూడా. ఆయనను తాకాలని, ఆయనను చూడాలని, ఆయన వెంట వుండాలని, ఆయనతో కలిసి నడవాలని, ఆయన బాధను పంచుకోవాలని కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. వీరే ఆయన కోసం ఏదైనా సరే చేయటానికి సిద్ధపడే వారు. అయినప్పటికీ వారిని సరిగ్గా అర్థం చేసుకొని ఉపయోగించుకోకపోతే, లేదా వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది చాలా ప్రమాదకరం. దురదృష్టవశాత్తూ ఈ ప్రజలనే అందరూ నిర్లక్ష్యం చేసేది. లేదా ఉపయోగించుకోకుండా పక్కన పెట్టేసేది. ఎవరి ఆధ్వర్యం లోనైనా వారిని వీలైనంత తొందరలో పార్టీ లోకి తెప్పించి తన కోసం వారిని సిద్ధంగా ఉంచేలా జగన్ తగిన చర్యలు తీసుకోవాలి. ఈ ఉద్యమాన్ని సరైన విధంగా నడిపించేందుకు కృషి చేయాలి. జగన్ శిబిరంలోని మామూలు రాజకీయ నాయకులు ఈ పని సమర్దవంతంగా చేయలేరు. ఎవరికి వారు తమ సొంత అనుయాయులను సమకూర్చుకునే ప్రయత్నంలో సుఖంగా, సంతోషంగా గడిపేస్తుంటారు. కానీ ప్రాణమిచ్చే ప్రజలను మన వైపుకు మళ్ళించుకునే చర్యలు చెప్పట్టడం మనకు తప్పనిసరి. అదే మన ప్రధాన కర్తవ్వ్యం.

వైయస్ జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమైన నాయకత్వం, అడ్వైజరీ కమిటీలు ఎలాంటి తప్పులు కొత్తగా చేయకూడదు. పాత తప్పులను పునరావృతం చేయరాదు. ముఖ్యమైన నాయకుల మధ్య విభేదాలను తగ్గించాలి. వ్యక్తిగత ప్రయోజనాలను అరికట్టాలి. అగ్ర నాయకత్వం జగన్ ని సరైన దిశలో నడిపించాలి. తాను తీసుకునే నిర్ణయాలను, ప్రజలలో చేసే ప్రసంగాలను జగన్ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. ఇదంతా కూడా మనకందరికీ కొత్తే. ఉన్నట్లుండి ఒక్కసారిగా నిప్పులగుండం లోకి తోసినట్లు మనకందరకు ఉంది. ఈ పోరాటం వైయస్సార్ కోసం, ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆయన్నే దేవుడిగా భావించే ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం. గెలుపుని సాధించేందుకు మనం పోరాడాలి. లేదా ఈ సమరంలో మనం కనుమరుగైపోతాము. మనం అలా వొడిపోవటం వైయస్సార్ ఆత్మకు ఇష్టం లేదు. అలా జరిగితే ఆయన ఆత్మ శాంతించదు. ఆయన కోసం మనం గెలవాలి. దేవుడు లాంటి వైయస్సార్ మనల్ని తప్పక గెలిపిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది.

- గురవారెడ్డి, ఎన్ఆర్ఐ – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , అట్లాంటా, జార్జియా

English summary
NRI Gurava Reddy opins that YSR Congress party leader YS Jagan has good future in politics. He said that YS Jagan will win next election in big way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X