కెసిఆర్, వైయస్ జగన్: ఒక్కరికొక్కరు

తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని, కాంగ్రెసు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడే కాపాడుతున్నారని ఆ ఇద్దరు నాయకులు కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. తీరా, అవిశ్వాసం ప్రతిపాదించడానికి ముందుకు వచ్చే సరికి తెరాస శాసనసభ్యులు తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చారు. తెలంగాణపై తీర్మానం చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తేవాలని వారు పట్టుబడుతున్నారు. తెలంగాణ తీర్మానానికి చంద్రబాబు మద్దతిచ్చే పరిస్థితి లేదు. ఒక్క రకంగా తెరాస వైపు నుంచి చూస్తే ఆ పార్టీ శాసనసభ్యులు చేస్తున్న డిమాండ్ న్యాయమైందనే అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోటి అవసరం లేదని చెబుతున్న తెరాసకు రైతు సమస్యలపై చంద్రబాబు పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిన అవసరం లేదు.
కాగా, చంద్రబాబు ప్రతిపాదించే అవిశ్వాసానికి తన వర్గం శాసనసభ్యులు మద్దతిస్తారని జగన్ ప్రకటించారు. అయితే అందుకు ఆయన వర్గానికి చెందిన మెజారిటీ శానససభ్యులు సిద్ధంగా లేనట్లు ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అర్థమవుతోంది. అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వచ్చి, ఓటింగు జరిగితే జగన్ మాటకు కట్టుబడి ఓటేసేది ఎంత మంది అనేది సందిగ్ధంగానే ఉంది. చాలా మంది శాసనసభ్యులు ఆయన మాట వినకపోవచ్చు. దీంతో జగన్ వర్గం కకావికలమవుతుంది. జగన్ బలహీనపడిన విషయం బయటపడుతుంది. పైగా, ప్రభుత్వాన్ని కాపాడడానికే జగన్ తన వర్గం ఎమ్మెల్యేలను కాంగ్రెసు వైపు పంపించారనే విమర్శ తెలుగుదేశం నుంచి పెరుగుతుంది. దీంతో అవిశ్వాస తీర్మానం చర్చకే రాకుండా చేస్తే పరువు దక్కుతుందనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే తెరాస సభ్యులు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏమైనా, చంద్రబాబుకు తెరాస, వైయస్సార్ కాంగ్రెసులపై విమర్శలు చేయడానికి అస్త్రాలు అంది వచ్చి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సురక్షితంగా గట్టెక్కుతుంది.












Click it and Unblock the Notifications