• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సాలార్ కోటలో సవాల్

By Pratap
|

Salahuddin Owaisi
సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కోటలో సంచలన సంఘటన జరిగింది. హైదరాబాద్ పాతబస్తీలో ఓవైసీ కుటుంబానికి ఎదురు లేదని భావిస్తూ వస్తున్న నేపథ్యంలో శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి జరిగింది. ఇది మామూలు దాడి కాదు. దాడిలో అక్బరుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. సాలార్ సుల్తాన్ సలావుద్దీన్‌కు పాతబస్తీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఆయనను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సలావుద్దీన్ వరుసగా ఆరు సార్లు హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సాలార్ మజ్లీస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు నాయకత్వం వహిస్తూ వచ్చారు. దాన్నే మజ్లీస్ పార్టీగా వ్యవహరిస్తారు.

సాలార్ మరణం తర్వాత మజ్లీస్‌కు ఆయన ఇద్దరు కుమారులు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. తండ్రికి దీటుగా పాతబస్తీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట నుంచి శాసనసభకు ఎన్నికై మజ్లీస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తుండగా, అసదుద్దీన్ హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాలార్ - ఎ - మిలెట్‌ (సామాజిక వర్గం కమాండర్)గా సలావుద్దీన్‌ను వ్యవహరించేవారు. చిన్నగా ఆయనను సాలార్‌గా వ్యవహరించేవారు. సాలార్ పేరు చెప్తే ప్రత్యర్థులకు గుండె దడ. ఆయన 2008 సెప్టెంబర్ 29వ తేదీన మరణించారు.

నిజానికి, అఖిల భారత మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నైజాం జమానాలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న హైదరాబాద్ రాజ్యంవారిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చింది. దాని కార్యకర్తలను రజాకార్లుగా పిలిచే వారు. దానికి కాశిం రజ్వీ నాయకత్వం వహించేవాడు. తెలంగాణ పల్లెల్లో కాశిం రజ్వీ ఆగడాలకు అంతులేదు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత ఆ పార్టీకి సాలార్ నాయకత్వం వహిస్తూ వచ్చారు. దాన్ని ఎన్నికల బరిలోకి దింపి నైజాం రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో పట్టు సాధించారు. ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా చెలామణి అవుతూ వచ్చారు.

సాలార్‌ను ఎదుర్కోవడానికి అప్పటి బిజెపి నాయకుడు ఎ. నరేంద్ర తీవ్రంగా ప్రయత్నించారు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నరేంద్ర అందుకు గాను టైగర్‌గా పేరు సంపాదించుకున్నాడు. సిపిఎం కూడా పాతబస్తీలో పాగా వేయడానికి ప్రయత్నించింది. బిజెపి ఒక్కప్పుడు పాతబస్తీలో బలంగా ఉండేది. బద్దం బాల్ రెడ్డి వంటి బిజెపి నాయకులు ఎప్పటికప్పుడు సాలార్‌కు సవాల్ విసురుతూ వచ్చారు. కానీ క్రమంగా బిజెపి వెనక్కి తగ్గుతూ వచ్చింది. పాతబస్తీ నుంచి దాని మద్దతుదారులు కొత్త నగరానికి వలసలు పెరగడం కూడా అందుకు ఓ కారణం. కాగా, సాలార్‌కు అత్యంత సన్నిహితుడైన అమానుల్లా ఖాన్ ఆ తర్వాత విభేదించి ఎంబిటిని స్థాపించాడు. మజ్లీస్‌కు దీటుగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ, ఫలితం అంతంత మాత్రంగానే సాధించాడు. ఇప్పటికీ ఆ పార్టీ కొనసాగుతోంది. మజ్లీస్‌ను వ్యతిరేకించేవారు పాతబస్తీలో ఎంబిటి వైపు ఉండడం సాధారణ విషయంగా మారింది.

సాలార్ మృతి తర్వాత ఆయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ పాలక పార్టీకి దగ్గరగా ఉంటూ తమ పనులు చేయించుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. పాలక పార్టీలకు దగ్గరగా ఉంటూ మరో పార్టీ పాతబస్తీలో పట్టు సాధించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇదే సమయంలో విద్యా సంస్థలను, ఆస్పత్రులను, ఇతర సంస్థలను స్థాపించి ఓవైసీ కుటుంబం ఆర్థికంగా కూడా పటిష్టంగా మారుతూ వచ్చింది. ఈ స్థితిలో అక్బరుద్దీన్‌పై దాడి జరగడం ఓవైసీ కుటుంబానికి రాజకీయంగా సవాల్ లాంటిదే.

English summary
MIM leader Salar Salahuddin Owaisi family is continuing its hegemony in Hyderabad old city for years together. Attack on Akbaruddin Owaisi is a political challenge to that family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X