ఢిల్లీలో వైయస్ జగన్ ఎందుకు దెబ్బ తిన్నారు?

బిజెపికి దగ్గరవుతున్నట్లు జగన్ ఢిల్లీకి వెళ్లేనాటికే రాజకీయ వర్గాల్లో ఓ అభిప్రాయం పాదుకుపోయి ఉంది. అయితే, కేవలం బిజెపికి దగ్గరవుతున్నారనే కారణం వల్లనే జగన్‌కు జాతీయ పార్టీల నాయకులు దూరంగా ఉంటున్నారని అనుకోలేం. జగన్ ఢిల్లీకి వెళ్లారో లేదో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు వార్త దావానలంలా వ్యాపించింది. అనూహ్యమైన ఈ అరెస్టు జగన్ ప్రయత్నాలను తీవ్రంగా దెబ్బ తీసింది. గాలి జనార్దన్ రెడ్డితో వైయస్ జగన్‌కు సాన్నిహిత్యం మాట అటుంచితే, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైనా విచారణను, దర్యాప్తును ఎదుర్కోవాల్సిందేననే అభిప్రాయాన్ని కాదనలేని స్థితి.
వైయస్ జగన్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దాంతో జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. సిబిఐ దర్యాప్తును ఆపాలని డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఈ స్థితిలో ఎవరిని సమర్థించాలన్నా నైతికత ముందుకు వస్తుంది. సిబిఐని కాంగ్రెసు వేధింపులకు వాడుకుంటోందా, లేదా అనేది ద్వితీయ స్థానంలోకి వెళ్లిపోయి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిగితే ఎలా తప్పు పడతారనే ప్రశ్న ముందుకు వస్తుంది. అందువల్ల జగన్‌కు మద్దతు ఇవ్వడానికి రాజకీయ పార్టీల నాయకులు వెనకాడుతున్నారు. పార్లమెంటులో జగన్‌కు అనుకూలంగా ప్రకటన చేసినట్లు సంకేతాలు వెళ్లడంతోనే బిజెపి ఆత్మరక్షణలో పడింది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో బిజెపి మరింత ఇరకాటంలో పడింది. బిజెపికి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టే కక్కలేని మింగలేని పరిస్థితిని కల్పిస్తే, వైయస్ జగన్‌ను ఎలా భుజాల మీద మోస్తుందనేది ప్రశ్న.












Click it and Unblock the Notifications